iDreamPost

లక్షన్నర మందికిపైగా అదనంగా అమ్మఒడి..!

లక్షన్నర మందికిపైగా అదనంగా అమ్మఒడి..!

గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది ఒక లక్షా 48 వేల 865 మందికి అమ్మ ఒడి పథకాన్ని అదనంగా ఈ యేడాది అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత యేడాది 43 లక్షల మంది తల్లుల అక్కౌంట్లలో ఈ పథకాన్ని అమలు చేయగా ఈ యేడాది 44,48,865 మందికి ఇస్తున్నారు. ఇందు కోసం అర్హత నిబంధనల్లో పలు మార్పులు చేసింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10వేలు, పట్టణ ప్రాంతాల్లో 12వేలు ఆదాయానికి లోపు ఉన్నవారికి పథకం వర్తించేలా ఏర్పాటు చేసారు. అలాగే మూడు ఎకరాల మాగాణి, పదెకరాల మెట్ట భూమి ఉన్న వాళ్ళకు, 300 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారిని కూడా పథకం వర్తింప జేస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా అమ్మ ఒడి ఈ యేడాది అందజేస్తున్నారు. అంతే కాకుండా టాక్సీ, ట్రాక్టరు ఆటోలు ఉన్న వారికి కూడా పథకాన్ని ఇస్తున్నారు. దీంతో అదనంగా లక్షా నలభైవేల మందికిపైగా లబ్దిదారులు ఈ యేడాది పథకానికి అర్హత పొందగలిగారు.

గతానికి.. ఇప్పటికీ ఇదీ తేడా..

విద్యపై ఇప్పుడు చేస్తున్న ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడిగా సీయం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగునకు భారీగానే ఖర్చు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు మూడున్నరవేల కోట్లు మాత్రమే కేటాయింపులు చేసారు. అయితే దీనికి దాదాపు ఎనిమిది రెట్లు అంటే 24వేల కోట్లకుపైగా నిధులను జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో అమ్మ ఒడి పథకంతో పాటు, నాడు–నేడు, గోరు ముద్దు, వనతి దీవెన, విద్యా కానుక, విద్యాదీవెన, సంపూర్ణ పోషణ తదితర పథకాలు ఉన్నాయి. ఆయా పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది వరకు లబ్దిపొందుతున్నారు.

సీయం వైఎస్‌ జగన్‌ ఎంతో ముందుచూపుతో అమలు చేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలు మెరుగుపడుతున్న సంకేతాలు ఇప్పటికే కన్పిస్తున్నాయి. స్కూల్స్‌ రూపురేఖలు మారిపోవడంతో పాటు, డ్రాపౌట్స్‌ గణనీయంగా తగ్గడం, ప్రైవేటు స్కూల్స్‌ నుంచి ప్రభుత్వ స్కూల్స్‌కు చేరికలు పెరగడం వంటివి స్పష్టంగా కన్పిస్తున్నాయి. విద్యార్ధులు లేరని స్కూల్స్‌ మూసివేసే పరిస్థితులను గత ప్రభుత్వ హాయాంలో రాష్ట్ర ప్రజలకు చూసారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ స్కూల్స్‌లో సీటు కోసం రికమెండేషన్స్‌ చేయించాల్సిన పరిస్థితి నెలకొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు విద్యారంగ ప్రముఖులు బలంగా నమ్ముతున్నారంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలేనని ఒప్పుకోక తప్పదు.

ఇదిలా ఉండగా ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం ఉదయం 11.30కి అమ్మ ఒడి పథకాన్ని సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారుల బ్యాంకు అక్కౌంట్‌లకు నేరుగా నగదు జమ అవుతుంది. టాయ్‌లెట్స్‌ మెయింటినెన్స్‌ క్రింద రూ. వెయ్యిరూపాయలను మినహాయించి, మిగిలిన రూ. 14వేలను లబ్దిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేసారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి