iDreamPost

మల్టీస్టారర్ సంస్కృతి పెరగాలి – Nostalgia

మల్టీస్టారర్ సంస్కృతి పెరగాలి – Nostalgia

తెలుగు సినిమా చరిత్రలో మొదటి పెద్ద స్టార్లుగా పేరొందిన వారు ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్ మరొకరు ఎఎన్ఆర్. మొత్తం 14 సినిమాల్లో కలిసి నటించారు. రేచుక్కతో మొదలుకుని రామకృష్ణులు దాకా ఈ జంట సృష్టించిన అద్భుతాలు ఎన్నో. ముఖ్యంగా గుండమ్మ కథ, మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమాలు చరిత్రలు లిఖించాయి. ఆ తర్వాత తరంలో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబుల మధ్య కూడా మంచి సఖ్యత ఉండేది. ఈ కాంబో ఎన్నో హిట్స్ ఇచ్చారు. 

కానీ మూడో తరం అంటే చిరంజీవి బాలకృష్ణల ఎంట్రీ తర్వాత వీటికి చెక్ పడింది. నాగార్జున వెంకటేష్ లది కూడా అదే దారి. ఎవరితో ఎవరూ కలిసి నటించలేదు. వీళ్ళ హయాంలో అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఒకే ఒక్కసారి గెస్టులుగా త్రిమూర్తులు అనే సినిమాలో జస్ట్ ఒక పాటలో కనిపిస్తారంతే. ఇక మళ్ళీ కలిసిన దాఖలాలు లేవు. కానీ బాలీవుడ్ లో దీనికి భిన్నమైన సంస్కృతి కనిపిస్తుంది

చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరి సినిమాలో మరొకరు పాత్రలు చేయడం లేదా క్యామియో అప్పియరెన్స్ ఇవ్వడం అక్కడ సాధారణం. అమితాబ్ బచ్చన్ కాలం నుంచి అక్షయ్ కుమార్ దాకా లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. ఖాన్ల ద్వయం వీటికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ఒక టైంలో వీళ్ళ కాంబినేషన్ లో కూడా కరణ్ అర్జున్, ధిల్లగి, డర్, దీవానే, దామిని లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. 

కానీ తెలుగుకు వచ్చేటప్పటికి మన హీరోలు మాత్రం మల్టీ స్టారర్ కు అంతగా మొగ్గు చూపడం లేదు. సమకాలీకులు కలిసి ఒకే సినిమాలో నటించడం లేదు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ దీనికి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. వెంకటేష్ చేస్తున్నారు కానీ ఆయన యూత్ బ్యాచ్ హీరోలతో కలిసి నటిస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, రామ్, నాని ఇలా లిస్టు పెద్దదే ఉంది. ఈ బ్యాచ్ అంతా కథ సాకుతో మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ వచ్చాకైనా ఇలాంటి ట్రెండ్ వేగమందుకుని క్రేజీ కాంబినేషన్లు పెరిగితే కనక టాలీవుడ్ లో బాలీవుడ్ ను తలదన్నే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆ టైం కోసం వేచి చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి