iDreamPost

కార్యనిర్వాహక రాజధానిపై విజయసాయి రెడ్డి తాజా ప్రకటన వెనుక ఆంతర్యం అదేనా..?

కార్యనిర్వాహక రాజధానిపై విజయసాయి రెడ్డి తాజా ప్రకటన వెనుక ఆంతర్యం అదేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి మూడు రాజధానులను ప్రకటించిన వైసీపీ సర్కార్‌.. తన లక్ష్యానికి అనుగుణంగా వెళుతోంది. మరో వైపు అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలంటూ అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు రాజధానులు అంశంపై కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సాగుతోంది. లక్ష కోట్లు ఒకచోటే పెట్టాలా..? రాష్ట్రంలోనూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకోవాలా..? అనే అంశంపై గత ఏడాదిగా చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకే జై కొట్టారని అమరావతి ఉద్యమానికి వస్తున్న స్పందనతో ఈపాటికే అర్థమైంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీశాయి. విశాఖకు త్వరలో కార్యనిర్వాహక రాజధాని వస్తుందని చెప్పిన విజయసాయి రెడ్డి.. ప్రభుత్వ భవనాలు అన్నీ ప్రభుత్వ స్థలాల్లోనే ఏర్పాటవుతాయని చెప్పారు. అమరావతిలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకునే విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు సాగుతున్నాయి. అమరావతిలో రాజధాని అంటూ.. భారీ స్థాయిలో ప్రైవేటు భూములను సేకరించారు. దీనిపై రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే టీడీపీ ప్రభుత్వం నాయానో భయానో బెదిరించి వారిని అణిచివేసింది. ఆ తర్వాత ఏడాదికే అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు భూములు సేకరించడం వల్ల ప్రభుత్వానికి భారంగా మారుతుంది. ఇలాంటి అనుమానాలకు, సమస్యలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కార్యనిర్వాహక రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ భూములనే ఉపయోగించుకుటామనే ప్రకటనను విజయసాయి రెడ్డి చేసి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విశాఖ నగరంలోనూ, పరిసర ప్రాంతంలోనూ ప్రభుత్వ భూములకు కొరతే లేదు. అయతే టీడీపీ ప్రభుత్వ హాయంలో భారీ మొత్తంలో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను పూర్తి చేసింది. నివేదికను ప్రభుత్వానికి అందివ్వడమే మిగిలి ఉంది. ఈ లోపు ప్రభుత్వ భూముల ఆక్రమణను గుర్తిస్తున్న అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో బీజీగా ఉన్నారు. ఇటీవల గంటా శ్రీనివాస రావు అనుచరులు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం వద్ద పెద్ద మొత్తంలో భూములు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు.. ఇతర అభివృద్ధి పనులకు వాటిని కేటాయించే అవకాశం ఉంటుందనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఏమైనా.. కార్యనిర్వాహక రాజధానిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటుకానుండడం స్వాగతించదగ్గ పరిణామం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి