ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై కాన్వాయ్ వెళుతుండగా వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ లో వాహనాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. అయితే సజ్జల మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు చెందిన వైసీపీ నేత మురళీధర్‌రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాన్వాయిలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. సడన్ గా బ్రేక్ వేయడం వల్ల కర్నూల్ మేయర్ బీవై రామయ్య, కర్నూల్ జిల్లా వైసీపీ నేత సురేందర్ రెడ్డి వాహనాలు ఢీ కొన్నాయి. కాన్వాయిలో సజ్జల వాహనం వెనుక ఈ రెండు వాహనాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : గంటా శ్రీనివాస రావు కన్నేశారు, యనమలకి సెగ తగులుతోంది..