iDreamPost
android-app
ios-app

వలస కూలీలు, కార్మికుల తరలింపుపై ఏపీ ప్రత్యేక చర్యలు.. ఫోన్ నంబర్లు ఏర్పాటు..

వలస కూలీలు, కార్మికుల తరలింపుపై ఏపీ ప్రత్యేక చర్యలు.. ఫోన్ నంబర్లు ఏర్పాటు..

వలస కూలీలు, కార్మికులు వారి వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. కార్మికులు, కూలీల తరలింపుపై మార్గదర్శకాలను వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు వివరాలను వెల్లడించారు.

గుంటూరు జిల్లాలో 64,300 మంది వలస కూలీలు ఉన్నారని వెల్లడించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15వేల మంది పొగాకు పనుల కోసం వచ్చారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న మన రాష్ట్రం వారు 12 వేల మంది ఇప్పటికీ రిపోర్ట్ చేశారని తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన వారి సమాచారం ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించామని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల నుంచి సుముఖత లేఖలు వచ్చిన తర్వాత వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్మికులు, వలస కూలీలు సహాయం కోసం 0866 2424680 కాల్ చేసి వివరాలు వెల్లడించాలని వివరాలు చెప్పాలని కోరారు. ఆ నంబర్ కి డైల్ చేయడం ద్వారా నేరుగా 1902 కాల్ సెంటర్కు చేరుకుంటుందని తెలిపారు.

రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలకు జిల్లాకు కార్మికులు, కూలీలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో పనులు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. అయినా వారు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపితే పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వారు సహాయం కోసం 1902 కి ఫోన్ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారు కూడా 1902 కి కాల్ చేసి వివరాలు చెప్పాలన్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే వీరందరిని వారి స్వస్థలాలకు పంపుతామని తెలిపారు.

కూలీలను, కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించే ముందు పరీక్షలు చేస్తామని కృష్ణబాబు వెల్లడించారు. కూలీల సమూహంలో ఒక్కరికీ కరోనా లక్షణాలు ఉన్నా.. వారందరినీ క్వారంటైన్ కి పంపుతామని తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న వారిని పంపుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. స్థానికులు.. గ్రామాలకు చేరుకున్న వారి పట్ల ఎలాంటి వివక్ష చూపరాదని కృష్ణ బాబు కోరారు.