iDreamPost
android-app
ios-app

ఎల్లలు దాటిన దాతృత్వం

ఎల్లలు దాటిన దాతృత్వం

కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అని ప్రకటించేసి తెర వెనుక ప్రభుత్వాధినేతలు చేసిన మంత్రాంగాలు తెలియదు గానీ తెర ముందు మాత్రం వలస కూలీల నెత్తుటి నడకలు, తిండి దొరకని ఆకలి కేకలు, ఉన్న చోట్ల ఉండలేక స్వంత ఊర్లకి వెళ్లలేక అవస్థలు పడుతుంటే చాలా మంది తమకు చేతనైన కాడికి చేయూతనిచ్చారు.

అలా ముందుకొచ్చిన వారిలో బాగా వినిపించిన పేరు సోను సూద్. అన్నదాన శిబిరాలు నిర్వహించడం, బస్సులు పెట్టి స్వంత ఊర్లకు తరలించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందించి తన ఔదార్యాన్ని చాటుకోవడం చాలా రకాలుగా ప్రజలతో మమేకమయ్యాడు.

ఆయన సాయానికి కృతజ్ఞతగా తమకు బిడ్డలు పుడితే సోను సూద్ పేరు పెట్టుకోవడం, తాము ఏదైనా చిరు వ్యాపారం పెట్టుకుంటే ఆయన పేరే పెట్టుకోవడం ఇంకా చాలా మంది తమ గుండెల్లో నింపుకోవడం కూడా చూశాము.

Also Read:అంతర్థానమవుతున్న ఆనవాళ్లు

అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె తాలూకాలో ఒక టమోట రైతుకు అండగా ట్రాక్టర్ ను ప్రకటిస్తూ ఆయన చేసిన ప్రకటన అతని వ్యక్తిత్వాన్ని నాలుగు మెట్లు ఎక్కించిందని చెప్పొచ్చు.

ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం చేసే రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన సమయానికి వర్షాలు రావు, పోనీ భూగర్భ జలాలా అంటే అవి రోజు రోజుకీ అడుగంటుతున్న పరిస్థితి అయినా సరే అని ధైర్యం చేసి ముందుకు దూకితే అమ్మే సమయానికి సరైన మార్కెట్ ధరులు లేక సమూలంగా నష్టపోయేంత దారుణమైన పరిస్థితి. అమ్మనుబోతే అడివి కొననుబోతే కొరివి అన్నట్టుగా.

వివరాల్లోకి వెళితే మదనపల్లె తాలూకాలోని ఒక రైతు. అన్ని కష్టనష్టాలకోర్చి గత సంవత్సరం టమోట సాగు చేశాడు. నష్టాలే. ఈ సంవత్సరం కాలం కొద్దీ వర్షాలు బాగా పడ్డాయి. రైతు తనం ఊరికే ఉండనియ్యదు కదా. మళ్లీ సాగు చెయ్యాలనుకున్నాడు. కానీ పెట్టుబడి ఎలా?

నాగేటి సేద్యం చెయ్యాలంటే ఎకరాకు కనీసం ఎంతలేదన్నా రెండు వేల వరకూ అవుతుంది. అది భరించే పరిస్థితి లేదు. కానీ ఏం చెయ్యగలడు. చెయ్యాలనే తపనుంది ఒంటినిండా శక్తుంది. గతిలేని పరిస్థితుల్లో తన ఇద్దరు కూతుర్లను కాడిమానుకు పట్టి సేద్యం చెయ్యడం మొదలుపెట్టాడు.

Also Read:దేశ ప్రథమ పౌరుడిగా మూడేళ్లు..!

ఎంత దయనీయ పరిస్థితి కదా. హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు. అది అటు తిరిగి ఇటు తిరిగి సోను సూద్ కంటపడింది. మనోడి మనసు చలించిపోయింది. నీ పిల్లలను బాగా చదివించి నీకు కావాల్సిన జత ఎద్దుల్ను నేను తీసిస్తా అని ప్రకటించాడు. అంతలోనే ఏమనుకున్నాడో ఏమో జత ఎద్దలు కాదు ఏకంగా ఒక ట్రాక్టర్నే కొనిస్తా అని ప్రకటించి, వెంటనే వారికి ట్రాక్టర్ చేరవేసి తన గొప్ప మనసును బయటపెట్టాడు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకమైన జత ఎద్దులు కొనాలంటే ఎంతలేదన్నా లక్ష లక్షన్నర పెట్టాలి. అదే ట్రాక్టర్ అయితే అయిదు నుండి ఆరు లక్షల వరకూ ఉండొచ్చు.
అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఆ రైతు తనాన్ని నిలబెట్టాడానికి అతను చూపిన దాతృత్వం.

సోను సూద్ అంటే తెలుగు సినిమాల్లో విలన్ లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్సే గుర్తొస్తాయి గానీ ఇటువంటి చర్యల ద్వారా సామన్య ప్రజల మనసుల్లో నిజమైన హీరోగా నిలిచిపోతాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తి పూజలకు అతీతంగా.