iDreamPost
iDreamPost
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి మూగ మనసులు ఒక క్లాసిక్ గా నిలిచిపోయిన విషయం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. అందులో పాటలు, కథను తీర్చిదిద్దిన విధానం, పునర్జన్మల కాన్సెప్ట్ జనానికి విపరీతంగా నచ్చేసి కాసుల వర్షం కురిపించారు. మగధీర లాంటి బ్లాక్ బస్టర్స్ కు సైతం ఇది స్ఫూర్తి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1988లో నాగార్జునకు ఇలాంటి సబ్జెక్టు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది రాఘవేంద్రరావు గారికి. అనుకోవడమే తడవు శివశక్తిదత్తా, విజయేంద్రప్రసాద్ లతో ఆ జెనరేషన్ అభిరుచులకు అనుగుణంగా స్టోరీని సిద్ధం చేయించారు. కేవలం ఉత్తమాభిరుచి కలిగిన సినిమాలు మాత్రమే తీస్తారని పేరున్న కె మురారి తన యువచిత్ర బ్యానర్ మీద నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
దాంతో జానకి రాముడుకి శ్రీకారం చుట్టబడింది. అప్పటికే చూసేసిన కథ అయినప్పటికీ అందులో ఉన్న మేజిక్ ని సరైన రీతిలో ఆవిష్కరిస్తే మరోసారి అద్భుతాలు చేయగలదన్న నమ్మకం దర్శకేంద్రులది. సంభాషణలకు సత్యానంద్, సంగీతానికి కెవి మహదేవన్, కెమెరాకు కెఎస్ ప్రకాష్ ఇలా పర్ఫెక్ట్ గా టీమ్ ని సెట్ చేసుకున్నారు. మెయిన్ పాయింట్ మూగ మనసులోనిదే తీసుకున్నప్పటికీ ఇందులో చాలా మార్పులు చేశారు. వర్తమానంలో ప్రేమ జంట రాము(నాగార్జున) జానకి(విజయశాంతి)ఓ అనూహ్యమైన పరిస్థితుల్లో ఓ పల్లెటూరికి వస్తారు. అక్కడి పరిసరాలు వ్యక్తులు తమకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తాయి. ఓ వయసు మళ్ళిన పెద్దావిడ సత్యవతి(జీవిత)వల్ల తమ పూర్వ జన్మ అక్కడే గడిచిందని తెలుసుకుంటారు.
కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంలో అసలు కథ మొదలవుతుంది. అప్పుడు ఏం జరిగింది వీళ్ళు ప్రాణాలు ఎలా కోల్పోయారు లాంటివి చాలా ఆసక్తికరంగా మలిచారు. జానకిరాముడు మ్యూజికల్ గా భారీ హిట్టు. నా గొంతు శృతిలోనా, నా చరణం కమలం, అదిరింది మామా, చిలకపచ్చ తోటలో లాంటి పాటలు ఊరువాడా మారుమ్రోగిపోయాయి. కమర్షియల్ గానూ ఈ సినిమా మంచి వసూళ్లు అందుకుని నాగార్జునని మాస్ హీరోగానూ చూపించవచ్చని రుజువు చేసింది.సత్యనారాయణ, జగ్గయ్య, మోహన్ బాబు, చలపతిరావు, బ్రహ్మానందం, సుత్తివేలు లాంటి భారీ క్యాస్టింగ్ తో రాఘవేంద్రరావు గారు జానకిరాముడిని కలర్ ఫుల్ గా చూపించారు. ఆగస్ట్ 19న విడుదలైన జానకి రాముడు 13 కేంద్రాల్లో శతదినోత్సవ సంబరాలు చేసుకుంది. అప్పటిదాకా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయని నాగార్జునని రాముడిగా చూసిన అభిమానుల ఆనందం మాములుగా లేదు. దసరాబుల్లోడు తరహాలో ఉందని మురిసిపోయారు. జీవితకు కూడా చాలా పేరు తీసుకొచ్చిందీ సినిమా.