iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు ఏడాదికి పదికి పైగా సినిమాలు చేయడం చాలా మాములు విషయమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి ఒకటి చేయడమే మహా గగనంగా మారింది. అయితే ఇందులోనూ అప్పుడప్పుడు గ్యాప్ తీసుకోవడం కూడా సహజమే. వరస డిజాస్టర్లు పలకరించినప్పుడు మెగాస్టార్ 1996లో ఏ సినిమా విడుదల చేసుకోలేదు. అల్లు అర్జున్ నా పేరు సూర్య దెబ్బకు, నితిన్ శ్రీనివాస కళ్యాణం తర్వాత ఇలా బ్రేక్ తీసుకున్న వాళ్ళే. మహేష్ బాబు ఖలేజాకు ముందు సీన్ అందరికీ గుర్తే. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. పక్క రాష్ట్రంలో వీళ్లకు ఏ మాత్రం తీసిపోని ట్రాక్ రికార్డు ఉన్న తమిళ హీరో విజయ్ 1992 నుంచి 2019 దాకా నాన్ స్టాప్ గా ఒక్క సంవత్సరం గ్యాప్ రాకుండా సినిమాలు విడుదల చేసుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం.
27 ఏళ్ళుగా విజయ్ కు ఎక్కడా విరామం రాలేదు. నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూనే వచ్చాడు. నాలియా తీర్పుతో మొదలుపెట్టి బిగిల్ దాకా నాన్ స్టాప్ గా చేసుకుంటూ వచ్చాడు. అంతా సవ్యంగా ఉంటే 2020లో మాస్టర్ వచ్చి 28 ఇయర్స్ ని కంటిన్యూ చేసేది. కానీ ఇప్పుడా అవకాశం లేదని తేలిపోయింది. మాస్టర్ ని పూర్తిగా పోస్ట్ పోన్ చేశారు. వచ్చే సంక్రాంతికి వస్తుందా లేక 2021 వేసవికి వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంగా విజయ్ ఫ్యాన్స్ తెగబాధ పడిపోతున్నారు. నిజమే మరి. వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోకు ఇలాంటి అరుదైన రికార్డు మిస్ అయితే ఆ మాత్రం పెయిన్ అనిపించడం సహజం. కార్తీక్ ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
విజయ్ కు ఓవర్ సీస్ మార్కెట్ కూడా చాలా కీలకం కాబట్టి ప్రొడ్యూసర్లు ఎలాంటి తొందరపాటు ప్రదర్శించడం లేదు. ఎంత లేట్ అయినా సరే అంతా కుదుటపడి థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చినప్పుడే విడుదల చేసేందుకు నిర్ణయించుకునట్టుగా చెన్నై టాక్. తుపాకీ, అదిరింది, విజిల్ వల్ల విజయ్ కు తెలుగులోనూ మాస్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. మాస్టర్ కు సైతం బిజినెస్ డీల్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. సో రిస్క్ చేయడం ఇష్టం లేక మార్కెట్ మొత్తం నార్మల్ అయితే కానీ మాస్టర్ బయటికి రావడం అసాధ్యం అని తేలిపోయింది. మన బాలకృష్ణకు సైతం ఇలాంటి అరుదైన రికార్డు దక్కేది కానీ లెజెండ్ కు ముందు 2013లో ఏ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు విజయ్ కీ మిస్ అయిపోయింది. మాస్టర్ తర్వాత నాలుగోసారి మురుగదాస్ తో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే