iDreamPost
android-app
ios-app

3 రాజ‌ధానులు.. 323 రోజులు..!

3 రాజ‌ధానులు.. 323 రోజులు..!

31-07-2020 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర చ‌రిత్ర‌లో చారిత్ర‌క అంశానికి బీజం ప‌డిన రోజు. అన్ని వైపులా రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగ‌మ‌మైన రోజు. అదే మూడు రాజ‌ధానుల అంశం. అస‌లు ఈ మూడు రాజ‌ధానుల ఆలోచ‌న నుంచి… కేబినెట్ తీర్మానం.. అసెంబ్లీ ఆమోదం.. మండ‌లిలో గంద‌ర‌గోళం.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం వ‌ర‌కూ ఎన్నో కీల‌క మ‌లుపులు. మ‌రెన్నో ట్విస్టులు. అటు రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను, ఇటు ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఉత్కంఠ‌కు లోను చేశాయి. చివ‌ర‌కు ఏపీ రాజధాని వికేంద్రీకరణకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేయ‌డంతో ఏపీలో చారిత్ర‌క నిర్ణ‌యం జ‌రిగిపోయింది. శాస‌న‌ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పాల‌నా రాజధానిగా విశాఖ కొనసాగనున్నాయి. ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల ఆలోచ‌న నుంచి అమోదం వ‌ర‌కూ ఏం జ‌రిగిందో ఒకసారి ప‌రిశీలిస్తే…

ఆ పొర‌పాటు మ‌ళ్లీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా హైద‌రాబాద్ అత్యంత ఎక్క‌వ కాలం కొన‌సాగింది. నాడు 23 జిల్లాలు ఉన్న‌ప్ప‌టికీ అత్య‌ధికంగా అభివృద్ధి మొత్తం హైద‌రాబాద్ లోనే కేంద్రీకృత‌మైంది. ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఇక్క‌డికే రావాల్సి వ‌చ్చేది. ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా అంద‌రి దృష్టీ కేవ‌లం రాజ‌ధానిపైనే ఎక్కువ‌గా ఉండేది. అయిన‌ప్ప‌టికీ అది మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని కాబ‌ట్టి, రాష్ట్రంలో భాగ‌మే కాబ‌ట్టి హైద‌రాబాద్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం సంబ‌ర‌ప‌డిపోయేది. క‌లిసి ఉన్నంత కాలం ఆ ఆనందం అలానే ఉంది.

అనూహ్యంగా తెలంగాణ ఉద్య‌మం ఉధృతమై.. రాష్ట్రం విడిపోవాల్సి రావ‌డం.. రాజ‌ధాని హైద‌రాబాద్ తెలంగాణకు ఉండిపోవ‌డంతో అక‌స్మాత్తుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని లేని అనాథ అయింది. అభివృద్ధి ఫ‌లాలు కూడా తెలంగాణ‌కే ద‌క్క‌క‌డంతో అప్పుడు తెలిసింది అభివృద్ధి కేంద్రీకృత‌మై పోతే క‌లిగే న‌ష్టాలు. దీంతో విభ‌జ‌న అనంత‌రం రాజ‌ధాని ఏర్పాటుకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే హైద‌రాబాద్ విష‌యంలో జ‌రిగిన పొర‌పాటు పున‌రావృతం కాకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని తీవ్ర చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసిన చంద్ర‌బాబు నాయుడు దానిపై దృష్టి పెట్ట‌లేదు. ఫ‌లితంగా మెజార్టీ ప్ర‌జ‌ల ఆశ‌లు అవిర‌య్యాయి. రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేదిశ‌గా మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేశారు.

సెప్టెంబ‌ర్ లో బీజం…

మూడు రాజ‌ధానులకు సంబంధించి 2019, సెప్టెంబర్ 13న మొట్ట‌మొద‌టి సారిగా క‌మిటీ ఏర్పాటైంది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు ఈ కమిటీకి ప్రాతినిధ్యం వ‌హించారు. ఈ క‌మిటీ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల అభిప్రాయాల‌ను సేక‌రించింది. ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసింది. 2019, డిసెంబర్ 20న పరిపాలనా వికేంద్రీకరణకు ఆ కమిటీ ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింది. అంత‌క‌న్నా ముందే 2019 డిసెంబ‌ర్ 17న ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఆ ప్ర‌క‌ట‌న‌తో తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా మోడల్ అవలంబించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

హైపవర్ కమిటీ ఏర్పాటు

జీఎన్ రావు క‌మిటీ పరిపాలనా వికేంద్రీకరణకు సిఫార్సు చేసిన‌ప్ప‌టికీ ఆ నివేదిక‌ల‌పై అధ్య‌య‌నానికి, వాస్త‌వ ప‌రిశీల‌న‌కు 2019, డిసెంబర్ 29న హై ప‌వ‌ర్ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పలువురు మంత్రులు, ముఖ్య అధికారులకు స్థానం క‌ల్పించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నానితో పాటు ముఖ్యమంత్రి ప్రదాన సలహాదారు, రాష్ట్ర డీజీపీ, చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటీ, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులు.. అధికార‌, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రితోనూ క‌మిటీ ఏర్పాటు చేశారు. అలాగే 2020, జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు కూడా మూడు రాజ‌ధానుల‌కు సంబందించి నివేదిక ఇచ్చింది. జీఎస్‌రావు క‌మిటీ, బోస్ట‌న్ క‌న్స‌ల్ట‌న్సీ నివేదిక‌ల‌పై 2020, జనవరి 17న హైపవర్ కమిటీ చ‌ర్చించి ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింది. అనంత‌రం 2020, జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై కేబినెట్ లో చ‌ర్చ జ‌రిగింది. మూడు రాజ‌ధానుల బిల్లును అదే రోజున అసెంబ్లీ ఆమోదించింది. విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందించారు.

అక్క‌డ నుంచి ఇక్క‌డ‌కు…

అసెంబ్లీలో ఆమోదం పొందిన ఆ బిల్లు 2020, జనవరి 22న శాసనమండలి ముందుకు వ‌చ్చింది. ఆది నుంచీ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణకు అడ్డు త‌గులుతున్న టీడీపీ అనుకున్న‌ట్లుగానే మండ‌లిలో దీనిపై ర‌చ్చ చేసింది. మండలిలో వైసీపీకి బలం తక్కువగా ఉండడంతో ఆమోదం దక్కలేదు. దీంతో 2020, జూన్ 16న రెండోసారి వికేంద్రీక్రణ బిల్లుకు అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి మండ‌లికి పంపారు. అక్కడ చర్చించకుండానే…సభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో 2020, జూలై 18వ తేదీన ఆంధ్ర‌ప‌దేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గవర్నర్ వద్దకు ఆ బిల్లుల‌ను పంపారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ దాన్ని ఆమోదిస్తారా.. లేదా..? అని తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. టీడీపీ అధినే చంద్ర‌బాబునాయుడు, నాటి బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా, అమ‌రావ‌తి సాధ‌న స‌మితి నుంచి మ‌రొక‌రు.. ఇలా బిల్లు ఆమోదించ‌వ‌ద్దంటూ గ‌వ‌ర్న‌ర్ కు లేఖ‌లు సంధించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి 31-07-2020న ఆమోద ముద్ర వేశారు. మూడు రాజ‌ధానుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో జీఎస్‌రావు క‌మిటీ ఏర్పాటు నుంచి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం వ‌ర‌కు 323 రోజుల పాటు ఈ బిల్లు అంశంలో ఎన్నో మ‌లుపులు చోటుచేసుకున్నాయి.