21 ఏళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రేమకథతో పరిచయమైన అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ మొదటి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా నటుడిగా తన స్థానాన్ని స్థిరపరుచుకునే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. తర్వాత చేసిన 4 సినిమాలు యువకుడు, పెళ్లి సంబంధం, రామ్మా చిలకమ్మా, స్నేహమంటే ఇదేరాలు సైతం అదే బాట పట్టి ఫ్లాపులు ఇచ్చినప్పటికీ ఎట్టకేలకు అయిదో చిత్రం ‘సత్యం’ కోరుకున్న ఫలితాన్ని ఇచ్చింది. మ్యుజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ సుమంత్ కో మార్కెట్ ని ఇచ్చింది. చక్రి సంగీతం దీని విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే స్థిరపడాలంటే మాస్ ని టార్గెట్ చేయడం ఒకటే మార్గమని గుర్తించిన సుమంత్ ఆ టైంలో చేసిన సినిమా గౌరీ.
2003లో తమిళ్ లో విజయ్ హీరోగా వచ్చిన ‘తిరుమలై’ అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచి అతని కెరీర్లో బలమైన మలుపుగా నిలిచింది. దాన్ని సుమంత్ తో ఇక్కడ రీమేక్ చేస్తే మంచి ఫలితం దక్కుతుందన్న అంచనాతో నిర్మాత స్రవంతి రవికిశోర్ హక్కులను కొనేసి బివి రమణ దర్శకత్వంలో ఇక్కడ పునఃనిర్మించారు. ఛార్మీ హీరోయిన్ గా కోటి సంగీతంలో మంచి బడ్జెట్ లోనే ఇది తెరకెక్కింది. అనాథ అయిన బైక్ మెకానిక్ హీరో గౌరీ(సుమంత్)మెకానిక్ గ్యారేజ్ నడుపుకుంటూ బాగా డబ్బున్న శ్వేతా(ఛార్మీ)ని ప్రేమిస్తాడు. అయితే ఇది ఇష్టం లేని ఆమె తండ్రి(వైజాగ్ ప్రసాద్)వీళ్ళను విడగొట్టేందుకు మాఫియా డాన్ సర్కార్(అతుల్ కులకర్ణి)సహాయం కోరతాడు. ఈ కథకు మరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ(నరేష్-కౌసల్య)లకు లింక్ ఉంటుంది.
ఇంత పెద్ద వలయాన్ని గౌరీ ఎలా చేధించి తన ప్రేమను గెలిపించుకున్నాడనేదే బ్యాలన్స్ కథ. వినడానికి రొటీన్ స్టోరీలాగే అనిపించినా ట్రీట్మెంట్ విషయంలో ఒరిజినల్ వెర్షన్ లో తీసుకున్న జాగ్రత్తలే ఇందులోనూ ఫాలో కావడంతో ఇక్కడా గౌరీ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సుమంత్ మాస్ మ్యానరిజంస్, అతుల్ కులకర్ణి ఫ్రెష్ విలనీ దీనికి బలంగా నిలిచాయి. కమర్షియల్ గా రవికిశోర్ కి గౌరీ మంచి లాభాలు ఇచ్చింది. దీని స్ఫూర్తితోనే సుమంత్ ఆ తర్వాత ధన, మహానంది, చిన్నోడు, పౌరుడు, రాజ్ లాంటి మాస్ సినిమాలు చేశాడు ఏదీ కనీసం యావరేజ్ గా కూడా నిలవలేదు. గోదావరి, గోల్కొండ హై స్కూల్ లాంటి సెన్సిబుల్ మూవీస్ మాత్రమే పేరు తీసుకొచ్చాయి. ఎంత నటన ఉన్నా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల సుమంత్ భారీ గ్యాప్ తీసుకుని ఆ మధ్యే మళ్ళీ రావాతో డీసెంట్ రీ ఎంట్రీ ఇచ్చారు. దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి మరి