iDreamPost
iDreamPost
గోదావరి తీరంలో గీసిన అందమైన తైలవర్ణ చిత్రంలా కనిపించే ఆ ప్రాంతాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు! రకరకాల పూల, పండ్ల మొక్కలతో పరుచుకున్న పచ్చదనం ప్రకృతి ప్రేమికులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. అందమైన పూలమొక్కలు హొయలొలుకుతూ క్రమపద్ధతిలో కొలువుదీరిన ఆ దృశ్యాలను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. కేవలం హృదయాన్ని తాకే సోయగాలే కాక పర్యావరణ పరిరక్షణ, వందల కోట్ల రూపాయల వ్యాపారం, వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయవి.
విస్తరించిన అందం
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో సుమారు 800 నర్సరీలు దాదాపు 10,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. 13 గ్రామాల్లో ఈ తోటలు మనకు కనిపిస్తాయి. రకరకాల పూల, పండ్ల మొక్కలు ఇక్కడ సాగు చేస్తారు. ఈ పూలసాగు రాజమహేంద్రవరం సిటీ, మండపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో కూడా విస్తరించింది. ఇవి కూడా కలిపితే సుమారు 15 ఎకరాల్లో పూలసాగు జరుగుతున్నట్టు లెక్క. దాదాపు 50,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నర్సరీల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అర ఎకరం నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో గత 12 ఏళ్లుగా నర్సరీలకు ఉచిత విద్యుత్ అందుతోంది. దీంతో ఈ రంగం అభివృద్ధి బాటలో పయనిస్తోంది.
విదేశాలకు ఎగుమతులు..
కోట్లాది రూపాయల వ్యాపారంతో విస్తరించి, ఎందరికో ఉపాధి కల్పిస్తున్న నర్సరీ రైతులు ఎప్పటి నుంచో ఎగుమతులకు సరైన ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆల్ ఇండియా నర్సరీ మెన్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేకున్నా దుబాయ్, దోహా, కతార్, కువైట్, అబుదాబి దేశాలకు పెద్ద నర్సీరీలు ఉన్న ఇద్దరు ముగ్గురు రైతులు తమ మొక్కలను ఎగుమతి చేస్తున్నారు. ఫ్లోరీ కల్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ వేమగిరిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధురపూడిలోని విమానాశ్రయం నుంచి కార్గో విమానాల ద్వారా దేశ,విదేశాలకు ఇక్కడి పూలు పెద్ద మొత్తంలో ఎగుమతి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Also Read : Artos Drink – బ్రిటిష్ సైనికులు పాపులర్ చేసిన ఈస్ట్ గోదావరి కూల్‌డ్రింక్ ఆర్టోస్
పర్యాటకంగానూ అభివృద్ధి
మొక్కల పెంపకం, ఎగుమతులకే కాక కడియపు లంక నర్సరీలు పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందాయి. దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు, విదేశీయులు ఇక్కడి నర్సరీల సందర్శనకు వస్తుంటారు. ఇక సినిమా షూటింగ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క తెలుగు సినిమాలనే కాక దక్షిణ భారత సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి.
125 ఏళ్ల క్రితం ఆరంభం
125 ఏళ్ల క్రితం రావు చిన్నారావు ఈ ప్రాంతంలో పూలసాగును ప్రారంభించారని అంటారు. 100 ఏళ్ల క్రితం ఆకుల సుబ్బారావు నర్సరీల విస్తృతికి బాగా కృషి చేశారు. ఇటీవలి కాలంలో పల్ల వెంకన్న నర్సరీ బాగా ప్రాచుర్యం పొందింది. మొక్కలకు అంటు కట్టడం, కొత్త రకాలను వృద్ధి చేయడంతో పేరు వచ్చింది. ఈ రంగంలో లాభాలు బాగా రావడంతో క్రమంగా చాలామంది రైతులు ఆకర్షితులయ్యారు. దీంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. నర్సరీల్లో పనిచేసే సిబ్బంది మొక్కల సాగుకు సంబంధించి కస్టమర్లు అడిగే సందేహాలను చాలా ఓపికగా సమాధానాలు ఇస్తుంటారు. కావలసినన్ని రకాల మొక్కలు సిద్ధంగా ఉండడం, రవాణాకు వీలుగా జాతీయ రహదారికి చేర్చి ఉండడంతో నర్సరీ వ్యాపారం వృద్ధి చెందుతోంది.
భారీ వ్యాపారం.. ఎందరికో ఉపాధి..
చిన్న నర్సరీలైతే ఏటా రూ.6లక్షల వరకు వ్యాపారం చేస్తాయి. మీడియం రేంజ్ నర్సరీల్లో ఏటా రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వ్యాపారం జరుగుతుంది. మొత్తం 800 నర్సరీ నుంచి సంవత్సరానికి రూ.450కోట్ల నుంచి రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ముంబై, గోవా, గుజరాత్, కోల్‌కతాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్లి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నర్సరీల్లో పనిచేయడానికి చాలా ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలు తమ కుటుంబాలతో ఇక్కడికి వలస వస్తారు. ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ వలసలు ఉంటాయి. దాదాపు కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉపాధి దొరకుతుందంటే అతిశయోక్తి కాదు. మొక్కలు నాటడం, మడులు తయారు చేయడం, నీరు పెట్టడం, అంటుకట్టడం, పూలు కోయడం, మొక్కలను, పూలను రవాణాకు అనుగుణంగా ప్యాక్ చేయడం, పూలను మాలలలుగా కట్టడం ఇలా చాలా పనులు ఉంటాయి. వివిధ వయసుల ఆడ, మగ కూలీలు ఈ పనులు ఇక్కడ చేస్తుంటారు. ఇప్పటికి ఎక్కువగా రోడ్డు మార్గంలోనే ఎగుమతులు సాగుతున్నాయి. రైలు, విమాన మార్గాలను ఎగుమతికి ఉపయోగిస్తే ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Also Read : East Godavari Vimal Drink – విమల్ చల్లదనానికి 38 ఏళ్లు