iDreamPost
android-app
ios-app

అక్కడి చిత్రమే ఇక్కడి అల్లుడు – Nostalgia

  • Published Aug 31, 2020 | 1:21 PM Updated Updated Aug 31, 2020 | 1:21 PM
అక్కడి చిత్రమే ఇక్కడి అల్లుడు  – Nostalgia

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో మొదటి సగం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. 1975లో మొదలైన ఆయన ప్రస్థానంలో పదిహేనేళ్ల దాకా హీరోగా పెద్ద బ్రేక్ రాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. దానికి శ్రీకారం చుట్టిన సినిమా అల్లుడుగారు. నిజానికి మోహన్ బాబు 80వ దశకంలోనే చాలా సినిమాలు కథానాయకుడిగా చేశారు. వీరప్రతాప్, నా మొగుడు నాకే సొంతం, రగిలే గుండెలు, పద్మవ్యూహం, మా ఇంటి కథ లాంటివి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఇవేవి హీరోగా ఆయనకో సుస్థిరమైన స్థానాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే 1990 దాకా విలన్ గానూ కొనసాగించవలసి వచ్చింది.

అదే సంవత్సరం చిరంజీవి కొండవీటి దొంగ, కొదమసింహంలో కామెడీ టచ్ ఉన్న విలన్ రోల్స్ కూడా చేశారు. ఆ సమయంలో 1988 సంవత్సరం మలయాళంలో వచ్చిన ‘చిత్రం’ అనే బ్లాక్ బస్టర్ ని చూశారు మోహన్ బాబు. మోహన్ లాల్, రంజిని జంటగా కేరళలో పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ రికార్డులు సృష్టించింది ఆ మూవీ. ఎర్నాకులంలో ఏకంగా 405 రోజులు ఆడి అబ్బురపరిచింది. ప్రియదర్శన్ లోని కామెడీ కం ఎమోషనల్ డైరెక్టర్ దీంట్లోనే బయట పడ్డారు. రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ లక్ష్మిప్రసన్న బ్యానర్ మీద మోహన్ బాబు హక్కులను కొనుగోలు చేసి రాఘవేంద్రరావుని దర్శకత్వానికి ఒప్పించారు. అలా అల్లుడుగారు మొదలైంది. ఇప్పుడేదో గొప్ప ఫార్ములాగా చెప్పుకుంటున్న క్యారెక్టర్ స్వాపింగ్ దీంట్లోనే చూడొచ్చు, అమెరికా నుంచి వచ్చిన తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక కళ్యాణి(శోభన) ఆనంద్(చంద్రమోహన్)సహాయంతో భర్తగా నటించడానికి విష్ణు(మోహన్ బాబు)ని అద్దెకు తెచ్చుకుంటుంది. అయితే అనుకోకుండా కళ్యాణి నాన్న రామచంద్ర ప్రసాద్(జగ్గయ్య)కు విష్ణు దగ్గరైపోతాడు.

నిజంగానే అల్లుడు చేసుకుందాం అనుకుంటున్న టైంలో విష్ణుకు సంబంధించిన దారుణమైన ఫ్లాష్ బ్యాక్ లో రేవతి(రమ్యకృష్ణ)గురించి తెలుస్తుంది. ఆ తర్వాత జరిగే కథ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. అల్లుడుగారు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. శతదినోత్సవం పూర్తి చేసుకుంది. మోహన్ బాబు లోని ఫన్ యాంగిల్, కెవి మహదేవన్ అద్భుతమైన పాటలు, ఆహ్లాదంగా సాగే కథాకథనాలు వెరిసి కలెక్షన్ కింగ్ బిరుదుకి తొలిపునాది వేశాయి. ముఖ్యంగా ముద్దబంతి నవ్వులో సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.గాయకులూ జేసుదాసుకు నంది అవార్డు తెచ్చింది. అల్లుడుగారు తర్వాత మోహన్ బాబు ఒకటిరెండు తప్ప సపోర్టింగ్ రోల్స్ కి స్వస్తి చెప్పి పూర్తిగా హీరో పాత్రలకు అంకితమయ్యారు.అలా పక్కరాష్ట్రం చిత్రం ఇక్కడ అల్లుడుగా మారి కెరీర్ ఇచ్చింది