iDreamPost
iDreamPost
భిన్నత్వంలో ఏకత్వం.. సర్వమత సమానత్వం.. పరమత సహనం.. హిందూ ముస్లిం భాయ్ భాయ్.. ఇవన్నీ భారతీయతకు మారుపేర్లు. ప్రపంచంలో మనదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన సంప్రదాయాలు. కానీ వీటన్నింటినీ ఒకే ఒక్క ఘటన నేలకూల్చేసింది. అదే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన. ఇది భారతీయ గౌరవాన్ని మంటగలపడమే కాకుండా.. అప్పటివరకు సోదరుల్లా మెలిగిన హిందూ ముస్లింల మధ్య వివాదాల మంటలు రాజేసింది. మతం మంటల్లో భారతీయ సమాజం మలమల మాడిపోయేలా చేసింది. అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లజేసింది. వీటిపై వేసిన కేసులు, కమీషన్లు కూడా దశాబ్దాలపాటు కొనసాగాయి. చివరికి వివాదాలు సమసి పోయినా.. 1992 డిసెంబర్ 6 నాటి కూల్చివేత ఘటన స్వతంత్ర భారత చరిత్రలో బ్లాక్ డే గానే మిగిలిపోయింది.
మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారంటూ వివాదం
హిందువుల ఆరాధ్య పురుషుడు శ్రీరాముడు జన్మించిన స్థలం అయోధ్య అని పురాణాలు చెబుతున్నాయి. దానికి సాక్షీభూతంగా వేల సంవత్సరాల క్రితమే రామజన్మ భూమిలో ఆలయం ఉండేదని చెబుతారు. అయితే మొఘల్ పాలన సమయంలో అంటే 16వ శతాబ్దంలో రామాలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో బాబ్రీ మసీదు నిర్మించారన్న వాదనను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ తదితర హిందూ సంస్థలు తెరపైకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్చియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ కూడా ఈ వాదనను బలపరిచింది. ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలంలో మసీదు నిర్మించారని తన పరిశోధనల ద్వారా నిర్ధారించింది. దాంతో బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మించాలని 1980 దశాబ్దంలో వీహెచ్ పీ ప్రచారం ప్రారంభించింది. దానికి ఇతర హిందూ సంస్థలతోపాటు సంఘ్ పరివార్ కు చెందిన బీజేపీ కూడా గొంతు కలిపి రాజకీయ రంగు పులిమింది.
రథయాత్ర.. కరసేవ పేరుతో..
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ దేశవ్యాప్త రథయాత్ర చేపట్టడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. దానికి మద్దతుగా దేశం నలుమూలల హిందూ సంఘాల ప్రతినిధులు ప్రదర్శనలు, కవాతులు నిర్వహించారు. కాగా అయోధ్యలోని రామ జన్మభూమిలో 1992 డిసెంబర్ ఆరో తేదీన కరసేవ (శ్రమదానం) చేయనున్నట్లు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ వంటి సంస్థలు ప్రకటించాయి. అయోధ్యకు తరలి రావాలని కరసేవకులకు పిలుపునిచ్చాయి. ఆ మేరకు డిసెంబర్ ఐదో తేదీ నాటికే లక్ష మందికి పైగా అక్కడ గుమి గూడారు. ఆరో తేదీ ఉదయానికి వారి సంఖ్య 1.50 లక్షలకు పెరిగింది. సాయుధ బలగాలు మోహరించినా జన సమూహాన్ని అదుపు చేయడం సాధ్యం కాలేదు. దాంతో పరిస్థితి అదుపు తప్పింది. ర్యాలీ హింసాత్మకంగా మారింది. కరసేవకులు బాబ్రీ మసీదును లక్ష్యంగా చేసుకుని దాన్ని కూల్చివేశారు.
Also Read : Up Elections, Priyanka Gandhi, Women Card – యూపీలో ప్రియాంక మహిళా మంత్రం పనిచేస్తుందా?
మత ఘర్షణలు, విధ్వంసం
మసీదు కూల్చివేతతో దేశంలో మత ఘర్షణలు చెలరేగాయి. అంతవరకు స్నేహాభావంతో మెలిగిన హిందూ ముస్లిములు పరస్పర దాడులు చేసుకున్నారు. అల్లర్లు, ఆస్తుల విధ్వంసం విచ్చలవిడిగా సాగాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు నాశనం అయ్యాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి.
ఏళ్ల తరబడి కొనసాగిన విచారణలు
కూల్చివేతకు సంబంధించి సుమారు 60 మందిపై కేసులు నమోదయ్యాయి. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, వీహెచ్ పీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్, భజరంగ్ దళ్ నేత వినయ్ కతియార్, బీజేపీ నేతలు మురళీమనోహర్ జోషి, ఉమాభారతి, గిరిరాజ్ కిషోర్, సాద్వి రీతంబర తదితర ప్రముఖులు నిందితులుగా ఉన్నారు.
కూల్చివేతకు గురైన మసీదును పునర్నిమిస్తామని అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు హామీ ఇచ్చారు. అలాగే డిసెంబర్ 6 నాటి ఘటనలపై విచారణకు ఎం.ఎస్.లిబర్హాన్ కమిషన్ ను నియమించారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించారు. మరోవైపు బాబ్రీ మసీదు స్థలం ఎవరిదన్న వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై విచారణ ప్రారంభం అయ్యింది. 1993లో వివాదాస్పద స్థలంలో 67 ఎకరాల భూమిని రామ్ లాలా విగ్రహాల పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిన లిబర్హాన్ కమిషన్ కాలపరిమితిని 48 సార్లు పొడిగించారు. చివరికి 17 ఏళ్ల తర్వాత ఆ కమిటీ నివేదిక సమర్పించింది. అలాగే సుదీర్ఘ విచారణ అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకటించింది. అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం వివాదాస్పద స్థలం రామ జన్మభూమి ట్రస్టుకు చెందుతుందని తీర్పు చెప్పింది. కూల్చివేసిన మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని బాబ్రీ మసీదు కమిటీకి ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు వివాదం సమసిపోయినా.. 1992 డిసెంబర్ 6 భారతీయ సమాజంపై చేసిన గాయం మచ్చ మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ రోజును దేశంలో పలు సంఘాలు బ్లాక్ డేగా పాటిస్తున్నాయి.
Also Read : Farmers Agitation – మోడీని వీడని రైతుల సెగ..!