iDreamPost

కేంద్రం కరెంట్ కొర్రీలు, రాష్ట్రాలకు కొత్త కష్టాలే

కేంద్రం కరెంట్ కొర్రీలు, రాష్ట్రాలకు కొత్త కష్టాలే

భారతదేశం సమైక్య స్ఫూర్తి రానురాను కొడగొట్టుకుపోతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆదాయాల కోసం కేంద్రం వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను మరింతగా కుదించే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. ఈసారి విద్యుత్ విషయంలో రాష్ట్రాలను పరిమితం చేసేలా కొత్త చట్టం రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ప్రకారం ఇక పవర్ మొత్తం సెంట్రల్ గవర్నర్ మెంట్ చేతుల్లో పెట్టుకునే దిశలో ఉన్నట్టు కనిపిస్తోంది.

తాజాగా విడుదలయిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే ఇక రాష్ట్రాల హక్కులు కూడా కేంద్రానికి దఖలుపరచుకోవడమే తప్ప మరో దారి ఉండదు. దానికి తోడుగా అదనంగా ఆర్థిక భారం రాష్ట్రాలు మోయాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం ముసాయిదాని రాష్ట్రాలకు పంపించింది. అందరి అభిప్రాయాలను జూన్ 5లోగా చెప్పాలంటూ సూచించింది. ఇప్పటికే కొందరు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రజలకు పెద్ద భారం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్న తరుణంలో కేంద్రం వైఖరి చర్చనీయాంశం అవుతోంది.

వైఎస్సార్ హయంలో ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చింది. అప్పటికే రైతులకు కరెంట్ ఛార్జీలు పెంచిన క్రమంలో పెద్ద ఉద్యమం జరగడం, విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన చంద్రబాబుకి ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ హామీని చంద్రబాబు సహా అనేకమంది ఎద్దేవా చేశారు. అమలు సాధ్యం కాదని కూడా సూత్రీకరించారు. అయినా వైఎస్సార్ తను ఇచ్చిన మాటను అమలు పరచి రైతులను ఆదుకునేందుకు చొరవ చూపారు. కానీ ఇప్పుడు కొత్త బిల్లు తెరమీదకు వస్తే రైతులకు కూడా విద్యుత్ బిల్లుల మోత తప్పదు. ప్రతీ కనెక్షన్ కి మీటర్ బిగించి, బిల్లులు వసూలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందిస్తుంటే, ఏపీలో 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఉచితంగా రైతులు అందుకుంటున్నారు. దాని ఫలితాలు కూడా కనిపించాయి. కానీ కేంద్రం తాజా బిల్లు ప్రకారం రైతుల ఉచిత విద్యుత్ కి బ్రేకులు వేసేలా కేంద్రం చర్యలు ఉండడం విశేషం.

ఈ బిల్లులో పేర్కొన్న మరో ప్రమాదకర అంశం వినియోగదారులందరికీ భారం కాబోతోంది. విద్యుత్ కొనుగోలు ధరకే సరఫరా చేసి, దాని ప్రకారం బిల్లు వసూలు చేస్తారు. ప్రస్తుతం గ్యాస్ సబ్సిడీ చెల్లిస్తున్న రీతిలో ఆ తర్వాత కొంత మేరకు సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో వేస్తారని ఈ బిల్లులో చెప్పడం ఆందోళనకర అంశమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల్లో విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించే రాయితీలను ప్రభుత్వాలు నగదు బదిలీ పథకంలో చెల్లించాలనడం శ్రేయస్కరం కాదని అంటున్నారు.

అందుకు తోడుగా ప్రస్తుతం కేంద్రం వివిధ రాష్ట్రాలకు విద్యుత్ కేటాయిస్తుంటే దానిని రాష్ట్ర ప్రభుత్వాలు వారి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు. కానీ ఇకపై కేంద్రమే నేరుగా ఈ ప్రక్రియ చేపడుతుందని బిల్లులో పేర్కొన్నారు. దాంతో రాష్ట్రాల అధికారాలకు కోత పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా కేటాయింపులు లేకుండా పోతుంది. ఇక విద్యుత్ నియంత్రణ మండలి నియామకం కూడా కేంద్రం చేతుల్లోకి పోతుంది. నిర్ణీత కోటాలో సౌర, పవన, జల విద్యుత్ వినియోగించాలనే నిబంధన కూడా ఈ బిల్లులో ఉంది. దాని వల్ల మన లాంటి రాష్ట్రాల్లో జల విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ సోలార్, విండ్ పవర్ కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. తద్వారా అదనపు భారం అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అన్నింటికీ మించి పీపీల వ్యవహారం పూర్తిగా కేంద్రం చేతుల్లోకి మళ్లుతుంది. తద్వారా రాష్ట్రాల అధికారాలకు కోత పడుతుంది.

ఓవైపు వినియోగదారులపై భారం, మరోవైపు రైతులకు ఉచిత విద్యుత్ దూరం కావడం, అన్నింటికీ మించి రాష్ట్రాల హక్కులను పూర్తిగా కాజేసేందుకు తగ్గట్టుగా నిబంధనలు రూపొందించిన ఈ కొత్త విద్యుత్ సవరణ చట్టం ప్రమాదకరమని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా కేంద్రం ముసాయిదాని సిద్ధం చేసిన నేపథ్యంలో విద్యుత్ రంగంలో పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోననే చర్చ మొదలయ్యింది. మోడీ సర్కారు ఇలాంటి విధానాల ద్వారా రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ధోరణి సరికాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి