మూడు రోజుల క్రితం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్డీఓ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అంతర్రాష్ట్ర ఒప్పంద కౌంటర్ సంతకం పర్మిట్లు బస్సులో పెట్టకపోవడంతో ఏపీకి చెందిన ఐదు బస్సులను సీజ్ చేస్తున్నట్లు తమిళనాడు ఆర్టీవో అధికారులు ప్రకటించారు. దీంతో తమిళనాడు ఆర్టీవో అధికారులకు అదే రీతిలో సమాధానమిచ్చారు ఆంధ్రప్రదేశ్ అధికారులు. తమిళనాడుకి చెందిన బస్సుల్లో సరైన పర్మిట్లు లేవని 24 బస్సులని సీజ్ చేశారు.
పర్మిట్లు లేకుండా తమిళనాడు బస్సులు ఆంధ్రప్రదేశ్ లో నడుపుతున్న కారణంగా బస్సులను సీజ్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్టీవో అధికారులు ప్రకటించారు. నిజానికి ఈ నెల 11 న అంతర్రాష్ట్ర ఒప్పంద తాత్కాలిక కౌంటర్ పర్మిట్‌ను చెన్నైలోని అంతర్రాష్ట్ర రవాణా అథారిటీ అధికారులు జారీ చేశారు. ఈ పర్మిట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులకు అందకపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాటిని పెట్టలేకపోయారు. దాంతో పర్మిట్లు లేవని రాష్ట్రానికి చెందిన 5 ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీవో అధికారులు సీజ్ చేశారు.
దాంతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్టీవో అధికారులు పర్మిట్లు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్న 24 తమిళనాడు బస్సులను సీజ్ చేయడంతో పాటు తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. దాంతో ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకోవడంతో ఆ చర్చలు సఫలీకృతం కావడంతో రెండు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సులను వదిలేశారు.