iDreamPost
iDreamPost
ఏ హీరోకైనా మొదటి ద్విపాత్రాభినయం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకుంటారు. అలా ఏఎన్ఆర్ కు ఇద్దరు మిత్రులు, ఎన్టీఆర్ కు రాముడు భీముడు ల్యాండ్ మార్క్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఆ తర్వాత వాళ్ళు అలాంటివి ఎన్ని చేసినా వాటి ముందు తక్కువే అని చెప్పాలి. కానీ ప్రతిఒక్కరికి ఇలా జరగదు. కొన్ని సార్లు రివర్స్ అవుతాయి. వెంకటేష్ కు ఇది అనుభవం. అదెలాగో చూద్దాం. 1990లో వెంకీ హీరోగా అగ్గి రాముడు సినిమా వచ్చింది. అమల, గౌతమి హీరోయిన్లుగా ఎస్ ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచనలో కృష్ణ-శేఖర్ లు దీన్ని నిర్మించారు. అప్పటికే వెంకటేష్ కెరీర్ మంచి పీక్స్ లో ఉంది.
శ్రీనివాస కళ్యాణం, రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, వారసుడొచ్చాడు, ప్రేమ, ఒంటరి పోరాటం, ధ్రువనక్షత్రం ఇలా వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న టైం. టూ టౌన్ రౌడీ ఒక్కటే అంచనాలు అందుకోలేకపోయింది. ఆ సమయంలో వచ్చిందే అగ్గి రాముడు. తమ హీరో మొదటి సారి డ్యూయల్ రోల్ అనగానే అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. అంచనాలు పెరిగాయి. జీవితంలో దగాపడి శ్మశానంలో ఉంటూ చెడుకి ఎదుగుతిరిగే వాడిగా ఒక పాత్రలో, రెగ్యులర్ కమర్షియల్ యాంగిల్ లో మరో రోల్ లో ఇందులో వెంకీ కనిపిస్తారు. అయితే అగ్గిరాముడు అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు.
దానికి కారణాలు ఉన్నాయి. టైటిల్ మరీ పాతగా అనిపించడం అందులో ఒకటి. అప్పటికే శివ లాంటి సినిమాల ద్వారా కొత్త ట్రెండ్ మొదలవుతున్న తరుణంలో అగ్గి రాముడులో దర్శకుడు రవిచంద్ర అవుట్ డేటెడ్ ట్రీట్మెంట్ చూపించడంతో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. పైగా ఫామ్ తగ్గిపోయిన చక్రవర్తిని సంగీత దర్శకుడిగా తీసుకోవడం. టెక్నాలజీని వాడకుండా స్టార్ హీరో సినిమాను 35 ఎంఎంలో తీయడం లాంటివి మైనస్ అయ్యాయి. శారదా, సత్యనారాయణ, కోట, అల్లు రామలింగయ్య, నర్రా, నిర్మలమ్మ, శరత్ బాబు లాంటి భారీ క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. దెబ్బకు అగ్గిరాముడు ఫెయిల్యూర్ మూటగట్టుకొక తప్పలేదు. పోకిరి రాజాకు సైతం ఇదే రిపీట్ అయ్యింది. మళ్ళీ 2000లో వచ్చిన జయం మనదేరా, సూర్యవంశంలతో హిట్స్ అందుకున్నారు వెంకటేష్.