ఏపీ సీఎం జగన్ బీసీలకు 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. కానీ ఇంత గొప్ప పని చేసినా విపక్షాలు విమర్శలు చేయడం శోచనీయం.
దేశ చరిత్రలోనే తొలిసారిగా సీఎం జగన్ ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన జగన్ సర్కార్ చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. బీసీలు వెనుక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలని వారి కోసం జగన్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీసీ వర్గాలలో ఇన్ని కులాలున్నాయా? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా ప్రతి ఒక్కరికి ఈ జాబితాలో అవకాశం కల్పించారు.
ప్రశంసలు
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందచేయాలని జగన్ బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. గొప్ప నిర్ణయమంటూ సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. బీసీ కులాల్లోని నాయకుల గుర్తింపునకు ప్రత్యేకంగా రాజకీయ, ప్రభుత్వ పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని పలువురు బీసీ సంఘాల నేతలు అభినందించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసి వర్గాలు ఈ నిర్ణయంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ల ఏర్పాటు ద్వారా అణగారిన బీసీ కులాల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
విమర్శలు
కానీ మన విపక్షనేతలు మాత్రం ఈ నియామకాలపై విషం కక్కారు. ప్రతి ఒక్క కులానికి ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీసీలలో ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ వర్గాలు కూడా ఈ చైర్మన్ల ఎంపికను తప్పుపడుతూ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న విపక్షాలకు ఆ పథకాల గొప్పతనం అర్ధం కాదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కార్పొరేషన్లుకు వచ్చే ఆదాయం మొత్తం ఆయా కార్పొరేషన్ల అభివృద్ధికే ఖర్చు చేయాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పినా ఈ నిర్ణయంపై కూడా విపక్షాలు విమర్శలు చేయడం శోచనీయం. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బీసీ కార్పొరేషన్లు నేతి బీరకాయలతో పోలుస్తూ విమర్శలు చేశారు . నేతి బీరకాయలో నెయ్యి ఉండదని, బీసీ కార్పొరేషన్లలో నిధులు ఉండవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసినట్లు తమ నాయకుడు ఒక సంస్థకు వచ్చిన ఆదాయాన్ని వేరే సంస్థకు ఉపయోగించారని వైసీపీ నాయకులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు.
మన విపక్షాలే వేరు
మహిళలకు, బీసీలకు ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడంతో ప్రతిపక్షాలు సీఎం జగన్ పై విషం కక్కుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు చేయడం సహజం. ఇదే సమయంలో చేసిన మంచి పనికి క్రెడిట్ ఇవ్వడం న్యాయం. ఈ నేపథ్యంలో మాజీ సుప్రీం జస్టిస్, మాజీ చైర్మన్ ఎడిటర్ గిల్డ్స్ ‘మార్కండేయ కట్జు’ చెప్పిన విషయాన్ని గుర్తుకుతెచ్చుకోవలసిన అవసరం ఎంతో ఉంది. దేశంలో రాజకీయాలు, ఛానెళ్ళు వేరు ఏపీలో రాజకీయాలు, ఛానెళ్ళు వేరని చెప్పిన విషయాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు.