iDreamPost
android-app
ios-app

ఏపీలో కరోనా ప్రభావం.. ఊరటనిస్తున్న ప్రభుత్వం నివేదిక

ఏపీలో కరోనా ప్రభావం.. ఊరటనిస్తున్న ప్రభుత్వం నివేదిక

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మరిగా మారిపోయింది. రోజు రోజుకు దీని ప్రభావం విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 164 దేశాలు కరోనా ప్రభావం బారిన పడ్డాయి. దాదాపు రెండు లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది. దాదాపు ఏడు వేల మంది మరణించారని వార్తలొస్తున్నాయి.

మన దేశంలో కూడా కరోనా ఘంటికలు మొగుతున్నాయి. ఇప్పటి వరకూ 147 మంది ఈ వైరస్‌ బారిన పడగా… అందులో ఆరుగురు తెలుగు రాష్ట్రాల వారుండడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తెలంగాణాలోని ఐదుగురు, ఏపీలోని ఒక్కరు.. విదేశాల నుంచి వచ్చిన వారే కావడం కొంత ఊరటనిస్తోంది. దేశ వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు భారీగా తీసుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే థియేటర్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు మూసేస్తున్నారు.

ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేదని ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన నెల్లూరు యువకుడు కూడా కోలుకుంటుండడంతో ప్రభుత్వం, ప్రజలు ఊరిపిల్చుకుంటున్నారు. ఏ మాత్రం అలసత్వం లేకుండా విదేశాల నుంచి వచ్చిన వారిని అబ్జర్వేషన్‌లో పెడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని వాలంటీర్లు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తూ కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాష్ట్రంలో 856 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 250 మంది 28 రోజుల అబ్జర్వేషన్‌ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. 586 మంది గృహ నిర్భందంలో ఉన్నారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారని తెలిపింది.

విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా అనుమానిత లక్షణాలున్న 102 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 90 మందికి నెగిటివ్‌ రాగా నెల్లూరు యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. మరో 11 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని తెలిపింది. ప్రజలకు సహాయం అందించేందుకు 0866 – 2410978 నంబర్‌తో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది. 104 టోల్‌ ఫ్రి నంబర్‌ను ఏర్పాటు చేసింది.