iDreamPost

అంతు చిక్కని అస్వస్థత.. యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం చర్యలు..

అంతు చిక్కని అస్వస్థత.. యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం చర్యలు..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలకు వస్తున్న అస్వస్థత అంతు చిక్కలేదు. స్థానికంగా చేసిన అన్ని వైద్య పరీక్షలు నార్మల్‌గానే ఉండడంతో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ బృందాన్ని రప్పిస్తున్నారు. అలాగే ప్రత్యేక వైద్య బృందాలు కూడా ఏలూరు పట్టణంలో అన్ని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ బృందం కూడా ఏలూరు చేరుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా ఏలూరు పర్యటనకు రానున్నారు. ఇప్పటికే రాష్ట్ర వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటి వరకు వ్యాధి భారిన పడడానికి ఎటువంటి రీజన్స్‌ కన్పించకపోవడంతో, రోగులకు ఉన్న లక్షణాలు ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. ఆ చికిత్సతోనే రోగులు కోలుకుంటున్నారు. వ్యాధి భారిన పడ్డవారి ఇల్లు, ఆ చుట్టుపక్కల నీటిని కూడా ఇప్పటికే పరీక్షించారు. నీరు, ఇతర పరిస్థితులు బాగానే ఉన్నట్లు తేలింది. పాల శాంపిల్స్‌ను కూడా వైద్య పరీక్షలుకు పంపించారు. రిపోర్టు రావాల్సి ఉంది. పశు వ్యర్ధాలు లేదా, న్యూరో టాక్సిక్స్‌ నీటిలో కలవడం వల్ల ఇటువంటి అనారోగ్యం కల్గిస్తుందా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి నిర్ధిష్టమైన పరిస్థితులు అక్కడ కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి వైద్య పరిశోధక బృందాలను ఏలూరు రప్పిస్తున్నారు. వారి పరిశీలన, పరీక్షల్లోనైనా గుర్తు తెలియని అస్వస్థతకు కారణాలు బైటపడతాయని ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా త్రాగునీరు, ఆహారం, అస్వస్థతకు గురైన వారి సిటీస్కాన్‌ ఇతర రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఇప్పటికే స్పష్టం చేసారు. ఈ కోలీ పరీక్షతో పాటు, కల్చర్‌ టెస్టు నివేదికలు అందాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు పట్టణం మొత్తాన్ని వైద్య బృందాలు జల్లెడ పడుతున్నాయి. స్పృహకోల్పోవడం, వికారం, వాంతులు, ఫిట్స్‌ లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వారిని గుర్తించి వైద్య చికిత్సకు తరలిస్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారిని ఏలూరులోను, కొంచెం తీవ్ర లక్షణాలున్నవారిని విజయవాడ ఆసుపత్రులు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ అస్వస్థత ప్రాణాంతకం కాదని ప్రాథమికంగా వైద్యులు చెబుతున్నారు.

గుర్తు తెలియని అస్వస్థతతో ఇప్పటి వరకు 290 మంది వైద్య సహాయం అవసరం అని గుర్తింగా, వారిలో 177 మంది చికిత్స అనంతరం ఇళ్ళకు చేరుకున్నారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్‌ అనే వ్యక్తి ఇవే లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతుండగా బాత్‌రూమ్‌కు వెళ్ళి అక్కడ క్రింద పడి మృతి చెందారు. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా తీవ్ర లక్షణాలు కన్పించడంతో అయిదుగురిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకు వెళ్ళి వైద్యం అందిస్తున్నారు. మరో నలుగురికి విజయవాడలో చికిత్స చేస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు, హైబీపీ, మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పితే మిగిలిన వారికి అస్వస్థతకు గురై లక్షణాలు కన్పించినప్పటికీ వెంటనే చికిత్సకు స్పందించి కోలుకుంటున్నారని వైద్య బృందాలు చెబుతున్నారు.

ఇప్పటి వరకు అస్వస్థత లక్షణాలు గుర్తించినవ వారెవ్వరికీ కోవిడ్‌ 19 లేదని వైద్యులు తెలిపారు. ఆసుపత్రులకు వచ్చిన వెంటనే వారికి కోవిడ్‌టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. వారెవర్వికీ కోవిడ్‌ లేదని ఖరారు చేసారు. కోవిడ్‌పరీక్షతో పాటు మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటి పరీక్షలు కూడా చేసారు. వాటి లక్షణాలు కూడా లేవని తేల్చారు. బాధితులకు స్పృహతప్పడం, ఫిట్స్, కొద్ది సేపు ఊరిపి ఆడకపోవడం లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయి. జ్వరంగానీ, వాంతులు/విరేచనాలు గానీ, ఇతర అనారోగ్య లక్షణాలేవి ఇప్పటి వరకు ఆసుపత్రులకు వచ్చిన రోగుల వద్ద గుర్తించలేదు. ప్రభుత్వ ఆసుపత్రులకే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు కూడా భారీగానే రోగులు వెళ్ళారని ముందుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆ సంఖ్య పెద్దగా లేదని ప్రభుత్వ వైద్యులు తేల్చారు.

ఏలూరు పడమర వీధి, కొత్తవీధి, దక్షిణ వీధి ప్రాంతాల్లో ముందుగా అస్వస్థత లక్షణాలు గుర్తించారు. అయితే క్రమంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఆసుపత్రులకు వచ్చారు. అయితే శనివారం వచ్చినంత మంది రోగులు ఆ తరువాత లేకపోవడంతో భయపడాల్సిన అవసరం లేదని ఏలూరు వాసులకు పదేపదే ప్రభుత్వ ఆధికారులు, వైద్య బృందం స్పష్టం చేస్తోంది. లక్షణాలు కన్పించిన వారు కూడా వెంటనే కోలుకుంటున్నారని, అనవసర భయాలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రాథమికంగా అన్ని వైద్య పరీక్షల నివేదికలు నార్మల్‌గానే ఉన్నట్లుగా తేలిన నేపథ్యంలో వైరాలజీ ల్యాబుల్లో కల్చర్‌ సెల్స్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ / సెరి కల్చర్‌ టెస్ట్‌ల ఫలితాల ద్వారా మాత్రమే ఈ వ్యాధి ఏంటన్నది తేలాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు యథాశక్తి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కలుషిత నీటి కారణంగానే ఏలూరులో అశ్వస్థతకు గురయ్యారని చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా పేర్కొంటే. ఏలూరులో ఎప్పట్నుంచో జల, వాయు కాలుష్యాలు పెరిగిపోయాయని గతంలోనే పలు సర్వేలు చెప్పాయని పవన్‌ ఒక ప్రకటన విడుదల చేసేసారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి