iDreamPost

చిక్కుల్లో చంద్రబాబు శిష్యుడు

చిక్కుల్లో చంద్రబాబు శిష్యుడు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒకప్పటి శిష్యుడు, తెలంగాణ రాష్ట్రం మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గోనేపల్లిలో 10.20 ఎకరాల భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు తేల్చారు. ఆ భూమి తమదని వడ్డే హనుమయ్య, వడ్డే లక్ష్మయ్యలు అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. రేవంత్‌ రెడ్డి అతని తమ్ముడు కొండల్‌ రెడ్డిలు తమ భూమిని ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులపై రంగంలోకి దిగిన అధికారులు గత ఐదు రోజులుగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళా భూ రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. రేవంత్‌ రెడ్డికి అక్కడ సెంటు భూమి కూడా లేదని, ఆ భూమిని వారు ఆక్రమించారని నిర్ధారిస్తూ సిద్ధం చేసిన నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఈరోజు మంగళవారం అందజేశారు.

10.20 ఎకరాల భూమిని ఆక్రమించిన రేవంత్‌ రెడ్డి సోదరులు.. ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. చెరువులకు సమీపంలోని ఆ భూమిలో వోల్టా చట్టం ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే చట్టాన్ని అతిక్రమించి ప్రహరి నిర్మించిన రేవంత్‌ రెడ్డి, కొండల్‌ రెడ్డిలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కూడా ఆర్డీవో చంద్రకళా తన నివేదికలో సిఫార్సు చేశారు. భూమి తమదని చెబుతున్న వడ్డే హనుమయ్య, వడ్డే లక్ష్మయ్యల వద్ద ఉన్న పత్రాలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ భూమివారిదని తేలిదే వారికి అప్పగించనున్నారు.

తాజా వ్యవహారంతో ఎంపీ రేవంత్‌ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. కబ్జా నిజమని తేలడం, వోల్టా చట్టం అతిక్రమణ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. గండిపేట సమీపంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వోల్టా చట్టం అతిక్రమించి 25 ఎకరాల్లో ఫాం హౌస్‌ నిర్మించుకున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి నిన్న సోమవారం ఆక్కడ హాడావుడి చేశారు. తాను చెప్పేది నిజమని నిరూపిస్తానంటూ అక్కడకు వెళ్లబోయారు. పోలీసులు ఆయన్ను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. రేవంత్‌ రెడ్డి కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకే కేటీఆర్‌పై ఆరోపణలు చేసి హడావుడి చేశారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా రేవంత్‌ రెడ్డి ఆక్రమణలు నిజమని తేలడంతో టీఆర్‌ఎస్‌ నాయకులకు అస్త్రం దొరికినట్లైంది. ఈ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి ఏం చేస్తారన్నది వేచి చూడాలి.

Read Also : సీఎం జగన్‌ కీలక ప్రకటన

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి