కోవిడ్ కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ సచివాలయ వ్యవహరాలు సక్రమంగా సాగడం లేదు. చివరకు అధికారులు కూడా కొన్ని నెలల పాటు ఆఫీసులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇటీవల నేరుగా చీఫ్ సెక్రటరీ జోక్యంతో మళ్లీ డిపార్ట్ మెంట్ హెడ్స్ సెక్రటేరియట్ కి రాకపోకలు చేస్తున్నారు. అదే సమయంలో మంత్రులు కూడా హడావిడి చేస్తుండడంతో సచివాలయంలో సందడి పెరుగుతోంది. గడిచని పక్షం రోజులుగా ప్రభుత్వ యంత్రాంగంలో వచ్చిన మార్పు దీనిని ప్రస్ఫుటంగా చాటుతోంది.
గడిచిన రెండు వారాలుగా మంత్రులు అనేక మంది మీడియా సమావేశాలు నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వంటి వారు కూడా మీడియా ముందుకొచ్చారు. పబ్లిసిటీ సెల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దిశ చట్టం, విపక్షాల వాదనలపై వివరణ ఇచ్చారు. విమర్శలను తిప్పికొట్టారు.
కేవలం తానేటి వనిత మాత్రమే కాకుండా ఇతర మంత్రుల్లో కూడా జోష్ కనిపిస్తోంది. ఓ వైపు విపక్ష టీడీపీ వరుసగా కార్యక్రమాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు శ్రీకారం చుడుతోంది. అదే సమయంలో ప్రతిపక్షాల వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ప్రభుత్వ వర్గాల నుంచి తగిన శ్రద్ధ చూపడం లేదనే అభిప్రాయం అధికార పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. దీనిని అధిగమించే లక్ష్యంతో ముఖ్యమంత్రి క్యాబినెట్ భేటీలో కూడా మంత్రులందరికీ దిశానిర్ధేశం చేశారు. విపక్షాల వాదనలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
దానికి తగ్గట్టుగానే మంత్రులు కూడా వరుసగా మీడియా ముందుకు రావడం వైఎస్సార్సీపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సమయంలో మీడియా సహాయంతో అవాస్తవాల ఆధారంగా ప్రజలను పక్కదారి పట్టించే యత్నంలో ఉన్న ప్రతిపక్ష నేతలకు కళ్ళెం వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా సచివాలయంలో పెరుగుతున్న సందడి అటు అధికారికంగానూ, ఇటు రాజకీయంగానూ ఆసక్తిదాయకమేనని చెప్పవచ్చు. త్వరలో సీఎం కూడా పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళే యత్నం చేయబోతున్న తరుణంలో ఈ పరిణామం కీలకమైన నిర్ణయాలకు దోహదం చేసే అవకాశం ఉంది.
Also Read : ఎల్జీ పాలిమర్స్‌పై కేబినెట్ కీలక నిర్ణయం