iDreamPost
iDreamPost
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వల్లనే కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్ లో సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యం అయింది. తాజాగా ఆరోగ్య శాఖలో మానవ వనరులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తోంది. ఖాళీల భర్తీతో పాటు అవసరమైన కొత్త పోస్టుల మంజూరుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 5,854 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌లు ఇచ్చింది. ఇందులో 1,554 రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ పోస్టులుండగా.. 4,300 జిల్లా స్థాయి రిక్రూట్‌మెంట్ పోస్టులున్నాయి.
రాష్ట్రస్థాయిలో మొత్తం 9,557 దరఖాస్తులు..
రాష్ట్రస్థాయికి సంబంధించి ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 590 పోస్టులకు, వైద్య విద్యలో 68 పోస్టులకు, ఏపీ వైద్య విధానపరిషత్‌లో 896 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1,554 పోస్టులకు గాను 9,557 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇవి పరిశీలన దశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకల్లా కొన్ని పోస్టులకు, వచ్చే నెలాఖరుకు మిగిలిన పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి నియామకాలు చేపట్టనున్నారు.
జిల్లా స్థాయిలో 21,176 దరఖాస్తులు..
ఇక జిల్లా స్థాయిలో ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించిన 1,317 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఏకంగా 21,176 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరుకల్లా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు చేపట్టనున్నారు. వైద్య విద్య విభాగానికి సంబంధించి జిల్లా స్థాయిలో 2,010 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.
జనవరి 10 తరువాత నియామకాలు..
వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 10 నాటికి పరిశీలించి.. నియామకాలు చేపడతారు. అలాగే ఏపీ వైద్య విధాన పరిషత్‌కు సంబంధించి జిల్లా స్థాయిలో 973 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 14 నాటికి పరిశీలించి.. నియామకాలు పూర్తి చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు గతంలోనే ఆరోగ్య శాఖలో 9,700 పోస్టులను భర్తీ చేశారు. వీటికి అదనంగా ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోంది.
Also Read : వైసీపీ నేత పేరుతో ఆంధ్రజ్యోతి మరో కొత్త డ్రామా