iDreamPost

మాట చెబితే చాలదు.. విధానం మార్చాలి సీఎం గారు..

మాట చెబితే చాలదు.. విధానం మార్చాలి సీఎం గారు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వశాఖల్లో అవినీతి నిరోధకానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సర్కార్‌ కృతనిశ్చయంతో ఉంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు సీఎం జగన్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిపే సమీక్షా సమావేశాల్లో అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనన్న సీఎం జగన్‌ వైఖరి ప్రజల్లోకి వెళ్లింది. క్షేత్రస్థాయిలో లంచాలు తీసుకునే అధికారులకూ ఈ విషయం బోధపడింది. అయినా లంచాలు తీసుకోవడం ఆపుతున్నారా..? ప్రజల ఫిర్యాదులు చేస్తే ప్రస్తుత విధానంలో ఏసీబీ ముందుకు కదిలే అవకాశం ఉందా..? అంటే ఏ మాత్రం లేదనే చెప్పాలి.

ప్రభుత్వ లక్ష్యం నిర్ధేశించుకోవడం బాగానే ఉన్నా అది చేరుకోవడానికి అవసరమైన మార్పులు చేర్పులు వ్యవస్థలోలో చేయడంలేదనేది నిపుణుల అభిప్రాయం. లంచాలు తీసుకుంటున్న అధికారులపై, లేదా ప్రజలు తమ దృష్టికి వచ్చిన అవినీతి కార్యకలాపాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం 14400 నంబరు ఏర్పాటు చేసి వదిలేసింది. కానీ పిర్యాదులు స్వీకరించడం, చర్యలు తీసుకోవడంలో నిబంధనలు మాత్రం పాతవే కొనసాగుతుండడం ప్రధాన అడ్డంకిగా మారింది.

అవినీతి నిరోదక శాఖ రెండు విధాలుగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒకటి.. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా ఆ అవినీతి అధికారిపై దాడులు చేసి పట్టుకోవడం.

రెండోది.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అనుమానం వస్తే తమకు తాముకు ప్రభుత్వ అధికారుల ఇళ్లలో సోదాలు చేయడం. ఇందులో రెండో అంశం.. ఏసీబీ పరిధిలోనిది. మొదటి అంశం మాత్రం ప్రజల ద్వారా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ పని చేస్తుంది.

ప్రజలు తమకు తాముగా ఏసీబీ అధికారులకు ఫోన్‌ చేసి ‘‘ అయ్యా.. ఫలానా అధికారి నా పని చేసేందుకు లంచం అడుగుతున్నారు. లంచం తీసుకున్నారు’’ అని చెబితే ఏసీబీ ఎలాంటి చర్య తీసుకోదు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఆ అధికారి లంచం అడిగినట్లు ఆడియో, లేదా వీడియో రూపంలో ఆధారం ఉండాలి. అదీ కూడా అధికారి తనకు తానుగా లంచం అడగినట్లు ఉండాలి. ఫిర్యాదుదారుడు ఇస్తానని అనకూడదు. ఇద్దరి మధ్య నగదు మొత్తంపై బేరసారాలు జరగాలి. ఇదంతా ఆ ఆడియో లేదా వీడియోలో రికార్డు అయి ఉండాలి. ఆ ఆధారాన్ని ఏసీబీ అధికారులకు పంపాలి. ఆధారం సరిౖయెనదో లేదో సరిచూసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతారు.

ఇంత తతంగంలో ఒక సామాన్యుడు తన పని కోసం వెళ్లి ఇందంతా చేయగలడా..? ఒక వేళ ప్రయత్నం చేసినా విజయవంతమైతే ఫర్వాలేదు. కానీ ఆ అధికారికి అనుమానం వస్తే ఆ వ్యక్తి సంగతి ఏమిటి..? అతనికి ఇక ఏపనైనా అవుతుందా..? ఏసీబీ రైడ్‌ తర్వాత అధికారితోపాటు, ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు కూడా మీడియాకు ఇస్తుంది. ఇది కూడా ఫిర్యాదుదారుడుకి ఇబ్బందికరమే. మరే పనికైనా సదురు వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే అధికారుల స్పందన వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది.

అందుకే ఫిర్యాదు చేసిన తర్వాత చర్య తీసుకునే విధానంలో మార్పు చేయాలి. ప్రజలు తమకు తాముగా ఎప్పడూ లంచాలు ఇవ్వరు. తమ పని కోసం సంబంధిత అధికారి పలుమార్లు తిప్పుతారు. చివరికి విసుగు వచ్చి లంచం ఇచ్చేందుకు సిద్ధమవుతారు. లంచం అధికారి అడిగి తీసుకున్నా.. సదరు వ్యక్తి ఇచ్చినా.. సరే ఏసీబీ దాడులు చేయాలి. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే అవినీతి తగ్గుతుంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అంతేకానీ ప్రజలు తమకు తాముగా నగదు ఇస్తే లంచం కాదన్న రీతిలో ఏసీబీ వ్యవరించినంత వరకూ అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదన్న విషయం పాలకులు గుర్తించాలి.

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో మాత్రమే ఏసీబీ కార్యాలయం ఉంది. ఇది కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకిగా మారుతోంది. ఏసీబీని ప్రజలకు మరింత చేరువ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఏసీబీ స్టేషన్‌ ఏర్పాటు చేయాలి. పోలీసు వ్యవస్థలాగా ఏసీబీని కూడా తీర్చిదిద్దాలి. సిబ్బందిని పెంచాలి. చివరగా.. ఏసీబీలో అవినీతిని కూడా నిర్మూలించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి