iDreamPost
iDreamPost
పరిశ్రమలో కొన్ని విజయాలు ఎవరూ ఊహించలేరు. ఫలానా సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో చెప్పడం అయ్యే పనేనా. కొన్ని అద్భుతాలు అంతే. జరగకముందు చెప్పవు. జరిగాక అలా చూస్తూ ఉండిపోవడమే. దానికో గొప్ప ఉదాహరణ పెళ్లి సందడి. 1996వ సంవత్సరం. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి గ్రాఫ్ కొంత డౌన్ లో ఉంది. 1993 మేజర్ చంద్రకాంత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు, ముగ్గురు మొనగాళ్లు, రాజసింహం, సాహసవీరుడు సాగర కన్యలు ఆయన స్థాయి ఫలితాలు అందుకోలేదు. ఘరానా బుల్లోడు ఒక్కటే కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. స్టార్లతో ఇన్నేసి మిశ్రమ ఫలితాలు అందుకోవడం ఆలోచనలో పడేసింది. జ్యోతి తరహాలో చిన్న బడ్జెట్ లో మ్యూజికల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ లేకుండా ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీని చిన్న తారలతో తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో ఉదృతంగా నడుస్తున్న హం ఆప్కే హై కౌన్ ట్రెండ్ ని స్ఫూర్తిగా తీసుకుని రచయిత సత్యానంద్ ఓ చక్కని కథను సిద్ధం చేశారు. అదే పెళ్ళిసందడి. హీరోగా అప్పటికింకా సెటిల్ కాని శ్రీకాంత్ ని కథానాయకుడిగా ఎంచుకున్నారు. బాలీవుడ్ భామ దీప్తి భట్నాగర్, రవళిలు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. కీరవాణి 9 ఆణిముత్యాల్లాంటి పాటలను సిద్ధం చేశారు. కలలో కనిపించే స్వప్నసుందరినే పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకున్న హీరో ఆ అమ్మాయి దొరక్క అనుకోకుండా ఆమె చెల్లితోనే పెళ్లికి ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఈలోగా తన డ్రీం గర్ల్ నిజంగానే ఉందని తెలుసుకుని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల మధ్య జరిగే సరదా వినోదాల విందే పెళ్లి సందడి. ఆద్యంతం ఆహ్లదకరమైన హాస్యంతో చక్కిలిగింతలు పెడుతూ సాగే చిత్రీకరించారు.
1996 జనవరి 12న పెద్దగా అంచనాలు లేకుండా తక్కువ స్క్రీన్లలో విడుదలైన పెళ్ళిసందడి మెల్లగా సునామి వేగం అందుకుంది. హౌస్ ఫుల్ అవుతాయా అనే అనుమానాలతో మొదలుపెట్టి బ్లాక్ లో కూడా టికెట్లు దొరకని రేంజ్ కు వెళ్లిపోయింది. ఒకటి రెండు వారాలు కాదు ఏకంగా వంద రోజుల దాకా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు తీయలేదు. ఆడియో క్యాసెట్ హక్కులు కొన్న లహరి సంస్థకు లాభాల వర్షం లక్షల నుంచి కోట్లకు చేరుకుంది. అలా ఈ సంచలనం కొనసాగుతూ ఏకంగా 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడే దాకా చేరుకుని అందరూ షాక్ తో మాటలు లేకుండా ఉండిపోయేలా చేసింది. ఇండస్ట్రీలో ఉన్న హాస్యనటులందరూ ఇందులో భాగం పంచుకున్నారు. 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరి మతులు పోగొట్టింది. మళ్ళీ సమరసింహారెడ్డి బ్రేక్ చేసేదాకా ఆ రికార్డులు అలాగే భద్రంగా ఉన్నాయి. పెళ్లి సందడి ఎందరికో దారి చూపించింది. ముఖ్యంగా శ్రీకాంత్ ని స్టార్ చేసి తిరుగులేని కెరీర్ ని ప్రసాదించింది.