ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు చోదకంగా పని చేస్తాయి. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పెట్టుబడులు చాలా ముఖ్యం. ఆయా రాష్ట్రాల వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల కొనుగోలు శక్తిని అంచనా వేసి పెట్టుబడులకు సిద్ధమవుతాయి పారిశ్రామిక, కార్పొరేట్ వ్యవస్థలు. కరోనా అనంతరం పలు రాష్ట్రాలలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ ఇంకా ఆర్థిక సర్దుబాట్లు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. లాక్ డౌన్ తో కార్యకలాపాలు స్తంభించినా, కరోనాతో ఎక్కడికీ కదలని పరిస్థితి ఏర్పడినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాయి. ప్రధానంగా నగదు బదిలీ ఊపిరి ఇచ్చింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచే ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఎదురైనా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో నగదు బదిలీ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక సహకారం అవసరం ఉన్న అన్ని వర్గాలవారికి నగదు బదిలీ ద్వారా మొదటి సంవత్సరంలో దాదాపు 40139.58 కోట్ల రూపాయలను నేరుగా అందించింది. ఆ తర్వాతి ఏడాదిలో కరోనా విజృంభణ ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా పరీక్ష పెట్టింది. అయినప్పటికీ ప్రజలకు ఆదాయాలు పెరిగితే మార్కెట్లో వస్తువులను కొంటారు. వస్తువులు అమ్ముడుపోతే పరిశ్రమలు సరుకులు ఉత్పత్తి చేస్తాయి. అందువలన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రాధాన్యమివ్వాలని జగన్ ప్రభుత్వం ఆలోచించింది. వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను మరింతగా విస్తరించింది. ఏప్రిల్ 1 నుండి జూన్ వరకు 21,183.36 కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ ద్వారా కోట్లాది మంది ప్రజలకు అందించింది. ఇప్పటి వరకూ మొత్తంగా దాదాపు లక్ష కోట్లను ప్రజలకు అందించింది. ఫలితంగా ఏపీలో కొనుగోలు శక్తి పెరిగింది.
వాణిజ్య రంగ కార్యకలాపాల్లో వేగం పెరగడంతో వాణిజ్య పన్నుల వసూళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం, దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇదే సమయంలో జీఎస్టీ ఆదాయం 2.07 శాతం వృద్ధితో రూ.345.24 కోట్లు పెరిగి రూ.17,020.36 కోట్లకు చేరుకుంది. జీఎస్టీ పాత బకాయిల వసూలు చేయడానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు మంచి పనితీరు కనబరచడంతో లక్ష్యాన్ని మించి వసూళ్లు నమోదయ్యాయి. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.942.41 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,073.03 కోట్లు వసూలైనట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తున్న పెట్టుబడిదారి వర్గాలు ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు సురక్షిత రాష్ట్రంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతోపాటు నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో.. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, నైపుణ్యత మెరుగుపడి.. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధనకు మార్గం సుగమం అవుతుందని ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. 2020 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 29,784 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమే ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం చర్యల ద్వారా ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులను ఆకట్టుకోవడంలో రాష్ట్రం ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీలో 3 ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం పార్లమెంట్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, ఏర్పేడులో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటులో ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 19 ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ క్లస్టర్లతోపాటు మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ ఆర్థిక ప్రగతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.