iDreamPost
android-app
ios-app

నాలుగు దశాబ్దాల జగిత్యాల జైత్రయాత్ర…

  • Published Sep 09, 2021 | 8:27 AM Updated Updated Mar 11, 2022 | 10:40 PM
నాలుగు దశాబ్దాల జగిత్యాల జైత్రయాత్ర…

భూమి కోసం.. భుక్తి కోసం.. అంటూ సుమారు ఆరు దశాబ్దాల క్రితం చారు ముజుందార్, కాను సన్యాల్ వంటి నేతల సారథ్యంలో ఊపిరి పోసుకున్న నక్సల్బరీ ఉద్యమం కాలక్రమంలో అనేక రూపాలు సంతరించుకుని గిరిజన రైతాంగ పోరాటంగా, పీపుల్స్ వార్ గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. వీటన్నింటికీ ఊపిరి పోసింది జగిత్యాల జైత్రయాత్ర అనే చెప్పాలి. 43 ఏళ్ల క్రితం కొండపల్లి సీతారామయ్య ప్రోద్బలంతో నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయుధ పోరాటమే మార్గమని తలచి రైతు కూలీలను సమీకరించి జగిత్యాల కేంద్రంగా పూరించిన విప్లవ శంఖమే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

గడీల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా..

1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో మొదటి రైతాంగ పోరాటం పురుడు పోసుకుంది. అదే నక్సల్బరీ ఉద్యమంగా పేరుపొంది 1969 వరకు సాగింది. అక్కడి నుంచి ఆ స్ఫూర్తి ఉమ్మడి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు పాకింది. శ్రీకాకుళం ఏజెన్సీలోని సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో గిరిజన రైతాంగ పోరాటం 1969లో మొదలైంది. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రహి వంటి నేతల సారథ్యంలో 1971 వరకు ఉవ్వెత్తున సాగిన ఈ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది. దాంతో ఆనాటి హోమ్ మంత్రి జలగం వెంగళరావు స్వయంగా సాయుధ పోలీసు బలగాలతో సీతంపేటకు వెళ్లి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. దాంతో రెండేళ్లపాటు ఉద్యమం దాదాపు జరగలేదు. పౌరహక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘం, జననాట్య మండలి కార్యకర్తల తెర వెనుక ప్రచారానికే పరిమితం అయ్యింది.

అయితే 1977లో కొండపల్లి సీతారామయ్య పూనుకొని మళ్లీ విప్లవ ఉద్యమానికి ఊపిరి పోశారు. సీపీఐ ఎం ఎల్, సీవోసీ తదితర సంఘాల ఆర్గనైజర్లతో ఉద్యమ వ్యాప్తి ఆవశ్యకతపై చర్చించి కార్యోన్ముఖులను చేశారు. విప్లవబాట అనే డాక్యుమెంట్ ద్వారా ప్రజా సంఘాల నిర్మాణ అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ భూస్వాముల గడీల పాలనలో జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు, శ్రమ దోపిడీ, వెట్టిచాకిరీ వంటి విధానాలను ఎదుర్కొనేందుకు రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయాలని 1977 ఆగస్టులో నిర్ణయించారు. విప్లవ నాయకులందరూ గ్రామాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు.

Also Read : బాపు, వేటూరిలు జీవించి ఉంటే రాధా కృష్ణ పోలికల రాతలకు ఏమయ్యేవారో..?

ఎరుపెక్కిన జగిత్యాల…

కొండపల్లి పిలుపు మేరకు నేతలు కార్యాచరణ ప్రారంభించారు. 1978 ఏప్రిల్-మే నెలల మధ్య 30 రోజులపాటు మంథని సమీపంలోని శాస్త్రులపల్లెలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రముఖ నేతలు కె.జి.సత్యమూర్తి, ఎక్కలదేవి సాంబశివరావు విప్లవ ఉద్యమ ఆవశ్యకత, రైతాంగ సమస్యలు, భూస్వాముల దోపిడీ విధానాలపై తరగతులు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉత్తర తెలంగాణ పల్లెల్లోకి వెళ్లి రైతు కూలీలకు పరిస్థితి వివరించి.. అవగాహన కల్పించడంతోపాటు.. ఉద్యమానికి సమాయత్తం చేశారు. నారదాసు లక్ష్మణరావు, సాయిని ప్రభాకర్, గుంజపడుగు నారాయణరెడ్డి, సదానందం, డాక్టర్ హరినారాయణ తదితర ప్రముఖులు కూడా రైతుకులీ సభలపై విస్తృత ప్రచారం చేశారు.

విస్తృత ప్రచారం ద్వారా సుమారు 80 వేలమంది రైతు కూలీలను జగిత్యాల సభకు సమీకరించారు. 1978 సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రైతుకులీ శక్తి ప్రదర్శన పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజు జగిత్యాల నలుచెరగులా ఎటు చూసినా జన తరంగం పోటెత్తింది. ఎర్ర జెండాలతో ఊరు ఊరంతా ఎర్రబారింది. జననాట్యమండలి కళాకారుల విప్లవ గీతాలు, నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఎర్ర సైన్యం నిర్వహించిన లాంగ్ మార్చ్ తో జగిత్యాల దద్దరిల్లింది. ముప్పాళ్ల లక్ష్మణరావు, మాల్లోజుల కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, వరవరరావు, అల్లం నారాయణ, పోరెడ్డి వెంకటరెడ్డి తదితర నేతలు తమ ప్రసంగాలతో విప్లవ స్ఫూర్తి రగిలించారు. కొండపల్లి సీతారామయ్య స్వయంగా పాల్గొనలేక పోయినా కార్యక్రమ విజయవంతానికి తెరవెనుక కీలక పాత్ర పోషించారు.

విప్లవోద్యమ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోయిన రైతుకులీ శక్తి ప్రదర్శన కార్యక్రమాన్ని ఆనాటి పత్రికలు విస్తృతంగా కవర్ చేస్తూ జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణించాయి. ఇదే ఉద్యమం 1980లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్ గా మారింది. అక్కడి నుంచి రెండున్నర దశాబ్దాల తర్వాత పీపుల్స్ వార్ తో పాటు.. మిగిలిన విప్లవ గ్రూపులన్నీ కలిసి 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించాయి.

Also Read : ముత్యాలపాప రాజకీయ జీవితం ముగినట్లేనా..?