iDreamPost
iDreamPost
చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని విషాదకర ఘటనలు ఏళ్లు గడుస్తున్నా మరవలేం. దేశ స్వాతంత్య్రానికి ముందు కోరంగి తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో.. స్వాంతంత్య్ర అనంతరం వచ్చిన దివిసీమ తుఫాను (దివిసీమ ఉప్పెన) అంతే విధ్వంసం చేసింది. తుఫాను వల్ల కుంభవృష్టిని తలపించిన భారీ వర్షం… మనుషులను.. ఇళ్లను గాలుల్లో ఎగురు వేసుకుపోయిన పెను గాలులు…సునామీని మించి మూడు తాటిచెట్ల ఎత్తున ఎగిసిపడిన రాకాశి అలలు… పచ్చని దివిసీమను స్మశానదిబ్బగా మార్చేశాయి. వేలాది మందిని పొట్టనబెట్టుకుని.. లక్షల మంది నిరాశ్రయులను చేసిన దివిసీమ ఉప్పెన వచ్చి నేటికి 45 ఏళ్లు. నాడు ప్రకృతి పగబట్టి చేసిన గాయం ఈ ప్రాంతవాసుల్లో ఇప్పటికీ పచ్చిగానే ఉంది.
అది 1977 నవంబరు 17. అండమాన్ నికోబార్ దీవులు వద్ద తీరానికి 520 కిమీల వద్ద అల్పపీడం ఏర్పడి తరువాత తుఫానుగా రూపాంతరం చెందింది. గంటకు 170 కిమీల వేగంతో దిశలు మార్చుకుంటూ తుఫాను ప్రయాణం చేసింది. ఇది మన తీరానికి 140 కిమీల దూరంలో ఉండగా వాతావరణ శాఖ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కాని అప్పటికే ఆలస్యమైంది. అప్పటికి ఇంకా సమాచారం, సాంకేతిక రంగం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకోలేదు. దీనితో అపార నష్టం చవిచూడాల్సి వచ్చింది. తుఫాను కృష్ణా జిల్లా దివిసీమ వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో తుఫాను వేగం మరింత పెరిగింది. తీరం దాటే సమయంలో దాని వేగం 250 కిమీలు ఉంది. కేవలం 2 గంటలు మాత్రమే అది తీవ్ర ప్రభావం చూపింది. ఆ రెండు గంటల్లోను అది సృష్టించిన విధ్వంసాన్ని 45 ఏళ్లుగా చెప్పుకునేలా చేసింది. తీరంలో అన్ని జిల్లాల్లోను భారీ వర్షం కురిసింది. ప్రతీ జిల్లాలోను విధ్వంసం సృష్టించింది. అయితే కక్షగట్టినట్టు దివిసీమను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
Also Read: తెగిన అన్నమయ్య డ్యామ్ ,భయం గుప్పెట్లో సోమశిల ప్రాజెక్ట్
తీరంలో చాలా తుఫాన్లు చూసిన దివిసీమ వాసులు ఎప్పటిలానే తీరం దాటిపోతుందని నిశ్చింతగా నిద్రపోయారు. కాని ఆ రాత్రే వారికి చివరి రాత్రి అవుతుందని గుర్తించలేకపోయారు. సముద్రం ఉగ్రరూపం దాల్చి… ఊళ్లకు ఊళ్లను ముంచెత్తింది. మూడు తాటిచెట్ల ఎత్తున కెరటాలు భూమిని తాకాయి. జపాన్ సునామీని మించి ఉప్పెన ముంచెత్తింది. రెప్పమాటు కాలంలో రాకాసి అలలు ఊళ్ల మీద పడడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మనుషులు, పశువులు కొట్టుకుపోయాయి. అర్థరాత్రి కావడం, నిద్రలో ఉండడంతో ఈతవచ్చిన మత్స్యకారులు సైతం నీట మునిగారు. గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఎటుచూసినా శవాలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. వారిని సామూహికంగా దహనం చేయాల్సి వచ్చింది. ఉప్పెనలో కొట్టుకుపోయి చనిపోయినవారి శవాలు ముళ్లచెట్లకు అతుక్కుపోయాయి. పొలాలు, కాలువల్లో చేరిన బురదల్లో శవాలు, పశు కళేభరాలు కూరుకుపోయాయి. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నాయకులు, అధికారులకు అక్కడ దృశ్యాలకు హృదయాలు ద్రవించుకుపోయాయి. శవాలను గుట్టలుగా పోసి తగలబెట్టాల్సి వచ్చింది. ప్రాణాలు దక్కించుకున్నవారికి కట్టుబట్టలు కూడా మిగలలేదు. నాటి దుర్ఘటనను తులుచుకుంటే ఒళ్లు గగుర్పాటునకు గురి చేస్తుంది.
దివిసీమ ఉప్పెనలో సుమారు 10 వేల మందికి పైగా ప్రజలు మృత్యువాత పడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సొర్లగొంది గ్రామానికి చెందిన మత్స్యకారులే సుమారు 740 మంది వరకు చనిపోయారు. ఐదు లక్షల పశువులు చనిపోగా, 35 లక్షల ఎకరాల్లో పంట చేలు నాశనమయ్యాయి. అనధికారికంగా మృతుల సంఖ్య 50 వేల మందికి పైగా ఉంటారని అంచనా. అప్పట్లోనే రూ.175 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఉప్పెనకు సోర్లగొంది అనే గ్రామం తొలిగా బలైపోయింది. మొత్తం 100 ఊర్లకు పైగా కొట్టుకుపోయాయి. 83 గ్రామాలు జల సమాధి అయ్యాయి. నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు జరిగిన విపత్తు తెలియడానికి ఒక రోజు సమయం పట్టింది. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దివిసీమను సందర్శించారు.
Also Read:చిత్రావతి వరదలో చిక్కుకున్న 10 మంది.. ఎమ్మెల్యే చొరవతో హెలికాప్టర్ సాయంతో కాపాడిన సహాయ బృందం
నవంబరు 17 అంటే దివిసీమ వాసులకు ఇప్పటీ వణుకే. ఆ పీడకల ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది. మన దేశం అప్పటి వరకు అంత పెద్ద విపత్తును చూడలేదు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఉప్పెన విషాదాన్ని నింపింది. ప్రపంచ వ్యాప్తంగా సహాయం వెల్లువెత్తింది. దేశం ఒక్కతాటిపై వచ్చి దివిసీమ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కొన్ని వారాలపాటు రోడ్లు, రైల్వే వ్యవస్థ పుననిర్మాణం జరగలేదు. పలు సంస్థలు, సంఘాలు ఆయా ముంపు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశాయి. ఉప్పెన ముంచెత్తిన చివరి ఊరు పులిగడ్డ. ఇక్కడ దివిసీమ మృతులకు సంతాపంగా స్మారకస్థూపం నిర్మించారు. ఇది సముద్ర తీరానికి 35 కిమీల దూరంలో ఉందంటే నాటి ఉప్పెన తీరంలో ఏ స్థాయిలో వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇది దేశ డిసాజ్టర్ మేనేజ్‌మెంట్ పాఠాల్లో కీలక పాఠంగా ఉంది. దివి సీమ ఉప్పెన తరువాత పూర్వవైభవం రావడానికి ఈ దీవికి 25 ఏళ్లు సమయం పట్టిందని అంచనా. ఆక్వా సాగు పెరగడంతో ఈ ప్రాంతంలోని గ్రామాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి.