iDreamPost

అందరి చూపు థాంక్ యు మీదే

అందరి చూపు థాంక్ యు మీదే

ఎల్లుండి విడుదల కాబోతున్న థాంక్ యు మీద నిర్మాత దిల్ రాజే కాదు ట్రేడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ది వారియర్ నిరాశపరచడంతో థియేటర్లు మళ్ళీ ఎప్పుడు కళకళలాడతాయాని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే చెప్పుకోదగ్గ భారీ బజ్ లేదు కానీ మజిలీ టైపులో పాజిటివ్ టాక్ వస్తే చాలు మంచి కలెక్షన్లు దక్కుతాయనే నమ్మకం కనిపిస్తోంది. ఆ సినిమాకు సమంతా ఎంత బలమయ్యిందో చూశాం. లవ్ స్టోరీని సాయిపల్లవి లేకుండా ఊహించుకోలేం. కానీ ఇప్పుడీ థాంక్ యులో మొత్తం చైతు భుజాల మీదే నడుస్తోంది. హీరోయిన్ రాశిఖన్నా ఉంది కానీ పైన క్యారెక్టర్స్ లో ఉన్నంత వెయిట్ తనకు లేకపోవడం కొంత లోటే.

టికెట్ రేట్ల విషయంలోనూ చాలా సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు దిల్ రాజు చెప్పారు కానీ వాస్తవానికి పరిస్థితి దానికి కొంచెం తేడాగా కనిపిస్తోంది. నైజామ్ సింగల్ స్క్రీన్లలో 100 రూపాయలు ప్లస్ జిఎస్టి అన్నారు కానీ దానికి భిన్నంగా 150, 175 ఆన్ లైన్ బుకింగ్ లో చూపించడం ట్విస్ట్. మల్టీ ప్లెక్సుల్లోనూ 200 పైనే పెట్టేశారు. కేవలం ఒక్క టికెట్ కి జిఎస్టినే 50 రూపాయలు ఉండదుగా. మేజర్ తరహాలో దీన్ని తర్వాత సరిచేస్తారేమో చూడాలి. థియేటర్ల దగ్గర జనాలు బాగా పల్చబడిపోతూ చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా బాగుందంటేనే తప్ప ఆక్యుపెన్సీలు కనిపించడం లేదు. అలాంటప్పుడు థాంక్ యు ఖచ్చితంగా ఏదో ఒక మేజిక్ చేసే తీరాలి.

అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ప్రస్తుతానికి చాలా నెమ్మదిగా ఉన్నాయి. సాఫ్ట్ అండ్ ఎమోషనల్ లవ్ జర్నీ కావడంతో మాస్ ఆడియన్స్ కి థాంక్ యు మీద ఇంకా ఫోకస్ వెళ్ళలేదు. మనం, ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ కు దీని సక్సెస్ చాలా కీలకం. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ తీవ్రంగా నిరాశపరచడంతో దీంతో బలంగా కంబ్యాక్ చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఆశ్చర్యంగా తమన్ పాటలు వెళ్లాల్సిన రేంజ్ లో మ్యూజిక్ లవర్స్ కు చేరలేదు. బాగున్నాయనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ చార్ట్ బస్టర్స్ లిస్టులోకి చేరలేదు. మరి రిలీజయ్యాక ఏమైనా ప్లస్ అవుతాయోమో చూడాలి. సో అందరి ఆశలు ఇప్పుడు థాంక్ యు మీదే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి