iDreamPost

ఇది ‘నారాయణ’ ఇజం

ఇది ‘నారాయణ’ ఇజం

‘అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’.. అంటూ కమ్యూనిస్టు పార్టీ జాతీయకార్యదర్శి కె. నారాయణ ఎదుటివారి గుండెలదిరించే స్టేట్‌మెంటొకటి ఇచ్చేసారు. ఆయన ఉన్న పార్టీ మౌలిక సిద్ధాంతాలనే మర్చిపోయారో లేక ‘మనస్సు’లో ఉన్న నాయకులకు మంచి చేయాలనుకునే తాపత్రయ పడ్డారో గానీ నారాయణ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ ఇప్పుడు భారీగానే ట్రోల్‌ అవుతోంది.

అభివృద్ధి అందరికీ, అన్ని ప్రాంతాలకీ సమానంగా అందాలన్న సిద్ధాంతాన్నే కమ్యూనిస్టు పార్టీలు చెబుతుంటాయి. ఆ పార్టీలో ఉన్న నారాయణ మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు చేయడం పట్ల విమర్శలు రేకెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల సొమ్ము ఒక లక్ష్మన్నర కోట్లు ఖర్చు చేసి ఒక్క అమరావతి నగరాన్నే అభివృద్ధిచేయడం ఎంత వరకు సమంజసం అంటూ అధికార పార్టీ నాయకులు ఒక పక్క వివరిస్తూనే ఉన్నారు. ఇది రాష్ట్రంలోని జన సామాన్యానికి కూడా అర్ధమవుతోంది. ఇంత భారీ మొత్తం ప్రజాధనాన్ని రాష్ట్రం మొత్తం వినియోగించాల్సి ఉండగా, ఒక్క అమరావతి కోసం మాత్రం తెలుగుదేశం, కమ్యూనిస్టు, బీజేపీ, కాంగ్రెస్‌ తదితరాది పార్టీలన్నీ పట్టుబట్టడం పట్ల ప్రజానీకం విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. అన్ని ఆర్ధిక వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలే ఇంత మొత్తాన్ని ఒకే ప్రాంతానికి కేటాయించడానికి మొగ్గు చూపవు. కానీ నారాయణ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అమరావతి కోసం ప్రాణాలైనా త్యాగం చేస్తానని ఏ ప్రాతిపదికన చెబుతున్నారన్నదే ఇప్పుడు విమర్శకుల నుంచి సూటిగా వస్తున్న ప్రశ్న.

కమ్యూనిస్టులకు కులం, మతం ఆపాదించేందుకు ఎవ్వరూ మొగ్గు చూపరు. కానీ నారాయణ చేసే ఇటువంటి ఏకపక్ష కామెంట్లు కారణంగా ఇటువంటి వాటిని కూడా ఎత్తిచూపించాల్సి వస్తోందని అధికార పార్టీ నాయకుల నుంచి వినవస్తోంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఒక వర్గం వారికే అత్యధికంగా భూములు ఉన్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగి బినామీల పేరిట భూములు కొట్టేసారని అధికార వైఎస్సార్‌సీపీ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. ఈ మేరకు దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిబద్ధతతో వ్యవహరించే కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ నారాయణ ఇటువంటి కామెంట్లు చేయడం తగదని హితవు పలుకుతున్నారు.

అభివృద్ధి అందరికీ, అధికార వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు అన్న మౌలిక సిద్ధాంతం మేరకు సీయం జగన్‌ మూడురాజధానుల ప్రకటన చేసారని అధికార పారీ వారి వాదన. అయితే ఇదే మూల సిద్ధాంతంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలో ఉండే నారాయణ మాత్రం ఏకపక్షంగా, అది కూడా అమరావతి పోరాటాన్ని భుజానికెత్తుకున్న పార్టీలకు అనుకూలంగా మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి