నెట్టింట్లో గాలం వేస్తున్న కేటుగాళ్ళు…
ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురు..ఇంటర్‌లో (సీబీఎస్‌ఈ) 96 శాతం పర్సెంటేజ్ సాధించి 2014లో వార్తల్లో ప్రముఖంగా నిలిచి ఐఐటీ, ఢిల్లీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన తెలివైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆన్లైన్ మోసగాడి బారిన పడి డబ్బులు కోల్పోయిందంటే నమ్మగలమా.. నమ్మి తీరాలి.. ఓఎల్‌ఎక్స్ (OLX)లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మడానికి ప్రయత్నించగా ఓ వ్యక్తి ఆమెకు క్యూఆర్ కోడ్ పంపించి రెండు దఫాలుగా ఆమె అకౌంట్‌లోని రూ.34 వేలను తస్కరించాడు. ఎంతో తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకున్న అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితకే ఆన్లైన్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురి అయితే సామాన్యుల పరిస్థితి ఏంటని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
బేరం మాటున నేరం
సులువుగా డబ్బు సంపాదించేందుకు కొందరు సైబర్ నేరస్తులు ఆన్లైన్ మోసాల బాట పడుతున్నారు. ఈ ఆన్లైన్ మోసాలు పలు రకాలుగా ఉంటాయి. బ్యాంకు అధికారులమని చెప్పి ఏటీఎం నంబర్ ను సివివిని అడిగి ఫోన్ కి వచ్చే పాస్వర్డ్ చెప్పమని బ్యాంకులో ఉన్న మొత్తాన్ని స్వాహా చేసేది ముఠాలు కొన్నైతే పాత వస్తువులు అమ్ముతాం/కొంటాం అంటూ బేరం మాటున గుటకాయ స్వాహా చేసే ముఠాలు మరికొన్ని.. రెండింటి లక్ష్యం ఒక్కటే.. అమాయకుల బ్యాంకులో దాచుకున్న సొమ్ములను స్వాహా చేయడమే..
తాము మిలటరీలో పని చేస్తున్నాం అంటూ,అబ్రాడ్ వెళ్తున్నాం,ఉద్యోగం వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయింది అంటూ ఎక్కువ ఖరీదైన వస్తువులను అతి తక్కువ మొత్తానికి ఓఎల్‌ఎక్స్, క్వికర్ లాంటి ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి పెడతారు కొందరు సైబర్ నేరగాళ్లు. వాటిని చూసి బుట్టలో పడేవాళ్లే వాళ్ళ టార్గెట్.. మాటల్లో పెట్టి ఏవేవో లింక్స్ పంపిస్తారు. ఆ లింక్స్ క్లిక్ చేయగానే మన సొమ్ము మనకు తెలియకుండానే స్వాహా అవుతుంది.
మరికొందరు కేటుగాళ్ళు మనం ఏవైనా వస్తువులను అమ్మకానికి పెడితే కొంటామని మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఆన్లైన్ లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాం అంటూ నమ్మబలుకుతారు. తెలివిగా గూగుల్ పే నుండి,ఫోన్ పే లాంటి యూపీఐ అప్లికేషన్ల ద్వారా డబ్బు చెల్లించకుండా రిక్వెస్ట్ పెడతారు.. పొరపాటున రిక్వెస్ట్ అంగీకరించి పాస్వర్డ్ను ఎంటర్ చేసామా.. ఇక అంతే సంగతులు.. మరికొందరు మొదట కొంత మొత్తాన్ని మనకు అకౌంట్ వెరైఫికేషన్ కోసం పంపిస్తున్నాం అంటూ పంపిస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ ను పంపి దాన్ని స్కాన్ చేయమని చెప్పి మొత్తం దోచేస్తారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెను ఇదే తరహాలో మోసం చేశారు.
సైబర్ నేరస్తులను గుర్తించడం ఎలా?
ముందుగా వస్తువు మార్కెట్ ధరకు సంబంధం లేకుండా ప్రకటనలు ఇచ్చేవారి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మాటల్లో పెట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పడమో ఇతర లింకులు పంపి క్లిక్ చేయమని చెప్పేవారిని మోసగాళ్లని నిర్దారించుకోవచ్చు. బ్యాంక్ అధికారులు మన పర్సనల్ ఖాతాల గురించి ఎప్పుడూ ఫోన్ చేయరు. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం అంటూ ఏటీఎం నంబర్ సివివి నంబర్లని ఆడిగారంటే వాళ్ళు మోసగాళ్లని అర్థం చేసుకోవాలి. నేరగాళ్లు పంపే వివిధ లింకులను క్లిక్ చేయడం క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. వివిధ కంపెనీల కస్టమర్ కేర్ నంబర్లను ఆయా కంపెనీల ఆఫీషియల్ వెబ్సైట్లలో తీసుకోవాలి తప్ప గూగుల్ సెర్చ్ చేయకూడదు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరస్తులు ఆశల వల విసురుతూనే ఉంటారు. ఆశల ఉచ్చులో చిక్కుకోవడం వల్లనే మన సొమ్ములు స్వాహా అవుతాయని గుర్తించి జాగరుకతతో వ్యవహరిస్తే సైబర్ నేరస్తుల బారి నుండి తప్పించుకోవచ్చు..