పొరుగు దేశం మయన్మార్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) నేత అంగ్ సాన్ సూకీతో పాటు పలువురు సీనియర్ నేతలను సైన్యం అదుపులోకి తీసుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సైన్యాధికారులు దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీని విధించారు. ప్రభుత్వాధినేతలను అరెస్టు చేశారు. సూకీ సహా ఇతర నేతలను జైలుకు తరలించారు.
ఎమర్జెన్సీతో దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మయన్మార్ రాజధాని న్యాపిటావ్ లో టెలిఫోన్ సేవలు నిలిచిపోయాయి. ప్రసార, ప్రచార సాధనాలపైనా ఆంక్షలు విధించింది. అధికార ఎమ్ఆర్టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల ప్రసారాలనూ అందించలేకపోతున్నామని ఎమ్ఆర్టీవీప్రకటించింది. తాజా పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన రాజకీయ నేతల్లో నెలకొంది. తనను కూడా అరెస్టు చేస్తారని, అయినా ప్రజలు ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడవద్దని ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి మో నూన్ట్ కోరారు.
2011 వరకూ మయన్మార్ సైనిక పాలనలో ఉంది. సైనిక పాలన కాలంలో అంగ్‌సాన్ సూకీ ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలో ఉన్నారు. హక్కుల సంస్థలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల ఫలితంగా చివరకు ఆమె నిర్బంధం నుంచి బయటపడగలిగారు. అనంతరం 2015 సాధారణ ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్‌డీ ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయిదేళ్ల తరువాత గత ఏడాది నవంబర్‌లో మరోసారి ఎన్నికలను నిర్వహించారు. వరుసగా రెండోసారీ ఎన్ఎల్‌డీ మెజార్టీ సీట్లను సొంతం చేసుకొంది.
తాజా ఎన్నికల్ని సైన్యం గుర్తించలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఎన్నికల కమిషన్ కు అందజేసింది. ఎన్నికల్లో అక్రమాలపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది. సైన్యం చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. కమిషన్ విచారణ నివేదికను వెల్లడించిన రెండు రోజుల్లోనే సైన్యం తిరుగుబాటుకు పూనుకుంది. సోమవారం పార్లమెంటు తొలి సమావేశం జరుగనున్న నేపథ్యంలో సైన్యం తిరుగుబాటు చేసింది. యాంగాన్ సహా పలు నగరాలను తన అధీనంలోకి తీసుకుంది.
మరోవైపు సైనిక తిరుగుబాటుపై అమెరికా స్పందించింది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ఇలాంటి చర్యలను సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలన కొనగించేలా సైన్యం సహకరించాలని కోరింది. అరెస్టు చేసిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీ సహా నేతలందరినీ విడుదల చేయాలని సూచించింది. సైన్యం వెనక్కితగ్గకపోతే ఆర్థిక పరమైన ఆంక్షలతో ముందుకువస్తామని ఆసియా మానవ హక్కుల డైరెక్టర్ జాన్ సిఫ్టన్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా సైతం మయన్మార్ సైనిక తిరుగుబాటును తప్పుబట్టింది. సైన్యం అదుపులోకి తీసుకున్న నేతలను విడుదల చేయాలని కోరింది.