Idream media
Idream media
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య 59 చైనీస్ యాప్స్‌పై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే డేటా సేకరణ పద్ధతులు, లొకేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మూడు వారాల్లోగా నివేదించాల్సిందిగా టిక్‌టాక్ సహా 58 ఇతర యాప్‌లకు ఎలక్ర్టానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేఖలు రాసింది.
ఐటీ యాక్ట్ కింద ఆయా సంస్థలకి ఈ-మెయిల్స్ పంపామని, తద్వారా సమగ్రంగా విశ్లేషించడానికి వీలవుతుందని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాతో సహా లొకేషన్ వివరాలను చైనా సర్వర్లకు బదిలీ చేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా బ్యూటీ ప్లస్, సెల్ఫీ కెమెరా లాంటి యాప్‌లలో అశ్లీల కంటెంట్ ఉందని కూడా నివేదించాయి. చైనీస్ యాప్స్‌పై విధించిన నిషేదాన్ని డిజిటల్ స్ట్రక్‌గా అభివర్ణించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఆయా యాప్స్ నిర్వాహకులు త్వరలోనే ప్యానెల్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రముఖ షార్ట్ వీడియో స్ట్రిమింగ్ యాప్ టిక్‌టాక్‌కు భారత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత ఈ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. భారత్‌లో టిక్‌టాక్ యూజర్లు 200 మిలియన్లకు పైగానే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్‌చేశారు. తాజాగా భారత్ కూడా నిషేదం విధించడంతో టిక్‌టాక్‌కు భారీ నష్టం వాటిల్లందనే చెప్పొచ్చు. అయితే తాము డేటా చోరీకి పాల్పడలేదని భారత చట్టాలు, నిబంధనలకు లోబడే ఉన్నామని వినియోగదారుల డేటా, వారి గోప్యతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని టిక్‌టాక్ ప్రతినిధి మరోసారి తెలిపారు. అంతేకాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు.
బీజింగ్ కు దూరంగా టిక్‌టాక్..!
భారత్‌లో కోట్ల మంది యూజర్లకు దూరమైన టిక్‌టాక్ తనపైపడ్డ మరకలను చెరిపే ప్రయత్నం చేసుకుంటోంది. తాజాగా తన మాతృసంస్థ బైట్‌డాన్స్‌లో భారీ మార్పులు చేపట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిలోభాగంగా తొలుత ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తోంది. అతిపెద్ద కార్యాలయాలు లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, డబ్లిన్, ముంబయిలలో ఉన్నట్లు ఇదివరకే వెల్లడించిన సంస్థ, ప్రస్తుతం ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడికి మారుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు.
వ్యక్తిగత సమాచార భద్రతపై అమెరికా జాతీయ భద్రతా విభాగం జరిపిన విచారణ అనంతరం టిక్‌టాక్ బీజింగ్ నుంచి దూరమౌతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సందర్భంలో ఇప్పటికే ఆ యాప్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్ దాన్ని నిషేధించింది. తాజాగా అమెరికా కూడా టిక్‌టాక్‌పై నిషేధాన్ని పరిశీలిస్తున్నామని అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నేపథ్యంలో టిక్‌టాక్ మరోసారి అప్రమత్తమైంది. తనపై చైనా మరకలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలాఉంటే, టిక్‌టాక్ తన పారదర్శక నివేదికను ఈ గురువారం విడుదల చేసింది. గత సంవత్సరం ద్వితియార్థంలోనే టిక్‌టాక్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 5కోట్ల వీడియోలను తొలగించినట్లు నివేదికలో పేర్కొంది.