iDreamPost

యువ ఎంపీని ఇరికించాలని చూస్తున్న ప్రత్యర్ధులు

యువ ఎంపీని ఇరికించాలని చూస్తున్న ప్రత్యర్ధులు

కాయలున్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్న సామెత మనందరికీ బాగా తెలుసు. అంటే .. పని చేసే వారికే కష్టాలు ఎక్కువ అని అర్థం. రాజకీయాల్లో ఇది ఇప్పుడు పరాకాష్టకు చేరింది. మంచి పనులకు ప్రశంసల సంగతి దేవుడెరుగు.. ఆ మంచి పనులు కనిపించకుండా బురద చల్లడం బాగా పెరిగింది. రాజకీయ స్వార్థం బాగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యసాధకుడు అయిన రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌రామ్‌ ప్రస్తుతం.. పైన చెప్పుకున్నట్లు బురద కడుక్కుంటున్నారు. కొద్ది రోజులుగా కొందరు పనిగట్టుకుని ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తూ.. ‘మేము బురద చల్లుతున్నాం.. మీరు కడుక్కోండి’ అంటున్నారు. బేస్‌లెస్‌గా కథనాలు రాయిస్తున్నారు. ఏమి ఆశించి ఇలా చేస్తున్నారని.. ఆయన గురించి తెలిసిన కొందరు కాస్తా లోతుల్లోకి వెళ్లి ఆరా తీశారు. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

మంచితనమే శాపమైందా?
మార్గాని భరత్‌ సౌమ్యుడు. మృధు స్వభావి. తన దృష్టికి వెళ్లిన సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు పని చేసే తత్వం కలవాడు. సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్య సాధన కోసం.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు అడుగులేస్తున్నారు. ఈ లక్షణాలే ఆయనకు శాపమయ్యాయని పలువురు చెబుతున్నారు. ఈ లక్షణాలకు తోడు పలు మంచి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టడం వల్ల కొందరు రాజకీయ నాయకులకు భవిష్యత్‌పై బెంగ పట్టుకుందట. అందుకే ప్రత్యక్షంగా, పరోక్షంగా భరత్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ట్రోలింగ్‌కు ఆజ్యం పోశారని స్పష్టమవుతోంది.

వ్యూహాత్మకంగా బురద రాజకీయం

‘ఎక్కడో సినిమాలు చేసుకుంటున్న పిల్లాడిని తెచ్చి ఎంపీ సీటిచ్చారు. ఏం గెలుస్తాడులే అనుకున్నాం. మామూలుగా గెలవడమే కాదు. ప్రజల్లో దూసుకుపోతున్నాడు. ఆయన చెప్పిందే జరుగుతోంది. ఇట్లాగైతే రేపు ఆయా నియోజకవర్గాల్లో మా వాళ్ల సంగతి ఏమిటి?’ అని ఓ నాయకుడు ఇటీవల ఓ రోజు సాయంత్రం తర్వాత సోడా తాగుతూ.. చిప్స్‌ నములుతూ పండ్లు కొరికాడట. ‘అందుకే ఏం చేయాలో అది చేస్తాం. వాళ్ల వేలితో వాళ్ల కన్నే పొడిపిస్తాం. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి’ అన్నాడట. ఆ తర్వాత రెండు మూడు రోజుల నుంచే సోషల్‌ మీడియాలో భరత్‌పై వ్యతిరేక మెసేజ్‌లు మొదలయ్యాయట.

నవ్విపోదురు గాక..

ఒక అబద్ధం చెబితే అతికినట్లుండాలంటారు పెద్దలు. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గంటూ.. భరత్‌పై వచ్చిన ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. రాజానగరం అసెంబ్లీ పరిధిలోని కాపవరం, బూరుగుపూడిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం సేకరించిన భూముల్లో కుంభకోణం జరిగిందన్నది ఆరోపణ. నాణ్యత లేని (ఆవ) భూములకు.. ఎకరాలకు రూ.45 లక్షల వరకు వెచ్చించారని.. ఇందులో పెద్ద మొత్తం చేతులు మారిందని.. వాస్తవానికి ఆ భూములు ఎకరం రూ.7 లక్షలకు మించవని ప్రచారం లేవనెత్తారు. ‘గోదావరి జిల్లాల్లో నిజంగా ఎకరం భూమి.. ఎలాంటిదైనా సరే 7 లక్షల రూపాయలకు వస్తుందా? ఇంత తక్కువ ధరకు ఎవరైనా అమ్ముకుంటారా? నిజంగా అమ్మితే చెప్పండి.. వందలాది ఎకరాలు కొనుగోలు చేయడానికి మేం సిద్ధం’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు.

సీఎం కొట్టడం వాళ్లు చూశారా?

ఎంపీ భరత్‌ను సీఎం పిలిపించారట.. నిలదీశారట.. ప్రశ్నించారట.. కొట్టారట.. ఇదీ ప్రచారం సాగుతున్న తీరు. వివిధ పనుల నిమిత్తం ఒక పార్లమెంట్‌ సభ్యుడు ముఖ్యమంత్రిని కలవడం అన్నది మామూలు విషయం. ఆ సమయంలో వన్‌ టూ వన్‌ కూర్చొని వారిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుని ఉండొచ్చు. వారేం మాట్లాడుకున్నారనేది వారిద్దరికే తెలుసు. ఆ విషయాలు బయటకు తెలియాలంటే జగన్‌మోహన్‌రెడ్డి అయినా చెప్పాలి.. లేదా భరత్‌ అయినా చెప్పాలి. ఎంపీని సీఎం కొట్టారని ప్రచారం చేస్తున్న, చేయిస్తున్న వాళ్లకు భరత్‌ అనుచరగణం ఒక ప్రశ్నను సంధిస్తోంది. ‘సీఎం కొడుతుండగా మీరు చూశారా? సీఎం తిడుతుండగా మీరు విన్నారా?’ అని నిగ్గదీస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శైలి గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వారెవరూ ఇంత దారుణంగా ఆరోపణలు చేయరని చెబుతున్నారు. తను బాగా ఇష్టపడే వారి భుజంపై చరచడం.. కడుపులో సుతిమెత్తగా పిడికిలితో టచ్‌ చేయడం సీఎంకు అలవాటు అనే విషయం వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులందరికీ తెలిసిన విషయమే అంటున్నారు. ఇటీవల భరత్‌ జన్మదినం సందర్భంగా స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా కేక్‌ తినిపిస్తుండటాన్ని ఏమంటారు? ఇది వారికి కనిపించలేదెందుకు? అని నిలదీస్తున్నారు.

పనితీరుతో కన్నుకుట్టింది..
‘ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 90 శాతం హామీలు నెరవేర్చి.. తిరుగులేని నేతగా నిలిచారు. మా ఎంపీ మార్గాని భరత్‌ కూడా సీఎం అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన లక్ష్యం మేరకు పని చేస్తున్నారు. అందువల్లే కొందరికి కన్ను కుట్టింది’ అని ఎంపీ అనుచరులు చెబుతున్నారు.

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషలపై మంచి పట్టు ఉన్న ఎంపీ భరత్‌.. తన ప్రతిభను పార్లమెంట్‌ వేదికగానే నిరూపించుకున్నారని ఉదహరిస్తున్నారు. పీఎంఏవై పథకంలో ఇళ్లపై సోలార్‌ ఫలకాలు, వర్టికల్‌ గార్డెనింగ్‌.. విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహం ద్వారా కాలుష్య నివారణ, తదితర అంశాలపై ఆయన ప్రసంగం పట్ల ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

బీసీ సంక్షేమ సంఘం చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు కుమారుడిగా కంటే తన సొంత ఇమేజ్‌తోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో జగన్‌ అడుగులో అడుగు వేసేందుకు సినీ రంగాన్ని వదులుకుని వచ్చారు.

ఎంపీగా అటు ఢిల్లీలో, ఇటు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో.. ఈ ఏడాది కాలంలో భరత్‌ సమర్థవంతంగానే వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

corruption is a true enemy to development. The worst disease in the world today is corruption. And there is a cure : That is transparency.

అవినీతి అనేది అభివృద్ధికి నిజమైన శత్రువు. ఈ రోజు ప్రపంచంలో ఒక చెత్త వ్యాధి అవినీతి. అయితే ఈ వ్యాధికి నివారణ ఉంది. అదేమంటే ‘పారదర్శకత’.

ఈ సూత్రం ఆధారంగా అవినీతి రహిత పాలన కోసం పరితపిస్తున్న తమ ఎంపీ పట్ల కొందరు దుర్మార్గంగా వ్యవహరించడం తగదని, నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

సామాజిక సేవలో సైతం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కమ్ముకొని జనజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఎంపీ భరత్‌.. దూకుడుగా వ్యవహరించారు. రెడ్‌ జోన్లలో ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని, తాము అండగా నిలిచి.. ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని స్వయంగా ఆయనే మైకు పట్టుకుని వీధుల్లో తిరగడం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది.

ఆధ్యాత్మిక భావాలూ పుష్కలంగా కలిగిన ఎంపీ భరత్‌ రామ్‌.. ఏడాది పాలన విజయవంతమైన నేపథ్యంలో లోక కల్యాణార్థం ఇటీవల తన కార్యాలయ ప్రాంగణంలో ధన్వంతరీ సహిత మహా సుదర్శన యాగం, రాజశ్యామల సహిత రుద్రయాగం నిర్వహించారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలకు దిగుతున్న వారికి దేవుడు మంచి బుద్ది ప్రసాదించాలని ఈ సందర్భంగా ఎంపీ అనుచరులు కొందరు కోరుతుండగా, నడక మార్చుకోకపోతే భరతం పడతామని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి