Idream media
Idream media
1976, పల్లె వాసనలు పోగొట్టుకోని అనంతపురం, పట్టణంగా రూపాంతరం చెందుతున్న ఊరు. నా లాంటి వారికి మహానగరం. ఊరి నిండా థియేటర్లు. అన్నింటిలో కష్టమైంది , ఇష్టమైంది రామచంద్రా టాకీస్. కష్టమైంది ఎందుకంటే ఇంటికి చాలా దూరం, ఎక్కువ హిందీ సినిమాలు చూసింది ఇక్కడే. అందుకే ఇష్టం.
చూసిన మొదటి సినిమా లవకుశ. ఫస్ట్ షోకి మా వీధిలో ఉన్న అందరం నడుస్తూ వచ్చాం. నా వయసు 14 ఏళ్లు. అశోక్‌నగర్ నుంచి ఈ టాకీస్‌కి రావాలంటే కనీసం 4 కిలోమీటర్లు. ఎంత దూరం నడిచినా రాదు. అలసిపోయి , 55 పైసల బెంచీలో సెటిలయ్యాం. లవకుశలో హనుమంతుడు ఉంటాడనే ఆశతో వచ్చాను. ఆయన ఆఖరి వరకూ రాలేదు. సీతారాముల ఎమోషన్ అర్థం కాలేదు. బోర్ కొట్టింది (30 ఏళ్ల వయసులో డెప్త్ అర్థమై లవకుశని చాలా సార్లు చూశాను). శుభం పడేసరికి రాత్రి 10 గంటలు. చెప్పుల్లేని కాలం, రిక్షాకి డబ్బుల్లేని కాలం. మళ్లీ నడక. ఇల్లు చేరేసరికి ఏడుపు వచ్చింది. జన్మలో రామచంద్రకి వెళ్లకూడదని శపథం చేసుకున్నాను. కానీ ఎంతో కాలం నిలబడలేదు.
మంచికి మరోపేరు అని NTR సినిమా. కృష్ణంరాజు, రామకృష్ణతో కలిపి ముగ్గురు హీరోలు. శాంతి, నీలంలతో పాటు థర్డ్ థియేటర్ రామచంద్రాకి ఇచ్చారు. ఆ రోజుల్లో మూడు థియేటర్లలో ఒకే సినిమా చాలా అరుదు. మెయిన్ థియేటర్‌లో రష్ ఎక్కువ, చిన్న పిల్లాడ్ని టికెట్ దొరకవనే భయంతో బాడుగ సైకిల్‌లో ఎండలో రామచంద్రాకి వచ్చాను. అక్కడ కూడా జనం తక్కువేమీ లేరు. ఎలాగో నానా చావు చచ్చి థియేటర్‌లోకి వెళితే ఒకటే వేడి. చెమటతో తడిసిపోయి చూశాను. చెత్త సినిమా. NTR కర్చీప్‌తో కోడితే రౌడీలు ఎగిరిపడతారు. థియేటర్ బయటికొచ్చి మళ్లీ శపథం చేశాను. దీని ముఖం చూడకూడదని. ఏడాది మాట మీద నిలబడ్డాను.
1977 , జూలై నెలలో ఇంటర్ చేరాను. జూనియర్ కాలేజీ బందెల దొడ్డిలా ఉండేది. మా క్లాస్‌లోనే (MPC) 80 మంది దాకా ఉండేవాళ్లు. ఆ రోజుల్లో అమ్మాయిలంతా డాక్టర్లై పోదామని బైపీసీలో చేరేవాళ్లు. మా క్లాస్ రాజస్థాన్ ఎడారి లాంటిది. ఎప్పుడైనా లాంగ్వేజీ (ఇంగ్లీష్, తెలుగు) క్లాస్ కోసం బైపీసీలో కలిపితే ఐనిస్టయిన్లంతా వులిక్కి పడి లేచి కాలర్ సర్దుకునే వాళ్లు. జీవితం పైథాగరస్ సిద్ధాంతంలా ఉండగా ప్రసాద్ అనే మిత్రుడు నా డెస్క్‌లో కూచున్నాడు. హైదరాబాద్‌లో టెన్త్ చదువుకున్నాడు. హిందీ సినిమా ప్రియుడు. నాకూ హిందీ సినిమాలు ఇష్టమే కానీ, మరీ వాడంత కాదు.
మాలాంటి వాళ్ల కోసం బొంబాయిలో రామ్‌సే బ్రదర్స్ వుండేవాళ్లు. ఏడుగురు అన్నదమ్ములు. చేపల వేటకు వెళ్లకుండా సినిమాలు తీసే పనిలో పడ్డారు. ఒకడు కథ రాస్తే, ఇంకోడు కెమెరా, ఇంకోడు డైరెక్షన్. ఇలా అన్నదమ్ములంతా కలిసి హారర్ సినిమాల్ని దేశం మీదకి వదిలేవాళ్లు. ఈ వణికించే సినిమాలన్నీ రామచంద్రలోనే వేసేవాళ్లు. ప్రసాద్‌కి అంబర్ సైకిల్ వుండేది. నాకు అట్లాస్. అంబర్ తొక్కితే కదిలేది. అట్లాస్‌ని తెగ తొక్కాలి.
ఇద్దరం మిట్టమధ్యాహ్నం బయల్దేరేవాళ్లం. మధ్యలో రైల్వేగేటు. సైకిల్‌ని దాని కింద దూర్చి వెళ్లేవాళ్లం. ఆ సినిమాల పేర్లు కూడా తమాషాగా ఉండేవి. దర్వాజా, పురానాహవేలి, సబూత్ … ఇలా, అన్నింటిలో ఒకే కథ. ఐదారుగురు అమ్మాయిలు , అబ్బాయిలు ఒక ఇంట్లోకి వెళితే, అక్కడో దెయ్యం ఉంటుంది. అది భయపెట్టి చంపుతుంది. ఎండలో కూడా వణికే వాళ్లం.
అనంతపురం ఎండల్లో పగటి పూట అంత దూరం సైకిల్ తొక్కడం కష్టమని సినిమా షెడ్యూల్‌ని సెకెండ్ షోకి మార్చాం. రాత్రి ఒంటి గంటకి హారర్ సినిమా చూసి , భయంభయంగా చీకట్లో సైకిల్ తొక్కుతూ వచ్చేవాళ్లం. అప్పటి మున్సిపాలిటీ ప్రజల పక్షాన ఉండేది. గోతులు పూడ్చడం, లైట్లు వేయడం దాని డిక్షనరీలోనే లేదు. చీకట్లో గోతిలో పడేవాళ్లం. అర్ధరాత్రి పంక్చర్ అయితే నెట్టేవాళ్లం.
ఆ తర్వాత ప్రసాద్ ఇంజనీరింగ్ చేరాడు. నేను పాలిటెక్నిక్. రామచంద్రా కూడా జానర్ మార్చుకుంది. రాజశ్రీ వాళ్లు తీసిన గొప్ప సినిమాల్ని వేయడం స్టార్ట్ చేసింది.
చిత్‌చోర్ (సెకెండ్ రన్) చూసి ఇద్దరికీ మతి పోయింది. ప్రసాద్ వెంటనే టేప్ రికార్డర్ కొన్నాడు. నేషనల్ కంపెనీ రూ.900. దీర్ఘ చతురస్రాకారంలో పుల్లారెడ్డి స్వీట్ బాక్స్ కంటే కొంచెం పెద్దదిగా ఉండేది. బటన్స్ హార్మోనియం మెట్లలా ఉండేవి. పాటలు క్యాసెట్లలో రికార్డు చేయించడమే కాకుండా, హిందీ తెలుగు డిక్షనరీ కొని దాని అర్ధాల్ని కూడా నాకు వివరించడం మొదలు పెట్టాడు.
రామచంద్రలో అద్భుతమైన క్లాసిక్స్ చూశాం. రానురాను నా హిందీ జ్ఞానం పెరిగింది. పక్కన మా వాడు సబ్ టైటిల్స్ ఎలాగూ వేసేవాడు. 1980లో షాన్ వేశారు. దాని కోసం రామచంద్రా సౌండ్ సిస్టం మార్చారు. పక్కన స్పీకర్‌లోంచి సౌండ్. ప్రొజక్టర్ రూమ్‌లో నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ ఆన్ చేసేవాళ్లు. ఫైటింగ్‌ల్లో థియేటర్ మార్మోగిపోయేది. 1984 వరకూ ఎన్నో కలల్ని చూపించింది ఈ టాకీస్.
చదువు తర్వాత ప్రసాద్ కడప వెళ్లిపోయాడు. 88లో నేను అనంతపురం వదిలేశాను. 33 ఏళ్లుగా ఈ థియేటర్‌లో ఒక్క సినిమా కూడా చూడలేదు. బాగా ముసలిది అయిపోయింది. పేరు కూడా నీలిమగా మార్చుకుంది. శిథిల మందిరంగా ఉన్న దీన్ని చూస్తే యవ్వనం నాటి ఎన్నో జ్ఞాపకాలు ఈ గోడల్లో కనిపిస్తూ ఉంటాయి. రఫీ , కిషోర్‌కుమార్ , లత, ఆశా, ఉషా వీళ్ల గొంతులన్నీ మధురంగా విన్నది ఇక్కడే. అమితాబ్ సినిమాలన్నీ చూసింది ఇక్కడే. శ్యాంబెనగల్‌ని, బాసూచటర్జి, హృషికేష్ ముఖర్జీలని పరిచయం చేసింది ఈ పాత భవనమే. కాలం అనే పిచ్చి కుక్క కాటుకి అందరూ బలై పోతాం.
ఇప్పుడు ఈ థియేటర్ నడవడం లేదు. పునర్నిర్మాణంలో ఉంది. భవనాలని మళ్లీ నిర్మిస్తారు. మనుషుల్ని ఎవరు పునర్నిర్మిస్తారు? గత ఏడాది ప్రసాద్ అనారోగ్యంతో పోయాడు. తిరిగి ఎవరు ఇస్తారు?
ఒకనాటి ఉద్యానవనం …నేడు కనం, ఈ పాట అప్పుడు అర్థం కాలేదు. అర్థమయ్యే సరికి చాలా వయసు వచ్చేసింది.