iDreamPost
android-app
ios-app

ఈ – మార్కెటింగ్ పై ఏపీ ఫోక‌స్…

ఈ – మార్కెటింగ్ పై ఏపీ ఫోక‌స్…

రైతుల శ్రేయ‌స్సు, వారి ఉత్ప‌త్తుల విక్ర‌యాల పెంపు ద్వారా రైతుల‌కు ఆదాయం క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. దీనిలో భాగంగా ఈ – మార్కెటింగ్ ఫ్లాట్ ఫాం అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. అలాగే.. జనతా బజార్ల నిర్వహణలో భాగంగా రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేసేలా చర్య‌లు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులు వచ్చేలా చూడాలని, వాటిని నేరుగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైతులను ఆదుకోవడంతో పాటు, వినియోగదారులకు మేలు చేకూర్చడమే జనతా బజార్ల ఉద్దేశ‌మ‌న్న ‌సీఎం.. రైతుల‌కు అండ‌గా నిల‌వాలన్నారు. జనతా బజార్లలో పాలు, రొయ్యలు, చేపలు వంటి ఆక్వా ఉత్పతులను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాల‌ని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు.

జనతా బజార్లు, ఆర్బీకేల ద్వారా ఈ–ఫ్లాట్‌ఫాం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏక కాలంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వైఎస్ జ‌గ‌న్ సూచించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఆర్బీకేల పరిధిలో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు, గ్రేడింగ్‌ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాల‌న్నారు. వీటి నిర్వ‌హణ కోసం మండ‌ల స్థాయిలో ఓ అధికారిని నియ‌మించాల‌ని పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి పంటలకు కల్పించాల్సిన కనీస గిట్టుబాటు ధ‌రలపై కూడా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌ అధికారుల‌ను ఆదేశించారు.

అదేవిధంగా ఆక్వా సాగు ప్రాంతాల్లో ఉత్ప‌త్తులు నిల్వ చేసేందుకు అవ‌స‌ర‌మైన గోడౌన్ల నిర్మాణం చేయాల‌ని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి, అధికారుల తో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మాట్లాడుతూ..రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోలులో ప్రభుత్వం జోక్యం చేసుకుంద‌ని తెలిపారు. కొనుగోళ్లు జ‌రుగుతున్న తీరు, వివ‌రాల్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నార‌న్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ధరల జాబితాను కొనుగోలు కేంద్రాల్లో ప్రకటించాల‌ని సీఎం ఆదేశించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దానిక‌న్నా త‌క్కువ‌కు కొనుగోలు కాకుండా, రైతులు న‌ష్ట‌పోకుండా చూడాల‌ని సూచించారని కన్న‌బాబు వెల్ల‌డించారు.