iDreamPost
iDreamPost
ఒకప్పుడు అవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. ఎటు చూసినా గుడారాలు, మట్టిగోడల సమూహాలే. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరికివారే అన్నట్లున్న ఎమిరేట్స్ చేతులు కలిపాయి. సమాఖ్య(ఫెడరేషన్)గా ఏర్పడ్డాయి. బలమైన దేశాన్ని, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. ఆ దేశమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ). ఏడు ఎమిరేట్స్ కలిసి సమాఖ్య దేశంగా అవతరించి సరిగ్గా 50 ఏళ్లు అయ్యాయి. 1971 డిసెంబర్ 2న ఏర్పడిన యూఏఈ మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో, అరబ్ ప్రపంచంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం గొప్ప విజయం.
ఎమిరేట్స్ జాతిపిత షేక్ జాయేద్
19వ శతాబ్దంలో ట్రూషియల్ స్టేట్స్ గా పేరొందిన ఎమిరేట్స్ 1892 నుంచి బ్రిటిష్ రక్షిత ప్రాంతాలుగా ఉండేవి. ఎడారి ఔట్ పోస్టులుగా ఉపయోగపడేవి. అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫుడైరో, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వయిన్ అనే ఏడు ఎమిరేట్స్ వేర్వేరుగా కొనసాగేవి. అరబ్ షేక్ లు ఎవరికివారుగా వీటిని పాలించేవారు. 1966 నుంచి అబుదాబి పాలకుడిగా ఉన్న షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఏడు ఎమిరేట్స్ ను కలిపి ఒకే ఫెడరల్ దేశంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మిగతా ఎమిరేట్స్ పాలకులను సంప్రదించి ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే 1971 డిసెంబర్ రెండో తేదీన యూఏఈ ఆవిర్భవించింది. అందరూ కలిసి ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నారు. దాని తొలి అధ్యక్షుడిగా కూడా ఆయనే వ్యవహరించారు. అందుకే ఆయన్ను యూఏఈ జాతిపిత అంటారు.
సంపన్న దేశంగా, ఆర్థిక శక్తిగా..
అరబ్ ప్రపంచంలో తొలి సమాఖ్య దేశంగా ఆవిర్భవించిన యూఏఈ అప్పటినుంచి శరవేగంగా అభివృద్ధి చెందింది. మట్టి ఇళ్లు, గుడారాల స్థానంలో కళ్లు చెదిరే ఆకాశ హార్మ్యాలు తలెత్తుకునేల చేస్తున్నాయి. ప్రపంచంలో అతి ఎత్తైన బూర్జ్ ఖలీఫా భవనం నుంచి అతి లోతైన డైవింగ్ పూల్ వరకు ఎన్నో ప్రత్యేకతలకు కేంద్రంగా మారింది. జనాభా కూడా 3 లక్షల నుంచి 10 మిల్లియన్లకు పెరిగింది. వీరిలో 90 శాతం విదేశీయులే. యూఏఈ చట్టాలు కఠినంగా ఉండటంతో అధిక శాతం మంది పౌరసత్వానికి దూరంగా ఉంటున్నారు.
ముడి చమురే ఆదాయం, ఆయుధం
అపారమైన చమురు నిక్షేపాలే ప్రధాన ఆర్థిక వనరుగా చేసుకొని యూఏఈ సంపన్న దేశంగా అవతరించింది. అరబ్ ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చట్టాలను, నిబంధనలను సరళతరం చేసింది. తనను తాను జీరో టాక్స్ హెవెన్ గా ప్రకటించుకుంది. స్థానికేతర యాజమాన్యాలపై పరిమితులు ఎత్తివేసింది. మెరుగైన విదేశాంగ విధానం ద్వారా మిడిల్ ఈస్ట్ లో, అరబ్ ప్రపంచంలో బలమైన రాజకీయ శక్తిగా కూడా కీలకపాత్ర పోషిస్తోంది. దశాబ్దాల అరబ్ ఏకాభిప్రాయాన్ని కూడా కాదని ఇజ్రాయెల్ ను గుర్తించడం ద్వారా తన ప్రాబల్యాన్ని చాటుకుంది.