iDreamPost
iDreamPost
మన సినిమా కథల్లో హీరో ఎలాంటి కష్టాలు పడినా విలన్లు ఎన్ని ఇబ్బందులు టార్చర్లు పెట్టినా ఫైనల్ గా సుఖాంతమే కోరుకుంటారు ప్రేక్షకులు. దానికి రివర్స్ లో ఏ మాత్రం నెగటివ్ గా చూపించినా ఖచ్చితంగా ఒప్పుకోరు. అందులోనూ విపరీతమైన ఇమేజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తేడా కొట్టిందా నిర్మాత పని గోవిందా. అదెలాగో చూద్దాం. 1992వ సంవత్సరం. రామ్ గోపాల్ వర్మ తెలుగులో అప్పటిదాకా డైరెక్ట్ చేసింది రెండు సినిమాలే. ‘శివ’ చరిత్ర సృష్టిస్తే ‘క్షణక్షణం’ విభిన్న ప్రయత్నంగా మెప్పు పొందిందే తప్ప ఎక్కువ డబ్బులు రాల్చలేదు. ఆ టైంలో నాగార్జున కాంబోలో వర్మ ‘అంతం’ టైటిల్ ని ప్రకటించాడు.
అంతే బయ్యర్లు షూటింగ్ కు ముందే ఎగబడ్డారు. శివ కాంబినేషన్ రిపీట్ అనగానే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు. బాలీవుడ్ సుప్రసిద్ధ సంగీత దిగ్గజం ఆర్ డి బర్మన్ సంగీతం సమకూరుస్తున్నారనగానే హైప్ ఇంకా పెరిగింది. అయితే అందులో నాలుగు పాటలు ఆయన స్వరపరచగా కీరవాణి, మణిశర్మ చెరొకటి కంపోజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మే ఇచ్చారు. అన్నీ మ్యుజికల్ గా పేరు తెచ్చాయి. ఊర్మిళా హీరోయిన్ గా డానీ విలన్ గా ఇతర కీలక పాత్రల్లో సలీం గౌస్, ఆకాష్ ఖురానా, రాళ్ళపల్లి, గోకిన రామారావు తదితరులు నటించారు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు అంతం మీదే ట్రేడ్ సర్కిల్స్ లో చర్చలు. బై లింగ్వల్ గా ద్రోహి పేరుతో హిందీలోనూ తీశారు వర్మ.
సెప్టెంబర్ 11న అంతం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఏదేదో ఊహించుకుని థియేటర్ కు వెళ్లిన అభిమానులకు షాక్. నాగార్జున నెగటివ్ షేడ్స్ కలిసిన హీరో క్యారెక్టర్ లో డల్ గా స్లోగా సాగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందులోనూ క్లైమాక్స్ లో చనిపోవడం అస్సలు నచ్చలేదు. ఎంత కథ ప్రకారమే అయినా నాగ్ పాత్ర మరీ అంత స్లోగా ఉండటం ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో అంతం ఫైనల్ గా డిజాస్టర్ కాక తప్పలేదు. తర్వాత రోజుల్లో క్రిటిక్స్ కి ఇదేదో కల్ట్ క్లాసిక్ గా అనిపించి ఉండవచ్చు కానీ రిలీజ్ టైంలో దక్కిన ఫలితం మాత్రం ఫ్లాపే. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో పాట మాత్రం ఎవర్ గ్రీన్ గా చెప్పుకోవచ్చు.