iDreamPost
android-app
ios-app

వెండితెరపై విరిసిన స్నేహ ‘వసంతం’ – Nostalgia

  • Published Jul 11, 2020 | 9:30 AM Updated Updated Jul 11, 2020 | 9:30 AM
వెండితెరపై విరిసిన స్నేహ ‘వసంతం’ – Nostalgia

కమర్షియల్ సినిమాకు ఫ్యామిలీ మూవీకి మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండు వర్గాలను ఒకేసారి మెప్పించడం అంత సులభం కాదు. అందులోనూ ఫలానా జానర్ లో హిట్టు కొట్టాలంటే దేనికీ ప్రత్యేకమైన ఫార్ములా అంటూ ఉండదు. ఎలాంటి కథకైనా భావోద్వేగాలను పండించడం చాలా ముఖ్యం. అందులో విజయం సాధించామా క్లాసు మాసు తేడా లేకుండా పట్టం కడతారు. వసూళ్ళ వర్షం కురిపిస్తారు. ఆ కోవలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం 2003లో విడుదలైన వసంతం. తమిళ దర్శకుడు విక్రమన్ డైరెక్షన్లో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి, ఆకాష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా ఘన విజయం అందుకుంది. అందుకే 17 ఏళ్ళు గడిచినా అబిమానులకే కాదు ప్రేక్షకులకూ ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.

వసంతం ప్రేమ కథ కాదు. స్వచ్చమైన స్నేహానికి ప్రతీకగా నిలిచిన ఓ అమ్మాయి అబ్బాయి ప్రయాణం. అశోక్(వెంకటేష్), జూలీ(కళ్యాణి) చిన్ననాటి స్నేహితులు. ఆమె తండ్రి పీటర్(చంద్రమోహన్)తోనూ ఎంతో చనువుగా ఉండే అశోక్ ని చూసి ఈర్ష్య పడేవాళ్ళే ఎక్కువ. ఎంత క్లోజ్ గా ఉన్నా అశోక్, జూలీల మధ్య ప్రేమ అనే ఫీలింగ్ కలగదు. ఓరోజు హటాత్తుగా పీటర్ చనిపోవడంతో జూలీని ఇంటికి తీసుకొస్తాడు అశోక్. మరోవైపు నందిని(ఆర్తి అగర్వాల్)ని తోలిచూపులోనే మనసిచ్చి పెళ్లి చేసుకుంటాడు అశోక్. జూలీకి కొత్త జీవితాన్ని ఇవ్వాలంటే పెళ్లి చేయాలనీ గుర్తించిన అశోక్ ఆమేరకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో తాను ప్రాణంగా ప్రేమించే క్రికెట్ ఆటను పణంగా పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఏం జరిగిందనేదే మీలో అందరూ చూసేసిన బాలన్స్ కథ

వసంతం గొప్పదనం కథలో లేదు. ట్రీట్మెంట్ లో ఉంది. ఎమోషన్స్ ని అద్భుతంగా పండిస్తాడని పేరున్న విక్రమన్ ఇందులో తీసుకున్న ఆడమగ స్నేహం కాన్సెప్ట్ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యింది. అశోక్, జూలీ మధ్య బాండింగ్ చాలా నీట్ గా చూపిస్తూ వీళ్ళు ఎందుకు ప్రేమించుకోరని చూసేవాళ్ళకు అనుమానం రానంత చక్కగా వాళ్ళ బంధాన్ని డిజైన్ చేశారు విక్రమన్. అంతకు ముందే ఇదే పోలికలతో ఉన్న ఇద్దరు మిత్రులను రాఘవేంద్రరావు గారు చిరంజీవితో చూపిస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. కారణం అందులో రిజిస్టర్ అయ్యే స్థాయిలో ఎలాంటి డ్రామా లేకపోవడమే. మెయిన్ హీరొయిన్ ఆర్తి అగర్వాలే అయినప్పటికీ అందరి దృష్టి కళ్యాణి పాత్ర మీదే ఉంటుంది.

తన మీద కలిగిన సానుభూతికి అశోక్ తో ఆమెకున్న స్వచ్చమైన స్నేహానికి మురిసిపోయిన ఆడియన్స్ ఇందులో గ్లామర్ అంశాలు లేవనే సంగతే మరిచిపోయారు. అంత గొప్పగా పండింది. తనికెళ్ళ భరణి, హేమ, కొండవలస, ఆహుతి ప్రసాద్, సూర్య, గుండు, ఎల్బి శ్రీరామ్, ధర్మవరపు, సునీల్ ఇలా చక్కని తారాగణం వసంతంకు తోరణంలా అలకరించుకుంది. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం మరో దన్నుగా నిలిచిన వసంతంలో ముఖ్యంగా గాలి చిరుగాలి పాట ఎందరికో స్ఫూర్తి గీతంగా నిలిచింది. వెంకీ కళ్యాణిల నటన వసంతంని నిలబెట్టగా ఏకంగా 71 కేంద్రాల్లో వంద రోజుల మార్క్ అవలీలగా చేరుకుంది. మాస్ మసాలాలు లేని ఎంటర్ టైనర్ కి ఇది చాలా గొప్ప రికార్డు. అందుకే వెంకటేష్ చిత్రాల్లో వసంతం స్థానం చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది.