iDreamPost
android-app
ios-app

Congress Party Journey – కాంగ్రెస్ 136 ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది..?

  • Published Dec 28, 2021 | 10:46 AM Updated Updated Dec 28, 2021 | 10:46 AM
Congress Party Journey – కాంగ్రెస్ 136 ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది..?

ఆంగ్లేయుడు స్థాపించిన పార్టీ.. అదే ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. స్వాతంత్ర్య భారతాన్ని ఎక్కువ కాలం పాలించిన ఘనత.. ఆరుగురు ప్రధానులను అందించిన ఖ్యాతి పొందిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. 1885లో సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ 28న పురుడు పోసుకున్న ఆ పార్టీ.. నేడు పతనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో ఒడిదుడుకులను విజయవంతంగా అధిగమించగలిగిన కాంగ్రెస్ నాయకత్వ సమస్యతో మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితిలో చిక్కుకుంది.

బ్రిటీషర్ల స్వలాభం కోసమే ఏర్పాటు

దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన కాంగ్రెసును వాస్తవానికి బ్రిటీషర్లు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం కూడా దేశంలో పలు ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ఆలోచనలో పడిన బ్రిటిష్ పాలకులు.. భారతీయ విద్యావంతుల్లో పట్టు పెంచుకుంటే తప్ప పరిపాలన సాగించలేమన్న భావనకు వచ్చారు. ఆ బాధ్యతను ఆంగ్లేయ అధికారి అల్లిన్ ఓక్టివాన్ హ్యూమ్స్ (ఏవో హ్యూమ్స్)కు అప్పగించారు. ఆ మేరకు ఇంగ్లాండ్ నుంచి భారత్ కు వచ్చిన హ్యూమ్స్ ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు. దానికి తొలి అధ్యక్షుడిగా కలకత్తా హైకోర్టు బారిస్టర్ ఉమేష్ చంద్ర బెనర్జీని నియమించారు. పార్టీ మొదటి సమావేశాలను బొంబాయిలో నిర్వహించారు. హ్యూమ్స్ పార్టీ స్థాపించినా తన జీవితకాలంలో వ్యవస్థాపకుడన్న గుర్తింపు పొందలేకపోయారు. ఆయన మరణానంతరం 1912లో అతన్ని వ్యవస్థాపకుడిగా పార్టీ గుర్తించింది.

క్రమంగా స్వాతంత్ర్య ఉద్యమం వైపు

కాలక్రమంలో కాంగ్రెస్ బ్రిటీష్ ముద్ర నుంచి బయటపడింది. 1905లో బెంగాల్ విభజన సమయంలో కాంగ్రెసుకు మంచి గుర్తింపు లభించింది. కాంగ్రెస్ వాదులు విభజనను బహిరంగంగా వ్యతిరేకించి.. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం చేపట్టారు. అదే సమయంలో పార్టీ అతివాదులు, మితవాదులుగా విడిపోయింది. 1915లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చారు. కొన్నాళ్లకే కాంగ్రెసులో చేరడంతో పార్టీపై ఆయన ముద్ర ప్రారంభం అయ్యింది. 1919లో గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంతో స్వరాజ్య సమరం పతాక స్థాయికి చేరి.. స్వేచ్ఛ భారతానికి పునాదులు వేసింది. 1947 ఆగష్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.

Also Read : బీజేపీ ఎంపీ చుర‌క‌లు : ప‌గ‌లు బ‌హిరంగ స‌భ‌లు.. రాత్రుళ్లు క‌ర్ఫ్యూలా..?

ఆరుగురు ప్రధానులు

స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఎక్కువకాలం కాంగ్రెసే పరిపాలించింది. దేశానికి ఆరుగురు ప్రధానమంత్రులను అందించింది. జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ నేతృత్వాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరోవైపు స్వాతంత్య్రం అనంతరం 74 ఏళ్లలో 38 ఏళ్లు గాంధీ-నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది.

చేదు జ్ఞాపకాలు

ఉజ్వల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్థానంలో పలు చేదు ఘటనలు కూడా ఉన్నాయి. పార్టీలో చీలిక వాటిలో ప్రధానమైనది. కామరాజ్ నేతృత్వంలో కొంతమంది నేతలు 1969లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని వ్యతిరేకించారు. ఆ ఏడాది నవంబర్ 12న భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఇందిరను బహిష్కరించి భారత జాతీయ కాంగ్రెస్ (ఓ)గా ఏర్పడ్డారు. తన మద్దతుదారులతో కలిసి ఇందిర కాంగ్రెస్(ఆర్) పార్టీ ఏర్పాటు చేశారు. అదే కాలక్రమంలో ఇందిరా కాంగ్రెసుగా పేరుపొందింది. 1971 పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ విజయం సాధించడంతో తర్వాత కాలంలో అదే భారత జాతీయ కాంగ్రెసుగా మారింది.

కాంగ్రెస్ చరిత్రలో మరో మాయని మచ్చ ఎమర్జెన్సీ విధింపు. 1975లో తన అధికారానికి తిరుగులేకుండా చేసుకునేందుకు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నిర్బంధ కు.ని.చికిత్సలు, పత్రిక స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రతిపక్షాలు, ప్రజలపై నిర్బంధాలు కాంగ్రెసును, ఇందిరను పాతాళానికి నెట్టివేశాయి. దాని ఫలితంగానే 1977లో జనతా పార్టీ రూపంలో దేశంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఇందిర, రాజీవ్ మరణానంతరం కాంగ్రెస్ తిరోగమించడం మొదలైంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా కోల్పోయిన కాంగ్రెస్ మిత్రపక్షాలపై ఆధారపడటం మొదలుపెట్టింది. 2014 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. కేంద్రంలో అధికారం కోల్పోవడంతో పాటు పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. నాయకులు, కార్యకర్తల వలసలు, నాయకత్వంపై అసంతృప్తి వంటి అనేక సమస్యల మధ్య కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది.

Also Read : బీజేపీలో కాంగ్రెస్‌ విలీనం ఖాయమ‌ట‌..!