iDreamPost
iDreamPost
బాహుబలి దెబ్బకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ రాబోయే నాలుగైదేళ్లలో వరస సినిమాలతో అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు. అన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడంతో అంతా కలిపి సుమారు రెండు వేల కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా ఇండియాలో ఏ స్టార్ కి ఇంత పెద్ద మార్కెట్ ఏర్పడలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందులోనూ ఒక ప్రాంతీయ హీరో ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం గతంలో ఎన్నడూ జరగలేదు. చిరంజీవి లాంటి సీనియర్లు సైతం సాధించలేని ఘనత ప్రభాస్ నార్త్ లో చేసి చూపించాడు.
రాధే శ్యామ్ చివరి దశ పనుల్లో ఉండగా ఇటీవలే సలార్ పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఇవాళ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోయే ఆది పురుష్ యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులను గ్రాఫిక్స్ తో మొదలుపెట్టింది. చాలా ఖరీదైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని దీని కోసం వాడుతున్నారు. గతంలో కొన్ని చిత్రాలకు ఇది వాడినప్పటికీ సినిమా మొత్తం ఎవరూ ఉపయోగించలేదు. కానీ ఆది ఫురుష్ దీనికి మినహాయింపుగా నిలుస్తోంది. నిజమని భ్రమింపజేసే సాంకేతికతను విఎఫ్ఎక్స్ కు జోడించడం ద్వారా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అందుకోవడం సాధ్యమవుతుందని నిర్మాత భూషణ్ చెబుతున్నారు. వ్యయం అయిదు వందల కోట్ల దాకా ఉండొచ్చని బాలీవుడ్ టాక్.
ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాల్లో విడుదల విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఇవన్నీ అయ్యాక నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్రాజెక్ట్ మొదలవుతుంది. దాని బడ్జెట్ కి హైప్ కి ఆకాశమే హద్దుగా నిలవబోతోంది. అందుకే ఆలస్యంగా మొదలుపెట్టబోతున్నారు. రాధే శ్యామ్, సలార్ లు 2021లో, ఆది పురుష్ 2022 లో విడుదలైతే 2023 లేదా ఆపై సంవత్సరం నాగ అశ్విన్ సినిమా వస్తోంది. ఇవి కాకుండా మరో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసే ఆలోచనలో డార్లింగ్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ఈ వేసవి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే పండగ.