iDreamPost
iDreamPost
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నదీ జలాల పర్యవేక్షణ నదీ యాజమాన్య బోర్డుల చేతుల్లోకి వెళుతోంది. వచ్చే నెల 14 నుంచి ముహూర్తంగా నిర్ణయించిన కేంద్రం దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) తో పాటుగా గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ)కి కూడా చీఫ్ ఇంజినీర్లను నియమించింది. ఒక్కో బోర్డుకి ఇద్దరేసి చొప్పున నలుగురిని ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకే దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీఆర్ఎంబీకి సీడబ్ల్యూసీ హెడ్ క్వార్టర్స్ లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన డా. ఎంకే సిన్హా తో పాటుగా అదే కార్యాలయంలో (వైబీవో) చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జీకే అగర్వాల్‌ను సీఈవోలుగా నియమించారు. ఈ ఇరువురు సుదీర్ఘకాలంగా జలశక్తి శాఖ వ్యవహారాల్లో కీలక అధికారులుగా ఉన్నారు. ఉత్తరాదికి చెందిన అధికారులు కావడంతో వారి నియామకం జరిగినట్టు కనిపిస్తోంది. రాష్ట్రేతర అధికారులను నియమిస్తామని గతంలోనే గెజిట్ లో కేంద్రం పేర్కొంది.
ఇక కేఆర్ఎంబీకి కూడా ఇద్దరు సీఈవోలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కోయంబత్తూర్‌లో సీడబ్ల్యూసీకి చెందిన కావేరీ-ఇతర దక్షిణాది నదుల సంస్థ (సీఅండ్‌ఎ్‌సఆర్‌వో) చీఫ్ ఇంజనీర్ టీకే శివరాజన్ ని నియమించారు. ఆయన తమిళనాడుకి చెందిన అధికారి. ఆయనతో పాటుగా లఖ్‌నవూలోని ఎగువ గంగా బేసిన్ సంస్థ (యూజీబీవో) చీఫ్ ఇంజనీర్ అనుపమ్ ప్రసాద్ కూడా చీఫ్ ఇంజినీర్ గా నియమితులయ్యారు. ఈయన బీహార్ కి చెందిన అధికారిగా చెబుతున్నారు. కొత్తగా చీఫ్ ఇంజినీర్లుగా నియమించిన నలుగురు అధికారులు పూర్తి బాధ్యతల్లో ఆయా బోర్డు వ్యవహారాలు చూస్తారు. మూడు నెలల పదవీకాలానికి వారిని నియమించారు. ఆ తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కొనసాగుతారని కేంద్రం పేర్కొంది.
Also Read : అంతకు మించే జగన్ దూకుడు ఉండనుందా?
తాజాగా ఆ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో కేఆర్‌ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్, జీఆర్‌ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సంబంధిత అధికారులు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టులు, జలవివాదాలపై చర్చలు జరిగాయి. గెజిట్‌కు లోబడి ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏవిధమైన చర్యలు తీసుకోవాలన్న కోణంలో ఈ సమావేశంలో చర్చ సాగినట్టు ప్రచారం సాగుతోంది.
ఈ బోర్డుల పెత్తనం విషయంపై ఇరు రాష్ట్రాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బోర్డులకి బాధ్యత అప్పగించడంపైనే అభ్యంతరం పెట్టింది. ట్రిబ్యునల్ వేసి నీటి పంపిణీ పునః సమీక్ష చేయాలని కోరుతోంది. తక్షణమే ఈ రెండు నదలపైన 100కి పైగా చిన్నా, పెద్దా ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించడం సరికాదని చెబుతోంది. అదే సమయంలో బోర్డుల నిర్వహణ భారం కూడా ఆయా రాష్ట్రాలే భరించాలంటూ షరతు విధించడం కూడా తగదని తెలంగాణా చెబుతోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం వివాదాలకు సంబంధం లేని ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావడం సరికాదని కేంద్రానికి తెలిపింది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ వంటి వాటిని కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావడం సమంజసం కాదని లేఖలు రాసింది.
అదే సమయంలో వెలిగొండ సహా అనేక ప్రాజెక్టులకు గతంలోనే అన్ని అనుమతులు వచ్చినప్పటికీ ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ లో దానికి భిన్నంగా ప్రస్తావించడాన్ని తప్పుబట్టింది. తక్షణం సరిదిద్దాలని కోరింది. ఈ అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇటీవల పలువురు నేతలు కేంద్రం పెద్దలను కలిసిన సమయంలో వెలిగొండ ప్రాజెక్టు విషయంలో సానుకూల స్పందన వచ్చింది. ఇతర సమస్యలు కూడా పరిష్కారిస్తారనే ఆశాభావం ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది.
Also Read : బాగున్నారా అంకుల్ : వాళ్లకు చినబాబు ఫోన్లు…?
అయితే తమ అభ్యంతరాలను పెడచెవిన పెట్టి కేంద్రం బోర్డులకు నదీ జలాల నిర్వహణ అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయడాన్ని తెలంగాణా జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు జలాల వినియోగం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం, కేఆర్ఎంబీ ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన తరుణంలో బోర్డుల నిర్వహణలోకి ప్రాజెక్టులు మళ్లితే తమ ప్రయత్నాలు బెడిసికొడతాయని భావిస్తోంది.
అదే సమయంలో ఇటీవలి సమావేశంలో నదీ జలాల పంపిణీకి సంబంధించి కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయం అమలుచేయడంతో పాటుగా, అనుమతులు లేని ప్రాజెక్టులకు అడ్డుకట్ట పడే ప్రమాదం పొంచి ఉండడంతో తెలంగాణా అధికారులు తలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉభయ రాష్ట్రాల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే వ్యవహారం ఈ స్థాయిలో ముదిరి ఉండేది కాదనేది పలువురి వాదన. దానికి కారణం తెలంగాణా ప్రభుత్వ ఏకపక్ష వైఖరి అన్నది సుస్పష్టం. ఒంటెద్దుపోకడతో వ్యవహరించి ఇప్పుడు కేంద్రం నియమించిన బోర్డుల పట్ల కలవరపడుతున్నా ప్రయోజనం ఉండదనే వాదన వినిపిస్తోంది.