iDreamPost
iDreamPost
ఒకప్పుడు సినిమాలకు సెకండ్ థర్డ్ రిలీజులు ఉండేవి. టీవీల పరంగా దూరదర్శన్ ఒక్కటే అందుబాటులో ఉండేది కాబట్టి వీటికి బ్రహ్మాండమైన ఆదరణ దక్కేది.1977లో వచ్చిన దానవీరశూరకర్ణ 90వ దశకంలో కొత్త ప్రింట్లతో మళ్ళీ విడుదల చేస్తే కోటి రూపాయలు వసూలు చేయడం ఇప్పటికీ చెదిరిపోని రికార్డు. విజయనిర్మల గారు 1974లో కృష్ణతో దేవదాసు కలర్ లో తీసినప్పుడు దానికి పోటీగా ఏఎన్ఆర్ 1954 దేవదాసు రీ రిలీజ్ చేస్తే ఇదే వంద రోజులు జరుపుకుని కృష్ణ మూవీ ఫ్లాప్ కావడం అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. ఇక చిరంజీవి, బాలకృష్ణ బ్లాక్ బస్టర్లు లెక్కలేనన్ని సార్లు వచ్చేవి పోయేవి. మంచి వసూళ్లయితే తెచ్చి పెట్టేవి.
ఇప్పుడు కాలం మారింది. ఓటిటిలు, యుట్యూబ్ లు, శాటిలైట్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాక జనం పాత సినిమాలు పెద్దతెర మీద చూసేందుకు ఇష్టపడరని గుర్తించిన డిస్ట్రిబ్యూటర్లు వాటిని వేయడం మానేశారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చేలా కనిపిస్తోంది. ఎల్లుండి 27న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆది, రామ్ చరణ్ మగధీరలు స్పెషల్ షోలు వేస్తున్నారు. ఇందులో మొదటిదానికి అప్పుడే టికెట్లన్నీ అమ్ముడైపోగా రెండోదానికి కూడా బుకింగ్ జోరుగా ఉంది. కేవలం ఒక ఆటకే పరిమితం చేయడంతో అభిమానుల నుంచి భారీ స్పందన ఉంది. ఆ మధ్య ఏఎంబిలో జగడం షో వేయడం చర్చల్లో నిలిచింది.
ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇచ్చే ఇలాంటి షోలు మున్ముందు మరిన్ని రావాలని సదరు హీరోల అభిమానులు కోరుకోవడం గమనార్హం. హైదరాబాద్ లో మాత్రమే కాదు ఇతర నగరాల్లో కూడా ఈ పోకడ ప్రారంభమయ్యింది. కొద్దిరోజుల క్రితం తిరుపతిలో అరవింద సమేత వీర రాఘవ వేస్తే హౌస్ ఫుల్ బోర్డు పడింది. మరోచోట పోకిరి వేస్తే అక్కడా ఇదే పరిస్థితి. ఇంకాస్త వెనక్కు వెళ్లి శివ, బొబ్బిలిరాజా, ఖైదీ లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ వేస్తే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో. ఎంత ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నా కూడా పెద్దతెరమీద చూస్తే వచ్చే ఆనందం ముందు ఏదీ సాటిరాదని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు వేరే కావాలా.