iDreamPost
iDreamPost
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాల నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సుప్రిం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సర్వీస్ రూల్–8 కింద ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక విమర్శలు, ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. ఆయన అధికారిగా కాకుండా టీడీపీ నాయకుడిగా పని చేశారని విమర్శలొచ్చాయి. ప్రభుత్వం నుంచి విలువైన కాంట్రాక్టులు ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కంపెనీకి దక్కాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల కోసం 2017–18లో జరిపిన ఆయుధాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు, దీనికి గాను ప్రభుత్వానికి ధన రూపేనా భారీగా నష్టం వాటిల్లినట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. రాష్ట్రప్రభుత్వానికి సంభందించిన కీలక సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో విఫలమయ్యారనే ఆరోపణలూ నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం 15 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది. లేనిపక్షంలో సంబంధిత అధికారుల ముందు హాజరై ఆయనపై ఉన్న అభియొగాలకు సంభందించి తన వాదన వినిపించాలని అలా చేయని పక్షంలో ఈ అభియోగాలను అంగీకరించినట్లుగా భావించి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.