iDreamPost
android-app
ios-app

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కేసీఆర్‌ను దువ్వుతున్నారా..?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కేసీఆర్‌ను దువ్వుతున్నారా..?

తెలుగు మీడియాలోని ప్రధాన పత్రికలు, టీవీ ఛానెళ్లు.. ఏదో ఒక పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్ధతుగా ఉంటే తప్పా వాటి ఉనికి సాధ్యం కాదు. కోవిడ్‌ దెబ్బకు పత్రికా రంగం కుదేలైంది. పలు పత్రికలు మూతబడ్డాయి. మరికొన్ని పత్రికలు ఖర్చులు తగ్గించుకునే పేరుతో.. ఉద్యోగులను, పేజీలను తగ్గించుకున్నాయి. కోవిడ్‌ దెబ్బకు ఆకాశంలో ఉన్న మీడియా అధిపతులు నేలకు దిగుతున్నారని వారు వ్యవహరిస్తున్నతీరుతో తెలుస్తోంది.

తెలుగు ప్రధాన పత్రికల్లో ఒకటిగా ఆంధ్రజ్యోతికి పేరుంది. సదరు సంస్థ యజమాని వేమూరి రాధాకృష్ణ.. ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో అన్ని రాజకీయ పార్టీల నేతలకు సలహాలు ఇస్తుంటారు. అయితే ఆయన, ఆయన పత్రిక మాత్రం తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తుంటుందనేది అందరూ చెప్పే మాట. చంద్రబాబును ఆకాశానికి ఎత్తడంలో ఈనాడు కన్నా ఆంధ్రజ్యోతిది పైచేయి.

10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబును కుర్చి ఎక్చిచేందుకు 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి తీవ్రంగా శ్రమించింది. బాబు ప్రత్యర్థులైన కేసీఆర్, జగన్‌లపై వ్యతిరేక కథనాలు ప్రచురించి బాబుకు మేలు చేసేలా వ్యవహరించింది. జగన్‌పై ఉన్న ఆరోపణలను బూతద్ధంలో చూపించింది. అందుకు ప్రతిఫలంగా.. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను ఏబీఎన్‌కు కట్టబెట్టారు. ఈ కాంట్రాక్టు ద్వారా ఐదేళ్లలో బాబు.. ఆంధ్రజ్యోతికి 700 కోట్ల రూపాయలు ముట్టచెప్పారు. ఇదిగాక, భూముల కేటాయింపు, వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్టులు దండిగా ఇచ్చారని ప్రచారం జరిగింది.

2019 ఎన్నికల్లో బాబు ఓటమి తర్వాత కూడా రాధాకృష్ణ తిరిగి చంద్రబాబును అధికారపీఠం ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌సర్కార్‌పై కలంతో దాడి చేస్తూనే ఉన్నారు. మరోపక్క తెలంగాణలోనూ అదే పంథాను ప్రారంభంలో కొనసాగించారు. అయితే ప్రస్తుతం కేసీఆర్‌ సర్కార్‌ పట్ల.. రాధాకృష్ణ వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బాబు మళ్లీ అధికారంలోకి రావడం కష్టసాధ్యమనే భావనకు రాధాకృష్ణ వచ్చినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న వారి మద్ధతు లేకపోతే కష్టమనే విషయం రాధాకృష్ణకు తెలుసు.

అందుకే సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడైన తర్వాత.. ఆ పార్టీకి దగ్గర కావాలని ఉచిత సలహాలు ఇచ్చారు. అయితే అవి బెడిసికొట్టాయి. మీ పని మీరు చూసుకోండనే రీతిలో సోము వీర్రాజు సమాధానం ఇచ్చారు. దీంతో బీజేపీకి దగ్గర కావడం సాధ్యం కాదనుకున్న రాధాకృష్ణ.. కేసీఆర్‌ను దువ్వేపనిలో పడినట్లు ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల వస్తున్న కథనాలు ద్వారా అర్థం అవుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వానికి నష్టం కలిగించే వార్తలు ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో బాగా తగ్గాయి. అదే క్రమంలో కేసీఆర్‌ను జాతీయ స్థాయి నేతను చేసే పనిని రాధాకృష్ణ తన భుజాలపైకి ఎత్తుకున్నట్లు నిన్న, ఈ రోజు వెలువడిన కథనాలు ద్వారా తెలుస్తోంది.

కేసీఆర్‌.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని, దాని పేరు నయా భారత్‌ అని.. బీజేపీ అధ్యక్ష రాజకీయాలను అడ్డుకునేందుకే కేసీఆర్‌ ఢిల్లీ వైపు చూస్తున్నారని, జమిలీ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టబోతున్నారంటూ.. రాధాకృష్ణ పత్రిక రాసుకొచ్చింది. కేంద్రంపై గతంలో కేసీఆర్‌ ఫైర్‌ అయిన సందర్భాల్లో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు రాధాకృష్ణ.. కేసీఆర్‌ను దువ్వుతున్నారనే భావనలో ఉన్నారు.

చంద్రబాబును కూడా.. ఇలాగే ఆకాశానికి ఎత్తారని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో బాబు చక్రం తిప్పుతారు.. తృతియ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారు.. దానికి చంద్రబాబే కన్వీనర్‌.. మోడీకి బాబే ప్రత్యర్థి.. ఈ తరహాలో గతంలో చంద్రబాబు గురించి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్‌ను ఆకాశానికెత్తి.. దగ్గర కావాలని రాధాకృష్ణ ఆలోచిస్తున్నారనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్న వారు చెబుతున్న మాట. మరి కేసీఆర్‌ గతం అంతా మరిచిపోయి రాధా కృష్ణ గాలంలో పడతారా..? లేదా..? చూడాలి.

Read Also : తెలంగాణ చేస్తోంది ఏపీ ప్రజలకు నష్టం