గత ఏడాది డిసెంబర్ లో ప్రతి రోజు పండగేతో చాలా గ్యాప్ తర్వాత సూపర్ హిట్ అందుకున్న సాయి తేజ్ తన కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు తిరిగి వచ్చిన మార్కెట్ దీంతో బలపడుతుందనే నమ్మకం గట్టిగా ఉంది. నిన్నే షూటింగ్ మొత్తం పూర్తయినట్టు హీరోనే స్వయంగా ట్వీట్ చేయడంతో ఇక విడుదల కోసం వేచి చూడటమే మిగిలింది. ఇప్పటిదాకా ఈ ఆల్బమ్ లో రెండు పాటలు రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇంకా ఒకటో రెండో పాటలు బ్యాలన్స్ ఉండగానే గుమ్మడికాయ కొట్టేశారనే టాక్ వినిపిస్తోంది.
థియేటర్ల పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఓటిటి ఆప్షన్ ఎంచుకున్నారని అందుకే వాటిని తీయకపోయినా వచ్చిన నష్టమేమి లేదనుకుని నిర్ణయం మార్చుకున్నారని వినికిడి. ఇది నిజమో కాదో కానీ ఫిలిం నగర్ లో మాత్రం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నాని వి వచ్చాక అందరికి ఓటిటి ఒక బెటర్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఇంకో రెండు మూడు నెలల దాకా జనం థియేటర్లకు గుంపులుగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.
ఇప్పటికే ఒరేయ్ బుజ్జిగా డేట్ ఫిక్స్ చేసుకోగా, కలర్ ఫోటోను నవంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. రెండూ ఆహాలోనే వస్తాయి. నిశ్శబ్దం కూడా కమింగ్ సూన్ అని కోన వెంకట్ సోషల్ మీడియాలో తనను అడిగిన అనుష్క అభిమానులను ఊరిస్తున్నాడు. ఈ లెక్కన సోలో బ్రతుకే సో బెటరూ కూడా అలా వచ్చినా ఆశ్చర్యం లేదు. హక్కులు జీ సంస్థ కొనుగోలు చేసింది. ఒకవేళ డిజిటల్ రిలీజ్ కు ఫిక్స్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్న పే పర్ మోడల్ యాప్ జీ ప్లెక్స్ ద్వారా విడుదల చేయొచ్చు. వచ్చే నెల 2న లాంచ్ కాబోతున్న ఈ ప్లాట్ ఫార్మ్ తో ఈ రంగంలో సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే సాయి తేజ్ యూనిట్ నుంచి దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ అప్ డేట్ లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో సోలో బ్రతుకు సో బెటరూకు సంబంధించి ఊరికే ఇలాంటి న్యూసులు బయటికి రావు కదా. వేచి చూద్దాం.