కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పార్టీ అధిష్ఠానం పునర్ వ్యవస్థీకరించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి ఇది. 26 మంది శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన ఓ జాబితాను కాంగ్రెస్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ పునర్ వ్యవస్థీకరణలో పలువురు సీనియర్లను అధిష్ఠానం పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్ తొలగించింది. ఆజాద్‌తో పాటు అంబికాసోని, మోతీలాల్‌వోరా, మల్లికార్జున ఖర్గేను కూడా అధిష్టానం తొలగించింది. ఇప్పటి వరకూ యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఆజాద్ వ్యవహరించారు. అయితే.. పార్టీలోని సీనియర్లు, కీలక నేతలుగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టడం వెనక కారణాలేమైనా పార్టీకి మేలు కన్నా కీడే చేస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సమావేశం అనంతరం నుంచి మారుతున్న సమీకరణాలు
గత సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం నుంచి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న మార్పులు చేర్పులను గమనిస్తే పార్టీలో అసమ్మతి స్వరాలను అణచివేసేందుకే సోనియాగాంధీ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అసమ్మతి లేఖ సూత్రధారులైన రాజ్యసభలో పార్టీ నేత, ఉపనేతలైన ఆజాద్, ఆనంద శర్మలతో పాటు లోక్ సభలో పార్టీ సీనియర్లు శశి థరూర్, మనీశ్ తివారీలకు గట్టి షాక్ ఇచ్చారు. అనుభవం, వాగ్దాటి ఉన్న వీరిని కాదని తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న జైరాం రమేశ్ ను రాజ్యసభలో చీఫ్ విప్ గా నియమించారు. రాజ్యసభ లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఓ కమిటీని వేశారు. ఆ కమిటీకి ఆమె రాజకీయ సలహాదారు కాగా, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే లోక్ సభలో పార్టీ ఉపనేతగా గౌరవ్ గొగోయ్ ను, విప్ గా రవనీత్ సింగ్ బిట్టూను నియమించారు. వాస్తవానికి థరూర్, తివారీ మంచి వక్తలు. పార్టీ విధానాలను స్పష్టంగా సభలో చాటే సత్తా వారికుంది. అయినప్పటికీ అసమ్మతి లేఖపై సంతకం చేసినందుకు వారిని పక్కనబెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణలో కూడా సీనియర్లను పక్కన పెట్టడంతో అదే నిజమనే వాదనలు బలపడుతున్నాయి.
లోపాలు సరిదిద్దుకోవాలని చెప్పడమే తప్పా..?
గత సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు రోజు కాంగ్రెస్ కు చెందిన 23 మంది ముఖ్య నాయకుల సంతకాలతో అధిష్టానానికి లేఖ రాశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనే పేర్లు ప్రస్తావించకుండా.. పార్టీకి ఫుల్‌టైమ్ అధ్యక్షుడు కావాలని, ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాలని తాత్కాలిక అధ్యక్షురాలికి సూచించారు. అలాగే పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపారు. అంతటితో ఆగకుండా బీజేపీ బలపడడానికి గల కారణాలను కూడా విశ్లేషించినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు సీనియర్లు రాసిన లేఖను నిశితంగా పరిశీలిస్తే.. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తులకు అధ్యక్ష పదవి అప్పగించాలన్నది పరోక్ష డిమాండ్ అన్నట్లుగా కొందరు అర్థం చేసుకుంటున్నారు. అందుకే రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని, లేఖను తప్పు బట్టారని తెలుస్తోంది. అంతేకాదు.. సీనియర్లంతా బీజేపీతో కుమ్మక్కై ఈ లేఖను రాశారని కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు. సమావేశం అనంతరం రాహుల్ చేసిన వ్యాఖ్యలు తమను ఉద్దేశించినవి కావని సీనియర్లు చెబుతూనే.. లోపాలుంటే చెప్పడం.. సరిదిద్దుకోవడం తప్పేముందని ఆజావ్ వంటి నేతలు వ్యాఖ్యానించారు. వాటినేమీ పట్టించుకోకుండా సీనియర్ల కు కత్తెర పెట్టడమే లక్ష్యంగా అధిష్ఠానం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాల వల్ల పార్టీ పటిష్ఠత ఎలాగున్నా.. లోపాలు ఎత్తిచూపితే తప్పిస్తున్నారన్న ప్రచారంతో ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం తగ్గుతందనే వాదన వినిపిస్తోంది.