iDreamPost

దేశముదురు హీరోయిన్‌లా సన్యాసం తీసుకుందామని…

దేశముదురు హీరోయిన్‌లా సన్యాసం తీసుకుందామని…

ఎక్కడైనా తల్లిదండ్రులు మందలిస్తే పిల్లలు ఒక రోజు అలిగి అన్నం తినకపోవడమో లేదంటే రెండు రోజులు బంధువుల ఇళ్లకో వెళ్తారు. ఇదంతా ఎందుకు అనుకున్నారో ఏమో ఇద్దరు బాలికలు ఏకంగా దేశముదురు సినిమాలో హీరోయిన్‌లా సన్యాసంలోకి మారాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా కశ్మీర్‌కు బయలుదేరారు. అయితే తల్లిదండ్రులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో బాలికలను సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించి వెనక్కు తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం కలిగించింది. పిల్లలపై సినిమాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఘటన ద్వారా వెల్లడైంది.

Read Also: మన పిల్లలే మన ఆస్తి…

వివరాల్లోకి వెళితే.. పలమనేరులో నివాసం ఉంటున్న విశ్వనాథ్‌ దంపతులకు ఇద్దరు కవల పిల్లలున్నారు. వారిని తిరుపతిలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సెలవులు రావడంతో పిల్లలు ఇంటి కొచ్చారు. అయితే బాలికలు ఎప్పుడూ సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండంతో తల్లి సున్నితంగా మందలించింది. దీంతో వారు అమ్మపై అలిగి ముభావంగా ఉంటుండడంతో తండ్రి పిల్లలను తమిళనాడులోని కాట్పడిలో ఉన్న బంధువుల ఇంటికి మూడు రోజుల కిందట తీసుకెళ్లాడు. అక్కడ వేరే పనిమీద తండ్రి బయటకు వెళ్లగానే బాలికలిద్దరూ అక్కడ రైల్వేస్టేషన్‌లో కనిపించిన రైలును ఎక్కేశారు. తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశారు.

Read Also: యువతరం దారెటు?

ఇంటికొచ్చిన తండ్రికి పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళనతో భార్యకు సమాచారమిచ్చాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు పలమనేరు పోలీసులుకు సమాచారమిచ్చారు. ఘటన జరిగింది తమిళనాడులోని కాట్పడిలో కావడంతో పలమనేరు సీఐ వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును కాట్పడికి బదిలీ చేశారు. తర్వాత సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. బుధవారం నాడు బాలికలు సెల్‌ఫోన్‌ ఆన్‌ చేయడంతో పోలీసులు వారి జాడ తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న బాలికలను పోలీసులు గుర్తించి పలమనేరు తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లో పిల్లలను విచారించగా.. తమకు జీవితం మీద విరక్తి వచ్చిందని, అందుకే సన్యాసులుగా మారిపోదామని వెళ్లిపోయామని చెప్పారు. దేశముదురు సినిమాలో హీరోయిన్‌లా సన్యాసం తీసుకోవాలంటే కశ్మీర్‌ వెళ్లొచ్చని తమ స్నేహితురాలు చెప్పడంతో కశ్మీర్‌ బయలుదేరామని చెప్పడంతో అక్కడున్నవారంతా షాక్‌ తిన్నారు. తర్వాత ఇద్దరు బాలికలకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

Written By – Mohan 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి