iDreamPost
android-app
ios-app

సుప్రీం కోర్టుకు వెళ్తాం – సజ్జల

సుప్రీం కోర్టుకు వెళ్తాం – సజ్జల

అమరావతి భూ కుంభకోణంలో మాజీ ఏజీ, సుప్రిం కోర్టు న్యాయమూర్తి కూతుర్లు సహా 12 మందిపై ఏసీబీ చేస్తున్న విచారణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రిం కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన హైకోర్టు స్టే ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రాథమిక దశలోనే తీర్పు ఇస్తే.. నిజానిజాలు ఎలా తెలుస్తాయన్నారు. కొద్ది మందికి ఒక న్యాయం.. మిగతా వారికి మాత్రం మరో న్యాయమా..? అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

‘‘ హైకోర్టులో తీర్పు వస్తుందని నిన్న సాయంత్రం ఐదు గంటలకే బొండా ఉమామహేశ్వరరావు చెబుతున్నారు. ఆయనకు ఎలా తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి ప్రయోజనాలు రక్షించడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కేసులో వార్తలు ప్రసారం చేయకుండా మీడియా నోరు నొక్కేయడం ఎంత వరకు సమంజసం. ఎవరిని కాపాడేందుకు ఇలా చేస్తున్నారు. కొద్ది మందికి మాత్రం ఒకరకమైన న్యాయం, మిగతా వారికి ఇంకొక రకం న్యాయమా..? ప్రాథమిక దశలోనే నొక్కేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి.

2019 ఎన్నికల్లో తాము వస్తే అమరావతి భూ కుంభకోణంపై విచారణ చేస్తామని సీఎం జగన్‌ పదే పదే చెప్పారు. ప్రజలు 151 సీట్లతో ఆశీర్వదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయన్న ఆధారాలున్నాయి. ప్రజా స్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాలపైన విచారణ చేసే హక్కు ఉంది. కక్షపూరితంగా చేస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌ ప్రారంభంలోనే విచారణను నిలిపివేస్తూ తీర్పు ఇస్తే ఎలా అర్థం చేసుకోవాలో విజ్ఞులు, ప్రజలు ఆలోచించాలి. న్యాయమూర్తులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి.

సుప్రిం కోర్టు న్యాయమూర్తి కూతుర్లు, మాజీ ఏజీలను రక్షించుకోవడానికి ఇలా చేస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది. అమరావతిపై ఎవరూ మాట్లాడకూడదని నోరు నొక్కేస్తే ఎలా..? ప్రజలు, న్యాయ కోవిదులు ఈ విషయంపై ఆలోచించాలి. కక్ష కట్టారని చంద్రబాబు పిటిషన్‌ వేయగానే అంతా ఆపేస్తే ఇంకేముంటుంది..? నాడు జగన్‌పై కక్ష కట్టి వేశారంటే.. సుప్రిం కోర్టులోని న్యాయమూర్తులు.. ఆరోపణలే కదా.. విచారణ జరిగితే కడిగిన ముత్యంలా వస్తారని చెప్పారు. గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిళ్లుతుందని అంటే.. మాజీ ఏజీకి ఉన్న గౌరవం వైఎస్‌ జగన్‌కు లేదా..?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.