iDreamPost

Narasimhudu : నిర్మాతను నిలువునా ముంచేసిన గుడ్డి నిర్ణయం – Nostalgia

Narasimhudu : నిర్మాతను నిలువునా ముంచేసిన గుడ్డి నిర్ణయం – Nostalgia

పక్క భాషలో ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే చాలు దాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసి వెంటనే హక్కులు కొనుగోలు చేయడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే అది మన నేటివిటీకి, హీరో ఇమేజ్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ముందుగానే అలోచించి నిర్ణయం తీసుకుంటే కోట్ల రూపాయల పెట్టుబడులు సేఫ్ అవుతాయి. లేదంటే నిర్మాత పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. 2004లో కన్నడలో సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ టైటిల్ పాత్రలో దుర్గి వచ్చింది. దీనికి సాయికుమార్ తమ్ముడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ దర్శకుడు. డైరెక్టర్ గా ఆయన డెబ్యూ ఇది.

పక్కా ఊర మాస్ అవతారంలో మాలాశ్రీ విశ్వరూపం చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మూగదానిగా రెండో సగంలో పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశారు. దెబ్బకు దుర్గి కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు హ్యాట్రిక్ డిజాస్టర్లు పలకరించాయి. ఆ సమయంలో నిర్మాత చెంగల వెంకట్రావు ఈ దుర్గి ప్రతిపాదనను తారక్ ముందు ఉంచారు. బాబాయ్ కి సమరసింహారెడ్డి లాంటి క్లాసిక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కావడంతో యంగ్ టైగర్ ఎక్కువ ఆలోచించలేదు. పచ్చ జెండా ఊపేశారు. కొన్ని మార్పులతో పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.

సమీరా రెడ్డి హీరోయిన్ గా ఎంపిక కాగా పవన్ కళ్యాణ్ బద్రి, కహో నా ప్యార్ హైతో పాపులారిటీ తెచ్చుకున్న అమీషా పటేల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. 2005 మే 20న భారీ అంచనాల మధ్య విడుదలైన నరసింహుడు అభిమానుల అంచానాలు కనీస స్థాయిలో అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది. సగం సినిమా ఎన్టీఆర్ కు మాటలే లేకపోవడం, ఎప్పుడో పాత కాలం చింతకాయపచ్చడిలాంటి ఫ్లాష్ బ్యాక్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం ఫలితాన్ని దెబ్బ తీసింది. అసలు ఒక లేడీ ఆర్టిస్టు చేసిన సినిమాని అంత ఇమేజ్ ఉన్న తారక్ తో చేయించడం మిస్ ఫైర్ అయ్యింది. దీనికన్నా రెండు వారాల ముందు వచ్చిన జూనియర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ అతనొక్కడే బ్లాక్ బస్టర్ కావడం ఫైనల్ ట్విస్ట్. దీనికి వచ్చిన నష్టాలకు నిర్మాత వెంకట్రావు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు

Also Read : Police Story : జాతకాలు మార్చేసిన పవర్ఫుల్ పోలీస్ సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి