ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) కృషికి అభినందనలు అందుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా చేసిన ప్రయత్నాలతో గణనీయమైన పురోగతిని సాధించడం పట్ల కేంద్రం కూడా ప్రశంసలు కురిపించింది. ఏపీఎస్డీసీ ని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అభినందించింది. దాదాపు 1.7 లక్షల మంది యువతను నిపుణులుగా తీర్చిదిద్ది , వివిధ కంపెనీల అవసరాలు తీర్చేందుకు సిద్ధం చేసేందుకు చేసిన కృషిని కొనియాడింది.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా, ఆయా పరిశ్రమల సహకారంతోనే యువతకు శిక్షణ ఇవ్వడం, మరికొంత మందికి అదనపు శిక్షణ ఇవ్వడం, వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడంతోపాటు ఆయా కంపెనీలు లేదా పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పనిచేస్తోంది. పరిశ్రమలు ఉండే చోటనే యువతకు శిక్షణ ఇవ్వడం వల్ల, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారిని అక్కడే ఉద్యోగాల్లోకి తీసుకోనే అవకాశాలను మెరుగుపరచి, రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు చేసిన కృషి కొంతవరకూ ఫలితాన్నివ్వడం అభినందనలకు కారణమవుతోంది.
శ్రీసిటీ క్లస్టర్, ఫార్మా కస్టర్, సోలార్ సెక్టార్, టెక్స్ టైల్స్ క్లస్టర్లతో ఎపిఎస్ఎస్డిసి భాగస్వామ్యం కావడంతో స్కిల్ డెవలప్ మెంట్ కి కృషి చేస్తోంది.ఈ కార్యక్రమం కింద 6,544 మందికి పైగా శిక్షణ ఇవ్వడంతోపాటు వారందరికీ ఉద్యోగాలు కల్పించడం విశేషంగా మారింది. మరో 40 ఇండస్ట్రీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు కార్పోరేషన్ ప్రకటించింది.. ఈ తరహా నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి) కూడా ఎపిఎస్ఎస్డిసిని అభినదించింది.
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకెవీవై) కింద 43,167 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు, 19,446 మందికి ఉద్యోగ అవకశాలు కల్పించడం జరిగిందని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ప్రకటించింది. తద్వారా జాతీయ స్థాయిలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం దక్కింది. ప్రముఖ ఫ్రెంచి కంపెనీ డస్సాల్ట్ సిస్టమ్స్ తో కలిసి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా 3 డి విభాగంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నాగార్జున యూనివర్సిటీలో మదర్ హబ్ 3 డి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.
Also Read : అదే ఆక్రోశం.. మారని పద కోశం..
వాటితో పాటుగా జెఎన్టీయూ అనంతపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని 63 ఇంజనీరింగ్ కాలేజీల్లో డిజైన్ మానుఫ్యాక్చరింగ్ అండ్ అనాలసిస్ ద్వారా ఏరోస్పేస్, ఆటో మోటివ్, షిప్ బిల్డింగ్ విభాగాల్లో ఇప్పటి వరకు 66,670మంది శిక్షణ పొందారు. వీరిలో 3,982 మంది వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. 380 మంది వివిధ రకాల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. 535 మంది స్కూప్స్ ఇండెక్స్ పబ్లికేషన్లు కు ఎంపికయ్యారు. 560 మంది విద్యార్థులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు రూపొందించారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్ సంగ్ సహకారంతో శామ్ సంగ్ ప్రిజమ్ (ప్రిపేరింగ్ అండ్ ఇన్ స్పైరింగ్ స్టూడెంట్ మైండ్స్) ను ఎపిఎస్ఎస్డిసి రాష్ట్రంలోనూ ప్రారంభింది. శామ్ సంగ్- ఎపిఎస్ఎస్డిసి ప్రాజెక్టు కోసం ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాకినాడ, కెఎల్ యూనివర్సిటీ విజయవాడ, త్రిపుల్ ఐటి కర్నూలు లను ఎంపిక చేయడం జరిగింది. కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డకనెక్టెడ్ డివైజెస్, 5 జీ నెట్ వర్క్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రాజెక్ట్స్ పై విద్యార్థులు నైపుణ్యం సంపాదించాలని నిర్దేశించడం జరిగింది.
కోవిడ్ సమయంలో కూడా ఏపీఎస్డీసీ కార్యక్రమాలు కొనసాగించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల్సుకి వర్చువల్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఫిండ్, ఆఫ్రికన్ సొసైటీ ఫర్ ల్యాబొరేటరీ మెడిసిన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్, ఫ్యూచర్ లెర్న్ లాంటి సంస్థల సహకారంతో వివిధ కోర్సుల్లో సుమారు 3 వేల మందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ చొప్పున 25 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో దానికి అనుగుణంగా రూ.460 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇప్పటికే ఒక స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి వైఎస్సార్ జయంతి సందర్భంగా పులివెందులలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
Also Read : నీటి సదస్సులు కాదు.. కార్యకర్తల మీటింగ్ పెట్టాలంటున్న జేసీ
ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నైపుణ్య శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. 45,520 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే స్కిల్ కాలేజీల్లో ఆరు క్లాస్ రూములు, రెండు ల్యాబ్‌లు, రెండు వర్క్‌షాపులు, ఒక స్టార్టప్ ల్యాబ్, అడ్మిన్, స్టాఫ్ గదులు ఉండే విధంగా డిజైన్ చేశారు. అంతే కాకుండా 126 మంది అక్కడే ఉండి శిక్షణ తీసుకునే విధంగా హాస్టల్స్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఆయా ప్రాంత అవసరాలకు అనుగుణంగా రెండు ప్రాధాన్యత కోర్సులను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. రంగాలను బట్టి కోర్సు కాల వ్యవధి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. వీటిని బట్టి కనీసం ఏడాదికి ఒక్కో శిక్షణ కేంద్రం నుంచి 1,920 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
తాజాగా ఏపీఎస్ఎస్డీసీ 102 కోట్ల వ్యయంతో, 6 నైపుణ్య కాలేజీలకు టెండర్లను పిలిచింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నంలో 2 నైపుణ్య కాలేజీలను, గుంటూరు జిల్లాలో నల్లపాడు, బాపట్ల, నర్సరావుపేటలో 3 నైపుణ్య కాలేజీలను, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక నైపుణ్య కాలేజీని ఏర్పాటు చేయనున్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పరిశ్రమ అనుకూలిత నైపుణ్య శిక్షణ ద్వారా రానున్న మూడేళ్ళలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకశాలు పొందుతారని అంచనా వేస్తున్నారు. ఏపీ ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, యువతలో నైపుణ్యం వెలికితీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం కూడా అభినందించడం విశేషం.
Also Read : మాజీ మంత్రిపై ఈగ వాలనీయని అనంత టీడీపీ… జేసి ఫ్యామిలీని తీసి పడేసిందా…?